రోలెక్స్‌ని జీరోని చేసిన తారక్ కొత్త లుక్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రెండు కారణాలతో నిరంతరం చర్చల్లోకొస్తున్నాడు. ఒకటి మారిన అతడి రూపం.. రెండోది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందస్తున్న డ్రాగన్.
By: Sivaji Kontham | 6 Nov 2025 10:06 PM ISTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల రెండు కారణాలతో నిరంతరం చర్చల్లోకొస్తున్నాడు. ఒకటి మారిన అతడి రూపం.. రెండోది కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందస్తున్న డ్రాగన్. అయితే తారక్ మారిన రూపానికి కారణం కూడా డ్రాగన్. ఈ సినిమా కోసం తారక్ తన సర్వస్వాన్ని అర్పిస్తున్నాడు. రేయింబవళ్లు కఠోరంగా మేకోవర్ కోసం శ్రమిస్తున్నాడు. ఇందులో అతడు మాఫియా డాన్‌లకే తాతలా కనిపిస్తాడు! అంటూ ఒకటే గుసగుస వినిపిస్తోంది.
ఏది ఏమైనా తన మేకోవర్ కోసం తారక్ ఎంతగా శ్రమిస్తున్నాడో అతడి వాలకం చెబుతోంది. ఇటీవలి కాలంలో ఎన్టీఆర్ పూర్తిగా సన్నబడిపోయాడు. ముఖాకృతి అనూహ్యంగా మారిపోయింది. ముఖ కవళికల్లో చాలా మార్పు కనిపించింది. అయితే ఇదంతా కఠినమైన డైట్, శారీరక శ్రమ కారణంగా వచ్చిన మార్పు మాత్రమేనని ఫిట్నెస్ ఔత్సాహికులు భావిస్తున్నారు. 6 ప్యాక్, 8 ప్యాక్ వంటివి కావాలంటే దానికోసం కఠిన వ్యాయామం, కఠోరమైన శిక్షణ అవసరం. తిండితో పాటు, నీళ్లను కూడా పరిమితంగా అవసరం మేర మాత్రమే తాగాల్సి ఉంటుంది. అందుకే తారక్ రూపం చూడగానే అభిమానులు కూడా కొంత కంగారు పడిన మాట వాస్తవం. తారక్ మరీ ఇంత సన్నగా మారడంపై కొన్ని సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.
అయితే అతడు పూర్తి ఫిట్ గా ఉన్నాడా లేదా? అనేది అభిమానులు తెలుసుకునేందుకు లేటెస్టుగా ఇంటర్నెట్ లో ఒక ప్రూఫ్ లభించింది. ఇది రేర్ ఫోటోగ్రాఫ్. తారక్ లుక్ ని షేపప్ చేస్తూ సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆలిమ్ హకీమ్ చాలా బిజీగా కనిపించగా, దగ్గరుండి మరీ ప్రశాంత్ నీల్ ప్రతిదీ గైడ్ చేస్తూ కనిపించిన రేర్ ఫోటోగ్రాఫ్ నెట్ లో వైరల్ గా మారుతోంది. దీనిని బట్టి ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ జోడీ లుక్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో అర్థమవుతోంది.
ఇప్పుడు మరోసారి తారక్ రూపం ఎలా ఉంటుందో పరిశీలించేందుకు వీడియో రూపంలో మరో ఆధారం అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రఖ్యాత ``రోలెక్స్ వాచ్`` లేటెస్ట్ వెర్షన్ ప్రచారం కోసం షూట్ చేసిన వీడియో. తారక్ నేరుగా రోలెక్స్ షోరూమ్ కి వెళ్లి యజమానులను అభినందిస్తున్నాడు. అంతేకాదు అతడు తన చేతికి ఒక బ్రాండ్ న్యూ రోలెక్స్ వాచ్ ని ధరించాడు. ఈ వాచ్ ఖరీదు 2 కోట్లు పైమాటే. అయితే ఈ ఎపిసోడ్ లో కూడా రోలెక్స్ కంటే తారక్ రూపమే అందరి దృష్టిని ఆకర్షించింది. ఎన్టీఆర్ చూడటానికి సన్నగా కనిపిస్తున్నా కానీ, అతడి నిజ రూపం ఎలా ఉందో తెలియాలంటే ఓపెన్ బాడీని ప్రదర్శించాలి. అయితే షర్ట్ ఉన్నా కానీ, అతడి బాడీ పూర్తిగా రాటు దేలి షేపప్ అయ్యి కనిపిస్తోంది. ఫిజికల్ గా అతడు ఎలా ఉన్నాడో తెలియాలంటే షర్ట్ విప్పి చూపించాలి. కానీ ఆ పని అతడు తెరపై చేస్తాడేమో కానీ, ఇప్పుడు ఓపెన్ గా చూపించడు. మొత్తానికి తారక్ మేకోవర్ మరోసారి ఇంటర్నెట్ లో పెద్ద డిబేట్ కి తెర తీసింది.
తారక్ ని బీస్ట్ మోడ్ లో జ్వలింపజేస్తామని ప్రశాంత్ నీల్ పదే పదే చెబుతున్నాడు. దానికోసం అతడిని తీవ్రంగానే శ్రమ పెడుతున్నాడని అర్థమవుతోంది. ఇక దేవర తర్వాత వార్ 2 షాకిచ్చింది. అందుకే మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కోసం తపిస్తున్న తారక్ కూడా ఎక్కడా హార్డ్ వర్క్ విషయంలో తగ్గడం లేదు. ఎన్టీఆర్- నీల్ ప్రాజెక్ట్ `డ్రాగన్` కోసం మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్ ని వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే.
`డ్రాగన్` కోసం పరివర్తనా?
నాగార్జున కల్ట్ క్లాసిక్ `శివ` రీరిలీజ్ వెనక బృందాన్ని అభినందిస్తూ ఒక వీడియోలో కనిపించినప్పుడు తారక్ కొత్త లుక్ మొదట అందరి దృష్టిని ఆకర్షించింది. అభిమానులు అతడి సన్నని రూపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఎన్టీఆర్ తన పాత లుక్‌ని, బలాన్ని తిరిగి పొందాలని పలువురు వ్యాఖ్యానించారు. కానీ తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ తో తన తదుపరి చిత్రంపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు.
