అంతరిక్షంలో భారతీయ స్వరం!
ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే? ఈ అంతర్జాతీయ ఆల్బమ్ విజువల్స్, యానిమేషన్ డైరెక్షన్‌ను అసోంకే చెందిన సమూద్ర కాజల్ సైకియా డిజైన్ చేశారు.
By: Srikanth Kontham | 17 Sept 2026 5:00 AM ISTప్రముఖ భారతీయ సంగీత దర్శకుడు, గాయకుడు జోయ్ బారువా అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త అరుదైన ఘనతను సాధించారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ప్రాజెక్ట్‌తో అనుసంధానమై సాగే ఓ వినూత్న అంతర్జాతీయ సంగీత ఆల్బమ్‌లో భాగమయ్యారు. విశ్వం, ఖగోళ శాస్త్రం వెనుక ఉన్న అద్భుతాలను సంగీతం ద్వారా ఆవిష్కరించే గ్లోబల్ ప్రాజెక్ట్‌లో రెండు కీలకమైన పాటలకు బారువా స్వరాలు సమకూర్చారు.
ఈ అంతర్జాతీయ ప్రాజెక్ట్ నాసా చేపడుతున్న `కానోపి ఆఫ్ ఓపెన్ సర్వీసెస్ అండ్ ఇన్నోవేషన్`స్పేస్ మిషన్‌తో ముడిపడి ఉంది. శాస్త్రవేత్త జాన్ టామ్‌సిక్ నేతృత్వంలో సాగుతున్న మిషన్‌ను `కాస్మిక్ రాప్సడీ` అనే అంత ర్జాతీయ ఆర్కెస్ట్రా ప్రాజెక్ట్‌తో మిళితం చేశారు. సుసాన్ లిమ్, క్రిస్టినా టీన్జ్ తాన్ సృష్టించిన ఈ ప్రాజెక్ట్‌కు ఫ్రెంచ్ కంపోజర్ మను మార్టిన్ ప్రధాన కంపోజర్‌గా పనిచేయగా, అసోంకు చెందిన జోయ్ బారువా స్వరాలతో దీనికి సరికొత్త జీవం పోశారు.
`దేవ్ డి`, `జిందగీ నా మిలేగీ దొబారా`, `మున్నాభాయ్ ఎంబీబీఎస్`, `లైలా మజ్ను` (ఓ మేరీ లైలా) వంటి ఎన్నో విజయవంతమైన బాలీవుడ్ చిత్రాలలో పనిచేసిన జోయ్ బారువా ఈ మైలురాయిపై సంతోషం వ్యక్తం చేశారు. మన దేశంలో విశ్వానికి, సంగీతానికి ఎంతో సాంస్కృతిక ప్రాముఖ్యత ఉందని, ఇస్రో ద్వారా శాస్త్ర సాంకేతిక రంగంలోనూ భారత్ దూసుకుపోతోందని గుర్తు చేశారు. నాసాతో ముడిపడిన ప్రాజెక్ట్‌లో ఒక భారతీయ సంగీత దర్శకుడిగా పాలుపంచుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. తార్కిక ఆలోచనలు, ఊహాశక్తి కలిస్తే అద్భుతాలు సృష్టిం చవచ్చని పేర్కొన్నారు.
ఈ కథాంశం భూమి ఎదుర్కొంటున్న పర్యావరణ సమస్యలకు పరిష్కారం వెతికేందుకు ఒక మానవుడు - ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలసి రోదసిలోకి చేసే ప్రయాణం నేపథ్యంలో సాగుతుంది. నక్షత్రాలు అంత రించిపోయి, వాటి ధూళి తిరిగి భూమిపైకి చేరే శాస్త్రీయ ప్రక్రియ ఆధారంగా రూపుదిద్దుకున్న `స్టార్ అమాంగ్ ది కాస్మిక్ క్లౌడ్స్, `కాన్‌ఫెట్టి స్టార్మ్` అనే రెండు ముఖ్యమైన పాటలకు బారువా ట్యూన్స్ అందించగా, మను మార్టిన్‌తో కలసి `కాన్‌ఫెట్టి స్టార్-అయాన్` అనే ట్రాక్‌ను సంయుక్తంగా స్వరపరిచారు.
ఈ ప్రాజెక్ట్‌కు మరో ప్రత్యేకత ఏమిటంటే? ఈ అంతర్జాతీయ ఆల్బమ్ విజువల్స్, యానిమేషన్ డైరెక్షన్‌ను అసోంకే చెందిన సమూద్ర కాజల్ సైకియా డిజైన్ చేశారు. అంతర్జాతీయ వేదికపై నాసా ఆధారిత ప్రాజెక్ట్‌లో అసోంకు చెందిన ఇద్దరు కళాకారుల్లో ఒకరు సంగీతంతో, మరొకరు అద్భుతమైన విజువల్ యానిమేషన్‌తో కలసి పనిచేయడం తమ రాష్ట్రానికి గొప్ప గర్వకారణమని బారువా ఆనందం వ్యక్తం చేశారు.
ఈ ప్రతిష్టాత్మక కాస్మిక్ రాప్సడీ ప్రాజెక్ట్ గ్లోబల్ ప్రిమియర్ జులై 27, 2027న లాస్ ఏంజెల్స్‌లోని ప్రసిద్ధ `హాలీవుడ్ బౌల్` వేదికగా జరగనుంది. లాస్ ఏంజెల్స్ ఫిల్‌హార్మోనిక్, ప్రముఖ పియానిస్ట్ జీన్-య్వెస్ థిబాడెట్ భాగస్వామ్యంతో ఈ ప్రదర్శన నిర్వహించనున్నారు. అటుపై కేప్ కెనవెరాల్ నుండి నాసా కోసి స్పేస్ టెలిస్కోప్ ప్రయోగం జరగనుంది.
