జాన్వీ అందరికీ పెద్దితో ఆన్సర్ ఇస్తుందా?
అతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు.
By: Sravani Lakshmi Srungarapu | 31 Jan 2026 1:00 AM ISTఅతిలోక సుందరి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ కపూర్ అతి తక్కువ సమయంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. జాన్వీ 2018లో ధడక్ అనే రొమాంటిక్ డ్రామాతో హీరోయిన్ గా అరంగేట్రం చేశారు. స్టార్ హీరోయిన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీకి కెరీర్ స్టార్టింగ్ నుంచే ఏదొక విషయంలో విమర్శలు ఎదురవుతూనే ఉన్నాయి.
మరోసారి జాన్వీపై విమర్శలు
జాన్వీ స్థిరంగానే నటించినప్పటికీ, ఆమె యాక్టింగ్ పై విమర్శలు అన్ని సినిమాల్లోనూ జాన్వీని అనుసరించాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకనుకోవచ్చు. రీసెంట్ గా జాన్వీ కపూర్ మరోసారి సోషల్ మీడియాలో విమర్శల పాలవుతున్నారు. ఉమెన్స్ లెగ్గింగ్స్ బ్రాండ్ కోసం జాన్వీ ఓ యాడ్ లో చాలా అతిగా నటించారనే ఆరోపణలతో ఆమె వార్తల్లోకెక్కారు.
పూర్తి స్థాయి యాక్టింగ్ చూడలేదని కామెంట్స్
జాన్వీ ఇప్పటివరకు తన కెరీర్లో 14 విభిన్న జానర్ల సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ, జాన్వీ ఇంకా బిగ్ స్క్రీన్ పై తన యాక్టింగ్ ను పూర్తి స్థాయిలో చూపించలేదని ఓ కామెంట్ వినిపడుతూ ఉంటుంది. 2024లో జూ.ఎన్టీఆర్ తో కలిసి దేవర1 సినిమాలో నటించినప్పటికీ, ఆ సినిమాలో జాన్వీ రోల్ గ్లామర్‌కే పరిమితమైంది తప్పించి యాక్టింగ్ పరంగా పెద్దగా స్కోప్ దక్కలేదు.
మిల్లీ, గుంజన్ సక్సేనా: ది కార్గిల్ గర్ల్, ఉలాజ్, హోమ్ బౌండ్ లాంటి సినిమాల్లో జాన్వీ యాక్టింగ్ కు కొంతమేర ప్రశంసలొచ్చినప్పటికీ, ఆ సినిమాలు విమర్శకులపై మాత్రం ఎలాంటి ప్రభావాన్ని చూపలేకపోయాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో జాన్వీ ఇప్పుడు రామ్ చరణ్ తో కలిసి తన రెండో తెలుగు సినిమాలో నటిస్తున్నారు. మార్చి 27న పెద్ది సినిమా రిలీజ్ కానుండగా, ఇప్పటికే రిలీజైన చికిరి సాంగ్ ఇన్‌స్టంట్ చార్ట్‌బస్టర్ గా నిలిచింది. అయితే ఇప్పటివరకు జాన్వీ నుంచి పూర్తి స్థాయి పెర్ఫార్మెన్స్ చూడనందున పెద్దిలో బుచ్చిబాబు అయినా ఆమెను యాక్టింగ్ ఓరియెంటెడ్ పాత్రలో చూపించబోతున్నారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి జాన్వీ బాలీవుడ్ లో వస్తున్న విమర్శలకు తెలుగు సినిమాతో చెక్ పెడతారేమో చూడాలి.
