Begin typing your search above and press return to search.

7కోట్లు సైలెంట్‌గా కొట్టేసాడు.. ప్ర‌ముఖ న‌టుడి క్రెడిట్ కార్డ్ గోల్‌మాల్!

రాజ‌మౌళి.. మ‌హేష్.. నాని.. విజ‌య్ దేవ‌ర‌కొండ .. ఇలా ఎంతోమంది స్టార్లు నేడు ఆన్ లైన్ మోసాల గురించి హెచ్చ‌రిస్తూ గతంలో ప‌లు వీడియోల‌లో న‌టించారు.

By:  Sivaji Kontham   |   30 May 2026 9:00 PM IST
7కోట్లు సైలెంట్‌గా కొట్టేసాడు.. ప్ర‌ముఖ న‌టుడి క్రెడిట్ కార్డ్ గోల్‌మాల్!
X

రాజ‌మౌళి.. మ‌హేష్.. నాని.. విజ‌య్ దేవ‌ర‌కొండ .. ఇలా ఎంతోమంది స్టార్లు నేడు ఆన్ లైన్ మోసాల గురించి హెచ్చ‌రిస్తూ గతంలో ప‌లు వీడియోల‌లో న‌టించారు. సెల‌బ్రిటీల సాయంతో సైబ‌రాబాద్ పోలీసులు చాలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సామాన్య ప్ర‌జ‌లు మోస‌పోయి డ‌బ్బును కోల్పోకూడ‌ద‌నే ఉద్ధేశంతో మ‌న సెల‌బ్రిటీలు సామాజిక బాధ్య‌త‌తో అవేర్ నెస్ కార్య‌క్ర‌మాల‌కు స్వ‌చ్ఛందంగా స‌హ‌క‌రిస్తున్నారు. అయినా నిరంత‌రం సైబ‌ర్ క్రైమ్ లో ఫైల్ అవుతున్న ఆన్ లైన్ మ‌నీ మోసాలు, స్కామ్ ల గురించి తెలుసుకుంటే గుండె బ‌రువెక్కాల్సిందే.

అదంతా స‌రే కానీ.. అన్నివిధాలా విజ్ఞానం ఉన్న గొప్ప విద్యావంతులైన సెల‌బ్రిటీలు కోట్ల‌లో ఆన్ లైన్ మోసాల‌కు గుర‌వ్వ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. హాలీవుడ్ అగ్ర నటుడు, `పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్` ఫేమ్ జానీ డెప్ ఒక భారీ అంతర్జాతీయ క్రెడిట్ కార్డ్ మోసానికి గురయ్యారు. ఆయనకు తెలియకుండానే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డ్ నుండి దాదాపు 6,90,000 డాలర్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ. 7 కోట్లు) కేటుగాళ్లు కొల్లగొట్టారు. దాదాపు రెండేళ్ల పాటు అత్యంత గుప్తంగా సాగిన ఈ ఆర్థిక నేరం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. ఈ మోసానికి పాల్పడిన నిందితుడిని హంగేరియన్ పోలీసులు నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేయగా.. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

అధికారిక క‌థ‌నాల ప్రకారం... జనవరి 2024 నుండి డిసెంబర్ 2025 మధ్య కాలంలో జానీ డెప్ క్రెడిట్ కార్డ్ ద్వారా దాదాపు 308 అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు పరిశోధకులు గుర్తించారు. బ్యాంక్ అధికారులకు గానీ.. జానీ డెప్‌కి గానీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు నిందితుడు ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా చిన్న మొత్తాలలో ఆన్‌లైన్ షాపింగ్, విలాసవంతమైన హోటల్ స్టేలు, ఇతర చిన్న కొనుగోళ్లు చేస్తూ ఈ డబ్బును ఖర్చు చేశాడు. జానీ డెప్ కార్డ్‌కు ఉండే భారీ ఖర్చు పరిమితి ని ఆసరాగా చేసుకుని.. ఈ లావాదేవీలు చాలా కాలం పాటు ఎవరి కంటా పడకుండా నిందితుడు జాగ్రత్త పడ్డాడు.

ఈ ఏడాది ప్రారంభంలో జానీ డెప్ ఖాతాకు సంబంధించి అమెరికాలోని ఒక ప్రముఖ బ్యాంక్ కొన్ని అసాధారణ విత్‌డ్రాయల్స్‌ను గుర్తించి బుడాపెస్ట్‌లోని ఎఫ్‌బీఐ కార్యాలయానికి సమాచారం అందించడంతో ఈ దర్యాప్తు ప్రారంభమైంది. డిజిటల్ ఆధారాలైన ఐపీ అడ్రస్‌లు, ఈమెయిల్ ఖాతాలు, ఫోన్ రికార్డుల సహాయంతో అధికారులు నిందితుడు బుడాపెస్ట్‌లోని అంగ్యాల్‌ఫోల్డ్ జిల్లాలో ఒక అద్దె ఇంట్లో ఉన్నట్లు కనుగొన్నారు. మే 6వ తేదీన హంగేరియన్ టాక్టికల్ పోలీసులు సదరు నివాసం వద్ద పొంచి ఉండి 27 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బుడాపెస్ట్ 13వ జిల్లాలోని మరో అపార్ట్‌మెంట్‌లో జరిపిన సోదాల్లో ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కొన్ని మత్తు పదార్థాలను కూడా రికవరీ చేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. జానీ డెప్ గతంలో తను దర్శకత్వం వహించిన `మోడీ` వంటి ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్ కోసం బుడాపెస్ట్‌లోని బుడా కాజిల్, హంగేరియన్ స్టేట్ ఒపెరా హౌస్ వంటి ప్రాంతాలలో చాలా కాలం గడిపారు. అయితే ఆయన అక్కడ ఉన్న సమయంలోనే ఈ కార్డ్ వివరాలు దొంగిలించారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గానీ ప్రస్తుతానికి ఎలాంటి ప్రత్యక్ష సంబంధాన్ని నిర్ధారించలేదు. నిందితుడికి అసలు ఈ కార్డ్ వివరాలు ఎలా దక్కాయనేది ఇంకా రహస్యంగానే ఉంది.

ఈ భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చిన కొద్ది రోజుల ముందే లాస్ ఏంజిల్స్‌లోని జానీ డెప్ నివాసంలోకి ఒక గుర్తుతెలియని మహిళ అక్రమంగా ప్రవేశించడానికి ప్రయత్నించిన ఘటన కూడా వెలుగు చూసింది. వరుసగా ఇటువంటి భద్రతా లోపాలు, ఆర్థిక నేరాలు వెలుగులోకి రావడంతో జానీ డెప్ పేరు మరోసారి అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా వినిపిస్తోంది.