OTT టాక్: దృశ్యం డైరెక్టర్ న్యూ మూవీ.. ఈసారి మ్యాజిక్ రిపీట్ అవ్వలేదా?
దీంతో, సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయిపోయి, ఏదో కంప్యూటర్ రాసిన కథ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.
By: M Prashanth | 20 Oct 2025 9:06 PM ISTఒక మాస్టర్‌పీస్ తీయడం ఒక వరం, కానీ అదే సమయంలో కొన్నిసార్లు అదొక శాపం కూడా. ఎందుకంటే, ఆ తర్వాత తీసే ప్రతీ సినిమాను ప్రేక్షకులు అదే బెంచ్‌మార్క్‌తో చూస్తారు. 'దృశ్యం' లాంటి ఒక గేమ్ చేంజర్ థ్రిల్లర్‌ను అందించిన దర్శకుడు జీతూ జోసెఫ్ విషయంలో ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. అతని నుంచి కొత్త సినిమా వస్తుందంటే, ఆడియన్స్‌లో అంచనాలు హై రేంజ్ లో ఉంటాయి. ఆ థ్రిల్, ఆ సస్పెన్స్, ఆ తెలివితేటలు మళ్లీ ఎక్స్‌పీరియన్స్ చేయబోతున్నామని ఫిక్స్ అయిపోతారు.
ఇక అతని నుంచి వచ్చిన లేటెస్ట్ చిత్రం 'మిరాజ్' కూడా అలాంటి భారీ అంచనాలతోనే ప్రయాణాన్ని మొదలుపెట్టింది. అయితే, థియేటర్లలో ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయినా కూడా, చాలామంది ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. జీతూ జోసెఫ్ సినిమా అంటే అందులో ఏదో ఒక విషయం ఉండే ఉంటుందని బలంగా నమ్మారు. ఇక ఫైనల్ గా ఈ సినిమా అక్టోబర్ 19 నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చింది.
అయితే, ఇంట్లో కూర్చుని సినిమా చూసిన "కౌచ్ క్రిటిక్స్" నుంచి వస్తున్న టాక్ మాత్రం ఆ అంచనాలకు పూర్తి భిన్నంగా ఉంది. 'దృశ్యం' డైరెక్టర్ నుంచి ఇలాంటి సినిమాను అస్సలు ఊహించలేదని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు. అసలు సమస్య ఎక్కడ మొదలైందంటే, సినిమాలో కంటెంట్ లో పట్టు లేకపోవడం. 'దృశ్యం'లో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఒక సాధారణ తండ్రి పడే తపన, ఆ ఎమోషన్ ప్రేక్షకుడిని సీట్లకు కట్టిపడేస్తే, 'మిరాజ్' కథ మొత్తం ఒక నిర్జీవమైన హార్డ్ డిస్క్ చుట్టూ తిరుగుతుంది.
దీంతో, సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ పూర్తిగా మిస్ అయిపోయి, ఏదో కంప్యూటర్ రాసిన కథ చూస్తున్న ఫీలింగ్ కలిగిందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. కేవలం కథ మాత్రమే కాదు, కథనం కూడా ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిందని ఇంటర్నెట్‌లో వినిపిస్తున్న టాక్. సినిమాలో లాజిక్‌తో సంబంధం లేకుండా వచ్చే సన్నివేశాలు, హీరోయిన్ ఉన్నట్టుండి పవర్ఫుల్ గా హైలెట్ చేయడం, కొన్ని పాత్రలు ఎందుకు వస్తాయో, ఎందుకు వెళ్తాయో కూడా తెలియకపోవడం వంటి అంశాలు సినిమా ఫ్లోను పూర్తిగా దెబ్బతీశాయట.
దీనికి తోడు ట్విస్టులలో పెద్దగా పట్టు లేకపోవడంతో, సినిమా ఒక దశ దాటాక థ్రిల్‌గా అనిపించదని అంటున్నారు. నటీనటులు తమ పరిధిలో ఫర్వాలేదనిపించినా, బలహీనమైన పాత్రల వల్ల ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేకపోయారని అంటున్నారు.
మొత్తం మీద, 'మిరాజ్' ఒక మంచి ఐడియానే అయినా, దాన్ని తెరపైకి తీసుకురావడంలో పూర్తిగా విఫలమైందని ఓటీటీ ఆడియన్స్ తీర్పు ఇచ్చేశారు. సస్పెన్స్, ఎమోషన్, లాజిక్ మధ్య సరైన బ్యాలెన్స్ కుదరకపోవడంతో, జీతూ జోసెఫ్ బ్రాండ్ నుంచి వచ్చిన ఈ థ్రిల్లర్, దృశ్యం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఒక పర్ఫెక్ట్ క్రైమ్‌ను ఎలా ప్లాన్ చేయాలో చూపించిన దర్శకుడి నుంచి, ఇలాంటి లాజిక్ లెస్ సినిమా రావడం ఊహించలేదనే కామెంట్స్ కూడా వస్తున్నాయి.
