హిట్ ప్రాంచైజీ మూవీకి లీగల్ కష్టాలు
ఈ మధ్య కాలంలో సినిమాల చుట్టూ వివాదాలు ఏర్పడటం సర్వ సాధారణం అయింది. కొందరు పబ్లిసిటీ కోసం సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం.
By: Ramesh Palla | 22 Aug 2025 1:00 AM ISTఈ మధ్య కాలంలో సినిమాల చుట్టూ వివాదాలు ఏర్పడటం సర్వ సాధారణం అయింది. కొందరు పబ్లిసిటీ కోసం సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. సినిమాపై ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ద్వారా పాపులారిటీ దక్కుతుందని చాలా మంది భావిస్తున్నారు. సోషల్ మీడియాలో సినిమాల గురించి పదే పదే తప్పుడు వ్యాఖ్యలు చేయడం ద్వారా కూడా పాపులారిటీని సొంతం చేసుకుంటున్న వారు ఉన్నారు. అలా చాలా సినిమాలు ఎప్పుడూ వివాదంలో నిలుస్తూనే ఉన్నాయి. కొన్ని వివాదాలు జెన్యూన్‌గా ఉంటే, కొన్ని వివాదాలు కావాలని ప్రమోషన్ కోసం, పబ్లిసిటీ కోసం జరుగుతున్నాయి. ఇప్పుడు బాలీవుడ్ మూవీ 'జాలీ ఎల్‌ఎల్బీ' ప్రాంచైజీ మూవీ గురించి చర్చ జరుగుతోంది. ఈ సినిమా న్యాయ వ్యవస్థను అవమానించినట్లు విమర్శలు వస్తున్నాయి.
జాలీ ఎల్‌ఎల్బీ 3 పై అంచనాలు
బాలీవుడ్‌లో వరుసగా హిట్ ప్రాంచైజీ సినిమాలు వస్తున్నాయి. అంందులో జాలీ ఎల్‌ఎల్బీ 3 ఒకటి. ఇప్పటి వరకు వచ్చిన రెండు పార్ట్‌లకు మంచి స్పందన దక్కింది. ముఖ్యంగా జాలీ ఎల్‌ఎల్బీ 2 సినిమాలో అక్షయ్ కుమార్ నటించడంతో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 2017లో ఆ సినిమా వచ్చింది. దాదాపు ఏడు ఏళ్ల తర్వాత ఆ ప్రాంచైజీ మూవీ రాబోతుంది. మొదటి పార్ట్‌లో హీరోగా నటించిన అర్షద్ వార్సీ, రెండో పార్ట్‌లో నటించిన అక్షయ్ కుమార్‌లు కలిసి పార్ట్ 3 లో నటించడం ద్వారా ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. గత ఏడాది సినిమా నుంచి వచ్చిన టీజర్ వివాదాస్పదం అయింది. న్యాయవ్యవస్థపై జోకులు వేయడం మాత్రమే కాకుండా, లాయర్లపై, జడ్జ్‌లపై కూడా సినిమాలో కామెడీ చేశారు అంటూ ఆ సమయంలోనే చాలా మంది కామెంట్స్ చేశారు.
న్యాయ వ్యవస్థను అవమానించే విధంగా కామెడీ
జాలీ ఎల్‌ఎల్బీ 3 లో జడ్జ్‌ను మామ అంటూ పిలవడం ఇక్కడ వివాదాస్పదం అయింది. ఇలాంటి సినిమాలపై చర్యలు తీసుకోకుంటే ముందు ముందు మరింతగా న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బ తీసే విధంగా కొందరు ప్రవర్తిస్తారు అంటూ వాజేద్ రహీమ్ ఖాన్ అనే లాయర్ కోర్ట్‌లో పిటీషన్ దాఖలు చేశాడు. అతడి పిటీషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్ట్ చిత్ర హీరోలు, దర్శకుడిని కోర్ట్‌కి హాజరు కావాల్సిందింగా ఆదేశించింది. అక్టోబర్ 28న ఉదయం 11 గంటలకు సినిమా యూనిట్ సభ్యులు తప్పని సరిగా కోర్ట్‌కి హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేయడంతో చర్చనీయాంశం అయింది. అక్షయ్ కుమార్ ఈ మధ్య కాలంలో ఇలాంటి వివాదాలను తరచు ఎదుర్కొంటూనే ఉన్నారు. అయితే కోర్ట్ కు సంబంధించిన విషయాల కారణంగా సినిమా విడుదల ఆగిపోయే అవకాశం లేదని కొందరు అంటున్నారు.
సెప్టెంబర్ 19న అక్షయ్ కుమార్ జాలీ ఎల్‌ఎల్బీ మూవీ
ముందుగా అనుకున్నట్లుగానే ఈ సినిమాను సెప్టెంబర్ 19న విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మొదటి, రెండో పార్ట్‌లు విజయాన్ని సొంతం చేసుకున్నట్లుగానే మూడో పార్ట్ కూడా విజయాన్ని సొంతం చేసుకుంటుంది అంటూ మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. 2013 లో జాలీ ఎల్‌ఎల్బీ సినిమా మొదటి ప్రాంచైజీ వచ్చింది. ఆ తర్వాత నాలుగు ఏళ్లకు రెండో ప్రాంచైజీ వచ్చింది. కానీ మూడో ప్రాంచైజీకి చాలా సమయం పట్టింది. అందుకు కారణం కరోనా, బాలీవుడ్‌లో ఉన్న పరిస్థితులు అంటున్నారు. గత కొన్ని ఏళ్లుగా బాలీవుడ్‌లో సక్సెస్ రేటు చాలా తక్కువగా ఉంది. ఎన్నో క్రేజీ కాంబో మూవీస్, ప్రాంచైజీ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. అందుకే ఈ సినిమా విషయంలో కాస్త ఆచితూచి మేకర్స్ అడుగు వేశారు. ఎట్టకేలకు పూర్తి స్థాయి వినోదాత్మకంగా ఈ సినిమాను రూపొందించి ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
