Begin typing your search above and press return to search.

జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!

మధ్యలో వాటర్ బాటిల్ కావాలంటూ అడగడం, తనను వెళ్లిపొమ్మంటున్నారని చెప్పడం కూడా స్పీచ్‌లో హైలెట్ అయ్యింది.

By:  M Prashanth   |   3 Nov 2026 4:32 PM IST
జీవన్ స్పీచ్.. తరుణ్ భాస్కర్‌కే షాక్ ఇచ్చేలా!
X

సినిమా ఈవెంట్లలో కొందరు మాట్లాడుతుంటే ఆడియెన్స్ గట్టిగానే ఎంజాయ్ చేస్తుంటారు. ఏం మాట్లాడతారో, మధ్యలో ఎలాంటి పంచ్ వేస్తారో కూడా ఊహించలేం. లేటెస్ట్ గా 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' ట్రైలర్ లాంచ్‌లో జీవన్ స్పీచ్ కూడా అలాగే సాగింది. స్టేజ్ ఎక్కినప్పటి నుంచి దిగే వరకు తనదైన స్టైల్‌లో మాట్లాడిన ఆయన మధ్యలో తరుణ్ భాస్కర్‌ను కూడా ఆటపట్టించారు. పైగా తెలుగు, ఇంగ్లిష్ కలిపి ఇచ్చిన స్పీచ్‌తో అక్కడున్నవాళ్లకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ దొరికింది.

మొదట ట్రైలర్ ఎలా ఉందని అభిమానులను అడిగిన జీవన్, తరుణ్ భాస్కర్ ఇచ్చి పడేశారంటూ తన స్పీచ్ మొదలుపెట్టారు. అయితే మధ్యలో ఇంగ్లిష్‌లో మాట్లాడాలని అనుకోవడంతో అసలు కథ మొదలైంది. రెండు నిమిషాలు తెలుగులో మాట్లాడిన తర్వాత పర్ఫెక్ట్ ఇంగ్లిష్ స్పీచ్ ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. అప్పటికే తాను ఏదో సిద్ధమై వచ్చానని, కానీ మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నారంటూ తనదైన స్టైల్‌లో కామెంట్స్ చేశారు.

ఇక సినిమా గురించి చెబుతూ ప్రతి సీన్‌కు గూస్‌బంప్స్ వస్తాయని గట్టిగా చెప్పడం మొదలుపెట్టారు. దీంతో పక్కనున్నవాళ్లు కాస్త నెమ్మదిగా మాట్లాడమన్నట్లు కనిపించింది. వెంటనే ఇది పొలిటికల్ క్యాంపెయిన్ కాదు, నార్మల్‌గా మాట్లాడు అంటున్నారంటూ అభినవ్ చెప్పడంతో స్పీచ్ మరో రూట్ తీసుకుంది. తాను ఎప్పుడూ ఇంత హై పిచ్‌లో మాట్లాడలేదని, అభిమానుల ఉత్సాహంతోనే ఇలా మాట్లాడుతున్నానంటూ ఇంగ్లిష్‌లో కూడా జీవన్ వివరించే ప్రయత్నం చేశారు.

మధ్యలో వాటర్ బాటిల్ కావాలంటూ అడగడం, తనను వెళ్లిపొమ్మంటున్నారని చెప్పడం కూడా స్పీచ్‌లో హైలెట్ అయ్యింది. ఒక దశలో మీకోసం ఇంగ్లిష్‌లో మాట్లాడదామని వచ్చాను కానీ వెళ్లిపోతున్నానంటూ అక్కడున్నవాళ్లను ఆటపట్టించారు. అయినా వెంటనే మళ్లీ మాట్లాడటం మొదలుపెట్టారు. సినిమాలో ప్రతి పాత్ర బాగా వచ్చిందని చెబుతూ నవంబర్ 19న థియేటర్లలో కలుద్దామన్నారు.

ఇక స్పీచ్ చివర్లో యాంకర్‌తో జరిగిన సంభాషణ కూడా ఆసక్తికరంగా సాగింది. తరుణ్ భాస్కర్ పేరును పొరపాటున మరోలా పలకడంతో యాంకర్ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ జీవన్ మాత్రం తరుణ్ ఎంత మంచి దర్శకుడో చెబుతూ తన మాట కొనసాగించారు. మధ్యలో సినిమాటోగ్రాఫర్ ఏజే ఆరోన్ పేరును అరుణ్ అని పిలుస్తున్నారంటూ మరో పంచ్ వేశారు. పేరు సరిగ్గా పిలవకపోతే ఆయన విడాకులు ఇచ్చేస్తారంటూ చెప్పడంతో అక్కడున్నవాళ్లు నవ్వుకున్నారు.

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది రిపీట్' నవంబర్ 19న విడుదల కానుంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ఇందులో నటిస్తున్నారు. ఇప్పటికే తొలి భాగానికి యూత్‌లో మంచి క్రేజ్ ఉండటంతో సీక్వెల్‌పై అంచనాలున్నాయి. అయితే ట్రైలర్ లాంచ్‌లో జీవన్ మాట్లాడిన తీరు చూస్తే సినిమా గురించి చెప్పడం కంటే మధ్యలో ఆయన వేసిన పంచ్‌లకే ఎక్కువ రెస్పాన్స్ వచ్చినట్లు కనిపించింది.