Begin typing your search above and press return to search.

మొన్న చిరు.. నిన్న నాగ్.. నేడు తారక్..

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా.. తారక్ పిటిషన్ ను సోమవారం నాడు విచారించారు.

By:  M Prashanth   |   8 Dec 2025 10:30 PM IST
మొన్న చిరు.. నిన్న నాగ్.. నేడు తారక్..
X

వ్యక్తిగత హక్కుల ఉల్లంఘన విషయంలో కొంతకాలంగా సెలబ్రిటీలు.. కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం తెలిసిందే. తమ హక్కులను పరిరక్షించుకునే విధంగా న్యాయస్థానం నుంచి ఆదేశాలు తెచ్చుకుంటున్నారు. రీసెంట్ గా టాలీవుడ్ మెగాస్టార్, కింగ్ నాగార్జున.. హైకోర్టు మెట్లెక్కారు. ఇప్పుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా అదే బాటలో నడిచారు.

తాజాగా ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యక్తిగత హక్కుల రక్షణ కోసం ఇటీవల కీలక నిర్ణయం తీసుకున్న ఆయన.. తన అనుమతి లేకుండా పేరు, ఫోటో, వీడియోలు, వాయిస్‌ ను వాణిజ్య ప్రకటనల కోసం ఉపయోగించకుండా అడ్డుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. దీంతో ఎన్టీఆర్ పిటిషన్ ను విచారించిన కోర్టు.. కీలక ఆదేశాలు జారీ చేసింది.

జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోరా.. తారక్ పిటిషన్ ను సోమవారం నాడు విచారించారు. ఎన్టీఆర్ ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఐటీ నిబంధనలు 2021 ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అది కూడా మూడు రోజుల్లోనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్, ఈ -కామర్స్ వెబ్‌ సైట్‌ లు, టెలికాం ఆపరేటర్లపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి జస్టిస్ అరోరా ఆదేశాలు జారీ చేశారు. ఆ తర్వాత కేసు విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేశారు. ఆ రోజున సవివరంగా ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు జస్టిస్‌ ప్రీతమ్‌ సింగ్‌ అరోరా వెల్లడించారు.

విచారణ సమయంలో ఎన్టీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది జె.సాయి దీపక్‌ వాదనలు వినిపించారు. అయితే ఇకపై తారక్ అనుమతి లేకుండా ఆయన పేరు, ఫోటో, వాయిస్ ను యాడ్స్ లేదా ఇతర అవసరాలకు ఉపయోగించినట్లయితే వారు కచ్చితంగా చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తద్వారా వ్యక్తిగత బ్రాండ్‌కు, ఇమేజ్‌ కు రక్షణ కల్పించుకునే ప్రయత్నం చేశారు ఎన్టీఆర్.

ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో వర్క్ చేస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్ లో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందుతోంది. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో కీలక షెడ్యూల్ ను చిత్రీకరిస్తున్నారని సమాచారం. నైట్ షూట్ జరుగుతుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు తారక్.