Begin typing your search above and press return to search.

జానీ మాస్టర్‌పై `ఫెడరేషన్` బ్యాన్ ర‌ణ్‌వీర్‌పై నిషేధాన్ని గుర్తు చేస్తోందా?

టాలీవుడ్ ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌కు ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్ (AIFEC) - తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ గట్టి షాక్ ఇచ్చాయి.

By:  Sivaji Kontham   |   30 Sept 2026 10:07 PM IST
జానీ మాస్టర్‌పై `ఫెడరేషన్` బ్యాన్ ర‌ణ్‌వీర్‌పై నిషేధాన్ని గుర్తు చేస్తోందా?
X

టాలీవుడ్ ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌‌కు ఆల్ ఇండియా ఫిలిం ఎంప్లాయిస్ కాన్ఫెడరేషన్ (AIFEC) - తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ గట్టి షాక్ ఇచ్చాయి. జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ ప్రకటిస్తున్నట్లు ఫెడరేషన్ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కొద్ది రోజులుగా టాలీవుడ్ డాన్సర్స్ అసోసియేషన్‌లో నెలకొన్న అంతర్గత వివాదాలు.. పలు విభేదాల నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవ‌డం పెద్ద చ‌ర్చ‌గా మారింది.

తెలుగుతో పాటు ఇతర చిత్ర పరిశ్రమల నుంచి కూడా జానీ మాస్టర్ వ్యవహారశైలిపై పెద్దఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ చర్యకు పూనుకున్నట్లు ఫెడరేషన్ తెలిపింది. చిన్న చిన్న కారణాలతో షూటింగ్స్‌ను క్యాన్సిల్ చేయడం.. తరచుగా వివాదాల్లో తలదూర్చడం వంటి అంశాలు ఆయనపై చర్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం ఫెడరేషన్ నిబంధనలను ఉల్లంఘించకూడదని హెచ్చరిస్తూ.. అనుబంధ సంఘాలన్నీ ఈ సహాయ నిరాకరణను కఠినంగా అమలు చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే 24 శాఖ‌ల్లో ఎవ‌రూ అత‌డికి స‌హ‌క‌రించ‌కూడ‌ద‌ని కూడా ఆర్డ‌ర్స్ వేయ‌డం సంచ‌ల‌నంగా మారింది.

అయితే ఫెడరేషన్ తీసుకున్న ఈ నిర్ణయంపై జానీ మాస్టర్ వర్గం తీవ్రస్థాయిలో మండిపడుతోంది. ఇది పూర్తిగా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయమని.. అసలు ఏ తప్పు చేశామని సహాయ నిరాకరణ చేస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు. ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వ్యవహారశైలిని తప్పుబడుతూ.. ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని జానీ మాస్టర్ టీమ్ డిమాండ్ చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రెసిడెంట్ తమకు వద్దు అంటూ జానీ మాస్ట‌ర్ స‌తీమ‌ణి, డ్యాన్స‌ర్స్ అసోసియేష‌న్ మాజీ అధ్య‌క్షురాలు సుమలత తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. లెటర్లు రిలీజ్ చేసినంత మాత్రాన జానీని ఆపలేరని.. మాస్టర్ ఎప్పటిలాగే షూటింగ్స్‌లో పాల్గొంటారని.. దమ్ముంటే సెట్‌కి వచ్చి అడ్డుకోవాలంటూ జానీ మాస్టర్ వర్గం బహిరంగంగా సవాలు విసురుతోంది. ఫెడరేషన్ కి జానీ మాస్టర్ వర్గం మధ్య జరుగుతున్న ఈ ప్ర‌త్య‌క్ష‌ యుద్ధం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ఈ పరిణామాల నేపథ్యంలో అక్టోబర్ 11న జరగాల్సిన డాన్సర్స్ అసోసియేషన్ ఎన్నికలను కూడా వాయిదా వేస్తున్నట్లు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ అసోసియేషన్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఎన్నికలను ఈ నెల 18వ తేదీకి మార్చామని తెలిపారు. ఫెడరేషన్ తీసుకున్న ఈ నాన్-కోఆపరేషన్ నిర్ణయం భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ వివాదానికి ఎలా తెరపడుతుందనేది ప్రస్తుతం టాలీవుడ్‌‌లో చర్చనీయాంశంగా మారింది. అయితే జానీ మాస్టార్ ఇండ‌స్ట్రీలో అగ్ర న‌టులు, దిగ్గ‌జాల అండ‌దండ‌లు ఉన్న ప్ర‌తిభావంతుడు కావ‌డంతో ఫెడ‌రేష‌న్ ని బుజ్జ‌గించే ప్ర‌య‌త్నాలు సినీపెద్ద‌లు చేసేందుకు ఆస్కారం లేక‌పోలేదు. అయితే ఈ గొడ‌వ‌ను ప‌రిశీలిస్తుంటే.. ఫ‌ర్హాన్ అక్త‌ర్ `డాన్ 3` వివాదం స‌మ‌యంలో స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ పై అక్క‌డి ఫెడ‌రేష‌న్ నిషేధం లేదా నాన్ కోఆప‌రేష‌న్ విధించిన వ్య‌వ‌హారాన్ని కూడా ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు..