'దేవర 2'.. ఇది మ్యాటర్!
టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఇప్పుడు దేవర 2పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
By: M Prashanth | 2 May 2026 5:00 AM ISTటాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో ఇప్పుడు దేవర 2పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించడంతో, సీక్వెల్ పై అంచనాలు మరింత పెరిగాయి. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఇప్పటికే రూ.1000 కోట్ల బొమ్మ అంటూ ట్రెండ్ చేస్తున్నారు. అయితే నిజంగా ఆ రేంజ్ సాధ్యమేనా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఎన్టీఆర్.. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న డ్రాగన్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా పూర్తయిన వెంటనే ఆయన ఫ్రీ అవుతారని సమాచారం. అదే సమయంలో దర్శకుడు కొరటాల శివ కూడా నందమూరి బాలకృష్ణతో చేయనున్న NBK112 ప్రాజెక్టు పూర్తి చేస్తారు. ఆ రెండు సినిమాలు ముగిసిన తర్వాతే దేవర 2 సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉందని తెలుస్తోంది.
పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయం సాధించిన ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సినిమా దేవర. దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన ఆ చిత్రం, రాజమౌళి సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తూ మంచి వసూళ్లు సాధించింది. సాధారణంగా జక్కన్న సినిమా తర్వాత హీరోలకు వెంటనే హిట్ రావడం కష్టమనే అభిప్రాయం ఉంది. కానీ దేవర ఆ ట్రెండ్ ను చెరిపేసింది. సుమారు రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా అతిపెద్ద హిట్ గా నిలిచింది.
ఇప్పుడు ఆ విజయానికి సీక్వెల్ గా వస్తున్న దేవర 2 మూవీపై అంచనాలు నేచురల్ గానే పెరిగాయి. ముఖ్యంగా కథలో పెద్ద మార్పులు చేసినట్లు సమాచారం. ప్రీ-ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయని, షూటింగ్ షెడ్యూల్ కూడా సిద్ధమైందని తెలుస్తోంది. హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా, విలన్ పాత్రలో బీటౌన్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నారు.
మరోవైపు, ఎన్టీఆర్ ఇప్పటివరకు సోలోగా రూ.1000 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టలేదు. ఆర్ఆర్ఆర్ తో మాత్రం రామ్ చరణ్ తో కలిసి ఆ రికార్డును అందుకున్నారు. దీంతో అభిమానులు డ్రాగన్, దేవర 2 ద్వారా తారక్ ఆ ఘనతను సొంతం చేసుకోవాలని ఆశిస్తున్నారు. అయితే రూ.1000 కోట్ల మార్క్ చేరుకోవాలంటే కేవలం స్టార్ పవర్ సరిపోదని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు.
సినిమాలోని కథ, కంటెంట్, పాన్ ఇండియా రీచ్, మార్కెటింగ్ సహా అన్ని ఫ్యాక్టర్స్ కీలకం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో, మంచి కథతో పాటు భారీ విజువల్ ట్రీట్ ఇస్తే దేవర 2 ఆ రేంజ్ ను టచ్ చేసే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు. మొత్తానికి దేవర 2పై ఆడియన్స్ లో హైప్ మాత్రం భారీగానే ఉంది. కానీ ఆ హైప్ ను కలెక్షన్లుగా మార్చగలిగితేనే ఇది నిజమైన రూ.1000 కోట్ల బొమ్మగా నిలుస్తుంది. మరి తారక్ ఫ్యాన్స్ ఆశలు ఎంతవరకు నెరవేరుతాయో చూడాలి.
