చిన్న సినిమాకు తారక్ సర్ ప్రైజ్ రివ్యూ
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల హడావుడి ఉన్నా, కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను సెలబ్రిటీలు గుర్తించడం గొప్ప పరిణామం.
By: M Prashanth | 20 Jan 2026 8:43 AM ISTటాలీవుడ్‌లో చిన్న సినిమాలకు పెద్ద స్టార్ల మద్దతు లభిస్తే ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ గా డండోరా సినిమా చూసి తన అనుభూతిని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ చిత్రం తనను ఎంతగానో ఆలోచింపజేసిందని, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌లతో సినిమా సాగిందని ఆయన కొనియాడారు. సాధారణంగా తన బిజీ షెడ్యూల్ వల్ల పెద్ద సినిమాలకు కూడా రివ్యూలు ఇవ్వడానికి టైమ్ దొరకని తారక్, ఇలాంటి ఒక రూటెడ్ కథను ప్రత్యేకంగా మెచ్చుకోవడం విశేషం.
సినిమా రిలీజైన చాలా రోజులకు తారక్ నుండి ఈ రకమైన అప్రిసియేషన్ రావడం చిత్ర యూనిట్‌కు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, బిందు మాధవిల నటనను తారక్ హైలెట్ చేశారు. ప్రతి ఒక్కరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారని, సినిమా ఆద్యంతం వారి పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని ప్రశంసించారు. ఒక స్టార్ హీరో నుండి ఇలాంటి పాజిటివ్ రియాక్షన్స్ రావడం వల్ల ఆడియన్స్‌లో ఈ సినిమాపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
ముఖ్యంగా దర్శకుడు మురళి కాంత్ గురించి తారక్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. ఇంత బలమైన కథను రాసుకోవడమే కాకుండా, మన రూటెడ్ కథను అంతే ప్రభావవంతంగా తెరకెక్కించారని మురళి కాంత్‌కు హ్యాట్సాఫ్ చెప్పారు. కంటెంట్ మీద నమ్మకంతో ఈ ప్రయత్నాన్ని వెన్నుతట్టి ప్రోత్సహించిన నిర్మాత రవీంద్ర బెనర్జీని కూడా తారక్ అభినందించారు. మంచి సినిమా వస్తే ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ఈ ట్వీట్ ద్వారా మరోసారి స్పష్టమైంది.
ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల హడావుడి ఉన్నా, కంటెంట్ ఉన్న చిన్న చిత్రాలను సెలబ్రిటీలు గుర్తించడం గొప్ప పరిణామం. ఎన్టీఆర్ తన ట్వీట్‌లో ఎక్కడా అతిగా పొగడకుండా, సినిమాలోని బలాన్ని మాత్రమే ప్రస్తావించారు. ఒక గ్లోబల్ స్టార్ నుండి వచ్చిన ఈ 'రివ్యూ' ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ లో ఈ సినిమాకు కొత్త ఊపిరి పోయడం ఖాయం. మంచి ప్రయత్నాన్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేసే తారక్ నైచర్ ఫ్యాన్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది.
దండోరా వంటి సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని రావాల్సిన అవసరం ఉందని, కొత్త దర్శకులు ఇలాంటి రూటెడ్ స్టోరీలతో వస్తే సినిమా స్థాయి పెరుగుతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తారక్ ప్రశంసలతో ఈ సినిమాకు మరింత గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి దండోరా టీమ్‌కు తారక్ రివ్యూ ఒక మెమరబుల్ గిఫ్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.
