జీతూని తక్కువ అంచనా వేయలేం
రీసెంట్ గా వచ్చిన మలయాళ మూవీ లోకా సినిమాకు ఎవరూ ఊహించని బజ్ రావడం టీమ్ మొత్తాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 12 Sept 2025 11:00 AM ISTదర్శకనిర్మాతలెవరైనా తమ సినిమాకు మంచి హైప్, క్రేజ్ రావాలని కోరుకుంటారు. అలా అని ఎక్కువ క్రేజ్ వచ్చినా అదీ డేంజరే అని భావిస్తున్నారు మేకర్స్. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి అందరూ తమ సినిమా గురించే మాట్లాడుకోవాలి, తమ సినిమానే వార్తల్లో ఉండాలని భావిస్తూ దాని గురించి అప్డేట్స్ ఇస్తూ హైప్ పెంచుతూ ఉంటారు కొందరు.
కానీ కొందరు మాత్రం ఆల్రెడీ ఉన్న అంచనాలను తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఓవర్ హైప్ సినిమాను చంపేస్తుందని భావిస్తూ ముందుగానే ఎక్కువ అంచనాలు పెట్టుకోకండి అని చెప్తూ వస్తుంటారు. తక్కువ అంచనాలతో ఆడియన్స్ థియేటర్లకు వెళ్తే మంచి ఎక్స్‌పీరియెన్స్ తో వారిని బయటకు పంపొచ్చు అనేది వారి మాస్టర్ ప్లాన్.
రీసెంట్ గా వచ్చిన మలయాళ మూవీ లోకా సినిమాకు ఎవరూ ఊహించని బజ్ రావడం టీమ్ మొత్తాన్ని భయపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో చిత్ర యూనిటే సినిమాలో పెద్దగా ఏం ఉండదు, మరీ ఎక్కువ ఊహించుకోకండి అని ఆ అంచనాలను తగ్గించే ప్రయత్నం చేసింది. ఇప్పుడదే దారిలో వెళ్తున్నారు మరో మలయాళ డైరెక్టర్.
దృశ్యం మొదటి రెండు సినిమాలకు భారీ రెస్పాన్స్
అతనే జీతూ జోసెఫ్. దృశ్యం ఫ్రాంచైజ్ తో మంచి డైరెక్టర్ గా ఇమేజ్ తెచ్చుకున్న జీతూ ఇలా మాట్లాడుతుండటం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పటికే ఆయన్నుంచి దృశ్యం ఫ్రాంచైజ్ లో రెండు సినిమాలు రాగా, రెండింటికీ ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ దృశ్యం3 సినిమాను అనౌన్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది.
ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దంటున్న జీతూ
మొదటి రెండు భాగాలను చూసిన తర్వాత ఆడియన్స్ కు దృశ్యం3పై మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను తగ్గించే ప్రయత్నం చేశారు జీతూ. దృశ్యం ముందు భాగాల్లో ఉన్నట్టు ఈ సినిమాల్లో కూడా ఎక్కువ ఇంటెలిజెంట్ సీన్స్ ఉంటాయని అంచనాలు పెట్టుకుంటే నిరాశ తప్పదని జీతూ చెప్పారు. దృశ్యం, దృశ్యం2 సినిమాల్లో హీరో వేసే మైండ్ ప్లాన్స్ కు అందరూ స్టన్ అవుతారు. వాటిని చూసిన ఆడియన్స్ దృశ్యం3 లో కూడా అలాంటి సీన్సే ఆశించడం సహజం. కానీ ఈసారి సినిమాలో ట్విస్టులు, థ్రిల్స్ కంటే ఎమోషనల్ పార్ట్ ఎక్కువగా ఉంటుందని జీతూ అంటున్నారు. ముందు రెండు సినిమాలను అలా చూసి మూడో సినిమాను ఎమోషనల్ గా చూడాలంటే ఆడియన్స్ సడెన్ గా యాక్సెప్ట్ చేయలేరు. అందుకే ఆడియన్స్ ను ముందే ప్రిపేర్ చేస్తే ఎలాంటి బాధా ఉండదనేది జీతూ ఆలోచన. అలా అని అతన్ని తక్కువ అంచనా వేయడానికి లేదు. మరి చూడాలి ఈసారి అతను ఎలాంటి ఫ్యామిలీ థ్రిల్లర్ ను ప్లాన్ చేస్తున్నారో.
