బుచ్చిబాబు.. తారక్ నుంచి పిలుపు ఇప్పట్లో కష్టమేనేమో!
డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్పుడే చర్చ మొదలైంది.
By: M Prashanth | 3 Jun 2026 1:37 AM ISTడైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా మూవీ పెద్ది రిలీజ్ కు సిద్ధమవుతున్న వేళ, ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అప్పుడే చర్చ మొదలైంది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తో బుచ్చిబాబు సినిమా ఎప్పుడు ఉంటుందనే విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. నిజానికి ఉప్పెన సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న బుచ్చిబాబు, ఆ తర్వాత చాలా కాలం పాటు కొత్త ప్రాజెక్టును ప్రకటించలేదు.
ఆ గ్యాప్ లో ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించారని, అదే కథ తర్వాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న పెద్దిగా మారిందనే ప్రచారం సోషల్ మీడియాలో చాలా రోజుల పాటు సాగింది. అయితే తాజాగా ఆ రూమర్లకు బుచ్చిబాబు స్వయంగా చెక్ పెట్టారు. ఇప్పుడు పెద్ది ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన బుచ్చిబాబు, ఎన్టీఆర్ కు తాను చెప్పిన కథ పూర్తిగా వేరేనని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ప్రేక్షకుల ముందుకు వస్తున్న పెద్ది కథకు, తారక్ కు వినిపించిన దానికి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.
ఎన్టీఆర్ కు తాను చెప్పిన కథను మరింత డెవలప్ చేసి తీసుకురావాలని సూచించారని, కానీ మధ్యలో పెద్ది అవకాశం రావడంతో తన దృష్టంతా ఆ ప్రాజెక్టుపైనే పెట్టినట్లు వెల్లడించారు. అలాగే ఫ్యూచర్ లో ఎన్టీఆర్ పిలిస్తే కథ చెప్పడానికి తాను సిద్ధంగా ఉంటానని కూడా బుచ్చిబాబు తెలిపారు. దీంతో గతంలో వచ్చిన అనేక ఊహాగానాలకు ముగింపు పడినట్టైంది. ఎన్టీఆర్ పెద్ది కథను రిజెక్ట్ చేశారన్న ప్రచారంలో నిజం లేదని క్లారిటీ వచ్చింది.
అయితే బుచ్చిబాబు ఇంట్రెస్ట్ చూపుతున్నా, ఎన్టీఆర్ తో సినిమా ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందా అనే ప్రశ్న మిగిలే ఉంది. ప్రస్తుతం తారక్ వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న డ్రాగన్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఆ మూవీ రిలీజ్ కానుండగా.. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుగుతోంది.
అదే సమయంలో దేవర సీక్వెల్ ను పూర్తి చేయాల్సి ఉంది. మరోవైపు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఎన్టీఆర్ ఓ సినిమా చేయనున్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ చిత్రానికి సంబంధించిన చర్చలు కూడా కొనసాగుతున్నాయి. త్వరలో అధికారిక ప్రకటన రానుందని టాక్. ఇలా ఇప్పటికే చేతి నిండా సినిమాలతో తారక్ బిజీగా ఉండటంతో, కొత్త దర్శకుడితో వెంటనే సినిమా ప్రారంభించే పరిస్థితి కనిపించడం లేదని చెప్పాలి. అందుకే బుచ్చిబాబు-ఎన్టీఆర్ కాంబినేషన్ పై ఆసక్తి ఉన్నప్పటికీ, ఇప్పట్లో వర్కౌట్ అయ్యే అవకాశాలు తక్కువే.
అదే సమయంలో పెద్ది రిజల్ట్ కూడా బుచ్చిబాబు కెరీర్ కు కీలకంగా మారనుంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధిస్తే, ఫ్యూచర్ లో స్టార్ హీరోలతో వర్క్ చేసే అవకాశాలు రావడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. అలాంటి పరిస్థితిలో ఎన్టీఆర్ తో మూవీ ఓకే అయితే అది కచ్చితంగా భారీ ప్రాజెక్టుగా మారే అవకాశం ఉంది. కానీ అయితే బుచ్చిబాబు సిద్ధంగా ఉన్నా, తారక్ డైరీలో ఖాళీ దొరకడం అంత ఈజీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
