'రా ఎన్టీఆర్'.. ఎందుకా నిర్ణయం?
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఏర్పాటైనట్లు చెప్పుకున్న రా ఎన్టీఆర్ సంస్థ గురించి రీసెంట్ గా పెద్ద ఎత్తున చర్చ జరిగింది.
By: M Prashanth | 23 July 2026 1:32 PM ISTకొద్ది రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసిన రా ఎన్టీఆర్ సంస్థ.. ఇప్పుడు అనూహ్యంగా బ్రేక్ వేసింది. వంద కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు చేపడతామని, ఊరు-వాడ పేరుతో గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రకటించిన ఆ సంస్థ.. ఇప్పుడు తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, విజయం సాధించిన వారందరికీ తమ అభినందనలంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు మరింత చర్చకు కారణమైంది.
జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పేరిట ఏర్పాటైనట్లు చెప్పుకున్న రా ఎన్టీఆర్ సంస్థ గురించి రీసెంట్ గా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఇందుకోసం సుమారు రూ.100 కోట్ల నిధులు వినియోగిస్తామని సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఆ సంస్థపై దృష్టి పడింది. కొందరు దీనిని తమిళ హీరో విజయ్ అభిమాన సంఘాల కార్యకలాపాలతో పోలుస్తూ, భవిష్యత్తులో ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశానికి ఇది సిగ్నలా అనే చర్చను కూడా తెరపైకి తీసుకొచ్చారు.
అయితే, ఆ ప్రచారానికి ఎన్టీఆర్ కార్యాలయం త్వరగానే చెక్ పెట్టింది. రా ఎన్టీఆర్ సంస్థతో తమకు ఎలాంటి సంబంధం లేదని, హీరో ఎన్టీఆర్ పేరు, ఇమేజ్ ను ఉపయోగించి ఎవరూ వ్యక్తిగత ప్రచారం చేసుకోవద్దని ఆయన పీఆర్ బృందం స్పష్టం చేసింది. ఇదే సమయంలో అధికారిక అభిమాన సంఘాల నుంచి కూడా ఆ సంస్థపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
వివాదం మరింత పెరగడంతో రా ఎన్టీఆర్ ప్రతినిధి సాయిరూప్ మీడియా ముందుకు వచ్చారు. తమ ఉద్దేశం పూర్తిగా సామాజిక సేవేనని, గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాకుండా, తమను ఎన్టీఆ ర్‌కు దూరం చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తాము ఎన్నిసార్లు కలవాలని ప్రయత్నించినా, కొన్ని వర్గాలు అడ్డుకుంటున్నాయని కూడా పేర్కొన్నారు.
అయితే, సంస్థ ప్రకటించిన రూ.100 కోట్ల నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? వాటిని ఎలా వినియోగిస్తారు? వంటి ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలు రాకపోవడంతో సోషల్ మీడియాలో విమర్శలు మరింత పెరిగాయి. మరోవైపు, ఎన్టీఆర్ అభిమానుల్లోనూ ఆ వ్యవహారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే సంస్థపై ఒత్తిడి పెరిగిందనే ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా, తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రా ఎన్టీఆర్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు కొత్త డౌట్లు తీసుకొచ్చింది.
నిజంగానే కొందరు ఆ కార్యక్రమాన్ని అడ్డుకున్నారా? లేక వివాదాలు మరింత పెరగకుండా ఉండేందుకే నిర్ణయం తీసుకున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే, తమ నిర్ణయానికి గల అసలు కారణాలను మాత్రం రా ఎన్టీఆర్ నిర్వాహకులు ఇప్పటివరకు వెల్లడించలేదు. దీంతో ఆ వ్యవహారంపై స్పష్టత రావాలంటే సంస్థ ప్రతినిధులు మరోసారి మీడియా ముందుకు రావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా కొద్ది రోజుల క్రితం వరకు భారీ హామీలతో వార్తల్లో నిలిచిన రా ఎన్టీఆర్ సంస్థ.. ఇప్పుడు ఒక్క ప్రకటనతోనే తన కార్యకలాపాలకు ముగింపు పలకడం సినీ, సోషల్ మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
