సీపీ సజ్జనార్ ను కలిసిన తారక్ ఫ్యాన్స్- వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
పాన్ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై తారక్ అభిమాన సంఘం చర్యలకు పూనుకుంది.
By: M Prashanth | 22 Oct 2025 8:01 PM ISTపాన్ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కు సంబంధించి మార్ఫింగ్ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వారిపై తారక్ అభిమాన సంఘం చర్యలకు పూనుకుంది. ఎన్టీఆర్ ఫొటోలను మార్ఫింగ్ చేసి.. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న అసభ్యకరమైన పోస్టులపై ఎన్టీఆర్ అభిమాన సంఘం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ మేరకు అభిమాన సంఘం నుంచి నందిపాటి మురళి తాజాగా హైదరాబాద్ లో సీపీ వీసీ సజ్జనార్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఎన్టీఆర్ పరువు, ప్రతిష్ట దెబ్బతీసేలా, అసభ్యకరమైన పోస్టులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. తక్షణమే అశ్లీల, మార్ఫింగ్ ఫొటోలు, పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని నందిపాటి మురళి సీపీని కోరారు. ఈ మేరకు సీపీని కలిసి ఫిర్యాదు చేసిన ఫొటోను నందిపాటి మురళి సోషల్ మీడియా పోస్ట్ షేర్ చేశారు.
తమ ఫిర్యాదుకు సీపీ సజ్జనార్ సానుకూలంగా స్పందించారని పేర్కొంటూ పోలీసు శాఖకు థాంక్స్ చెప్పారు. "జూనియర్ ఎన్టీఆర్ పై అభ్యంతరకరమైన కంటెంట్ ను మార్ఫింగ్ చేసి పోస్ట్ చేసినందుకు బాధ్యులపై, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీ.సీ. సజ్జనార్, హైదరాబాద్ పోలీస్ డిపార్ట్‌మెంట్ కు మా హృదయపూర్వక ధన్యవాదాలు. గౌరవాన్ని కాపాడుకోవడం, జవాబుదారీతనాన్ని నిర్ధారించడం, గౌరవప్రదమైన, ప్రశాంతతమైన వాతావరణాన్ని ఏర్పర్చడం పట్ల మీ నిబద్ధతను మేం ఎంతగానో అభినందిస్తున్నాము సర్". అని నందిపాటి మురళి పోస్ట్ చేశారు.
ఇదిలా ఉండగా, మరోవైపు ఈ వ్యవహారంపై తారక్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఒక స్టార్ హీరో హోదాలో ఉన్న వ్యక్తి పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని, దీనికి బాధ్యులు కచ్చితంగా శిక్ష ఎదుర్కొవాల్సిందేనని తారక్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. అయితె సెలబ్రిటీలపై ఈ మధ్య సోషల్ మీడియా ట్రోల్స్ ఎక్కువయ్యాయి. ఏఐ టెక్నాలజీతో ఫొటోలను మర్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ల ఫొటోలు ఎక్కువగా ఉండడం బాధాకరం. మరోవైపు పోలీసు శాఖ కూడా ఫిర్యాదులపై స్పందిస్తూ ఇలాంటి వాటిపై తగు చర్యలు తీసుకుంటుంది.
ప్రస్తుతం ఎన్టీఆర్, కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చేస్తున్నారు. దీనికి డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ సినిమా కోసం తారక్ తన బాడీ మేకోవర్ చేసుకుంటున్నారు. సినిమాలోని పాత్ర కోసం చాలా బరువు తగ్గి.. సన్నగా తయారయ్యారు. గుబురు గడ్డంతో సన్నగా మారిపోయిన తారక్ ఆ మధ్య తన బావమరిది నార్నె నితిన్ పెళ్లి వేడుకలో కనిపించారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.
