దర్శకుడిని హాకీ స్టిక్ క్రికెట్ స్టంప్స్‌తో బాది దోపిడీ చేసారు
ఫిబ్రవరి 9న బెంగళూరు వచ్చిన అనీష్‌ను ఒక ఇంట్లోకి తీసుకెళ్లి బంధించారు. అక్కడ హాకీ స్టిక్స్, క్రికెట్ స్టంప్స్‌తో విచక్షణారహితంగా బాదారు.
By: Sivaji Kontham | 27 Feb 2026 9:39 AM ISTదర్శకుడిని హాకీ స్టిక్ క్రికెట్ స్టంప్స్ తో బాది దోపిడీ చేసారు. బాధితుడు తీవ్ర గాయాలతో ఇప్పుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కన్నడ సినీ పరిశ్రమలో జరిగిన ఈ దారుణ సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. `జీవనద భాషె` అనే సినిమాను తెరకెక్కించిన దర్శకుడు టి.ఎ. అనీష్ పై జరిగిన ఈ దాడికి సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ఈ దాడి వెనుక సుమారు 8.5 లక్షల రూపాయల ఆర్ధిక లావాదేవీల వివాదం ఉందని పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరైన ఆశీర్వాద్ అనీష్ దగ్గర తీసుకున్న 2.5 లక్షల అప్పు, అలాగే లక్ష్మీనారాయణ అనే వ్యక్తి అనీష్ సినిమాలో పెట్టిన 6 లక్షల పెట్టుబడి విషయంలో గొడవలు జరిగినట్లు సమాచారం. అయితే అనీష్ తన కారును అమ్మాలని ప్రయత్నిస్తుండగా.. నటి ఐశ్వర్య సహాయంతో నిందితులు అతడిని నమ్మించి బెంగళూరుకు పిలిపించారు. ఈ కేసులో ఒక పథకం ప్రకారం కిడ్నాప్ చేసారని పోలీసులు చెబుతున్నారు.
ఫిబ్రవరి 9న బెంగళూరు వచ్చిన అనీష్‌ను ఒక ఇంట్లోకి తీసుకెళ్లి బంధించారు. అక్కడ హాకీ స్టిక్స్, క్రికెట్ స్టంప్స్‌తో విచక్షణారహితంగా బాదారు. దాడి చేయడమే కాకుండా అతని వద్ద ఉన్న 22 గ్రాముల బంగారు ఆభరణాలు, 30,000 నగదు లాక్కున్నారు. అతని ఏటీఎం కార్డు వాడి మరో 5,500 రూపాయలు డ్రా చేశారు. దాడి జరుగుతున్న సమయంలో నిందితుడు లక్ష్మీనారాయణ వీడియో కాల్‌లో ఉండి, అనీష్‌ను కొట్టమని మిగిలిన వారిని రెచ్చగొట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో నటి, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఐశ్వర్యతో పాటు మొత్తం 11 మందిని అడుగుడి (కర్నాటక) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి పోలీసులు ఆరు మొబైల్ ఫోన్లు, బంగారం, కారు, కొంత నగదును స్వాధీనం చేసుకున్నారు.
సినిమా రంగంలో ఇలాంటి ఆర్ధిక వివాదాలు హింసాత్మకంగా మారడం దురదృష్టకరం. ప్రస్తుతం అనీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
