క్రూరమైన నటవృత్తి.. టీన్స్ వేధింపులపై నటి సంచలన వ్యాఖ్యలు
హాలీవుడ్ సీనియర్ నటి, ఆస్కార్ విజేత జోడీ ఫోస్టర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
By: Sivaji Kontham | 17 Jan 2026 11:16 AM ISTహాలీవుడ్ సీనియర్ నటి, ఆస్కార్ విజేత జోడీ ఫోస్టర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సినిమా పరిశ్రమలో టీనేజ్ నటీమణుల విషయంలో జరుగుతున్న లైంగిక దోపిడీ, వేధింపుల గురించి పెద్ద ఎత్తున చర్చకు తెరతీసాయి.
`ఎన్.పి.ఆర్ ఫ్రెష్ ఎయిర్` ఇంటర్వ్యూలో సీనియర్ నటి తన టీనేజీ వయసులో, కెరీర్ ప్రారంభంలో ఎదుర్కొన్న విపత్కర పరిస్థితుల గురించి, ప్రస్తుత తరం నటీమణుల గురించి సంచలన విషయాలు మాట్లాడారు. జోడీ ఫోస్టర్ తన 12 ఏళ్ల వయసులో `టాక్సీ డ్రైవర్` సినిమాలో నటించి చిన్న వయసులోనే ఆస్కార్ నామినేషన్ పొందారు.
వెటరన్ స్టార్ జోడీ ఫోస్టర్ మాట్లాడుతూ-''నాకు ఆ వయసులోనే ఆస్కార్ నామినేషన్ రావడం వల్ల పరిశ్రమలో ఒక రకమైన పవర్ (అధికారం) లభించింది. నేను ఎవరి కెరీర్‌నైనా నాశనం చేయగలనని లేదా ఫిర్యాదు చేయగలనని భయపడి, వేటాడే ప్రిడేటర్స్ నన్ను తాకడానికి భయపడేవారు!'' అని పేర్కొన్నారు. ఆ పవర్ లేకపోతే తను కూడా తన తోటి నటీమణులలాగే వేధింపులకు గురయ్యేదాన్ని అని విశ్లేషించారు.
టీనేజ్ నటీమణులను `కేవలం ఒక వస్తువు`గా చూసే విధానంపై జోడీ ఫోస్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార సమతుల్యత పరిశ్రమలో వేధింపులకు కారణమవుతున్నాయని అన్నారు. అధికారంతో వేధింపులు కేవలం శృంగారపరమైనవి కావని, అవి అధికారం అనే దందాను ప్రదర్శించడమేనని వ్యాఖ్యానించారు. బలహీనంగా ఉన్నవారిని ముఖ్యంగా చిన్న పిల్లలను లొంగదీసుకోవడం క్రూరమైన చర్యగా అభివర్ణించారు.
నేటి తరం చైల్డ్ ఆర్టిస్టుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ వీరి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారు? రెడ్ కార్పెట్ మీద చిన్న వయసులోనే మద్యం తాగుతూ కనిపిస్తుంటే ఎవరూ ఎందుకు ఆపడం లేదు? అని ప్రశ్నించారు. నటన అనేది ఒక `క్రూరమైన వృత్తి` అని, తన వ్యక్తిత్వానికి ఇది సరిపోదని తెలిసినప్పటికీ, పరిస్థితులు తనను ఇక్కడికి తీసుకొచ్చాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఇంటర్వ్యూ తర్వాత హాలీవుడ్‌లో కొత్త చర్చ మొదలైంది. కేవలం స్టార్‌పవర్ ఉన్నవారే సినీరంగంలో సురక్షితంగా ఉండగలరా? సాధారణ నటీమణుల పరిస్థితి ఏమిటి? అనేది ఇప్పుడు సందిగ్ధంగా మారింది. చైల్డ్ ఆర్టిస్టుల కోసం సెట్స్‌లో మరింత కఠినమైన నిబంధనలు ఉండాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. చిన్న వయసులోనే కీర్తి, గ్లామర్ ప్రపంచంలోకి రావడం వల్ల కలిగే మానసిక ఒత్తిడిపైనా ఇప్పుడు చర్చ మరింత ఉధృతమైంది.
జోడీ ఫోస్టర్ `ట్రూ డిటెక్టివ్: నైట్ కంట్రీ` లో ప్రదర్శనకు గాను ఎమ్మీ అవార్డు గెలుచుకున్నారు. చాలామంది హాలీవుడ్ నటీమణుల కంటే భిన్నంగా, తన 63 ఏళ్ల వయసులోనూ హాలీవుడ్ సంస్కరణల కోసం గళం విప్పుతున్నారు.
