Begin typing your search above and press return to search.

ఈ హీరో ఓటీటీకే పరిమితం కావాల్సిందేనా..?

సినిమాలు సూపర్‌ హిట్ అయితే పర్వాలేదు కానీ యావరేజ్‌గా నిలిచినా, ఫ్లాప్‌ అయినా థియేట్రికల్‌ రెవిన్యూ కనీసం 25 శాతం కూడా రావడం లేదు.

By:  Ramesh Palla   |   1 Aug 2025 5:00 PM IST
ఈ హీరో ఓటీటీకే పరిమితం కావాల్సిందేనా..?
X

గడచిన ఐదేళ్లలో ఇండియాలో ఓటీటీ మార్కెట్‌ విపరీతంగా పెరిగింది. ఏకంగా సినిమాల బడ్జెట్‌ను ఖరారు చేయడం, హీరోల పారితోషికం మార్చడం, సినిమా స్థాయిని మార్చడంలోనూ ఓటీటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఎలాగూ ఓటీటీ డబ్బు భారీగా వచ్చి పడుతుంది కనుక మేకింగ్‌ కి పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్నారు. అంతే కాకుండా స్టార్స్‌ పారితోషికం కూడా పెంచేస్తున్నారు. ఇదే సమయంలో సినిమా థియేట్రికల్‌ రిలీజ్ పరిస్థితులు పూర్తిగా మారి పోయాయి. ఒకప్పుడు స్టార్‌ హీరోల సినిమాల నుంచి చిన్న హీరోల సినిమాల వరకు అన్నీ థియేటర్‌లలో వారాల కొద్ది ఆడేవి. కాని ఇప్పుడు దాదాపు అన్ని సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లో ఓటీటీ స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. కనుక థియేట్రికల్‌ రెవిన్యూ పై పెద్ద ప్రభావం కనిపిస్తుంది.

బాలీవుడ్‌ సినిమాలు డైరెక్ట్‌ ఓటీటీ రిలీజ్‌

సినిమాలు సూపర్‌ హిట్ అయితే పర్వాలేదు కానీ యావరేజ్‌గా నిలిచినా, ఫ్లాప్‌ అయినా థియేట్రికల్‌ రెవిన్యూ కనీసం 25 శాతం కూడా రావడం లేదు. చిన్న హీరోల సినిమాలు కనీసం పబ్లిసిటీ ఖర్చులకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టలేక పోతున్నాయి. అందుకే థియేట్రికల్‌ రిలీజ్‌కు వెళ్లకుండా చాలా మంది హీరోల సినిమాలను డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా తీసుకు వస్తున్నారు. సౌత్‌ లో కాస్త తక్కువ అయినా నార్త్‌ లో పెద్ద సినిమాలు సైతం ఓటీటీ ద్వారా విడుదల అవుతున్నాయి. ఒక మోస్తరు క్రేజ్‌ ఉన్న హీరోల సినిమాలను థియేట్రికల్‌ రిలీజ్‌ చేయడం కంటే ఓటీటీ ద్వారా డైరెక్ట్‌ స్ట్రీమింగ్‌ చేయడం మంచి పని అనే అభిప్రాయంతో చాలా మంది ఉన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో బాలీవుడ్‌లో ఎక్కువ శాతం థియేట్రికల్‌ రిలీజ్‌ స్క్రిప్‌ చేసి ఓటీటీ స్ట్రీమింగ్‌ చేయడం మనం చూస్తూ ఉన్నాం.

జాన్ అబ్రహం 'టెహ్రాన్‌' రిలీజ్‌కి రెడీ

బాలీవుడ్‌ స్టార్స్‌లో జాన్‌ అబ్రహం ఒకరు. ఈయన ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో నటించాడు. ఇతర హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించాడు. హీరోగా ఈయన చేసిన సినిమాలు ఎన్నో థియేట్రికల్‌ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కానీ ఇప్పుడు ఈయన సినిమాలు థియేట్రికల్‌ రిలీజ్‌ చేయడానికి బయ్యర్లు ముందుకు రాని పరిస్థితి. చాలా మంది స్టార్‌ హీరోల సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలుస్తున్న నేపథ్యంలో జాన్ అబ్రహం తాజా చిత్రం 'టెహ్రాన్‌' ను థియేటర్‌ రిలీజ్‌ చేయడానికి బయ్యర్లు సిద్ధంగా లేరు. దాంతో జాన్‌ అబ్రహం స్వయంగా నిర్మించిన ఈ సినిమాను డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

టెహ్రాన్‌ రిలీజ్ ట్రైలర్‌ రిలీజ్‌

టెహ్రాన్‌ సినిమా నుంచి ట్రైలర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. ఈ సినిమా ఎప్పుడో రెండేళ్ల క్రితం ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ సినిమాను ఓటీటీ ద్వారా విడుదల చేయడం కోసం డేట్‌ ని ఫిక్స్ చేశారు. అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రముఖ ఓటీటీ జీ5 లో ఈ సినిమాను స్ట్రీమింగ్‌ చేసేందుకు ఒప్పందం జరిగిందని తెలుస్తోంది. జాన్‌ అబ్రహం వంటి స్టార్‌ నటుడి సినిమా ఇలా డైరెక్ట్‌ ఓటీటీ ద్వారా రాబోతున్న నేపథ్యంలో ముందు ముందు మరిన్ని ఇలాంటి సినిమాలు, ఇలాంటి హీరోల సినిమాలు ఓటీటీలో డైరెక్ట్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కావాల్సి ఉంటుందేమో అని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరో అయిదు పదేళ్ల తర్వాత థియేటర్‌లతో పాటు సమాంతరంగా ఓటీటీలోనూ సినిమాలు విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆసమయంలో ఇలాంటి చిన్న హీరోల సినిమాలు థియేటర్‌లో విడుదల కావడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.