Begin typing your search above and press return to search.

రూ.4.25 లక్షల నుంచి రూ.450 కోట్లు... హీరో గారి లక్

సినిమా తారలు ఈ మధ్య కాలంలో సంపాదించిన మొత్తంలో ఎక్కువ శాతం రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం.

By:  Ramesh Palla   |   23 July 2026 5:49 PM IST
రూ.4.25 లక్షల నుంచి రూ.450 కోట్లు... హీరో గారి లక్
X

సినిమా తారలు ఈ మధ్య కాలంలో సంపాదించిన మొత్తంలో ఎక్కువ శాతం రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడిగా పెట్టడం మనం చూస్తూ ఉన్నాం. రెండు దశాబ్దాల ముందు వరకు నటీనటులు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టక పోవడం వల్ల ఎంతగా నష్టపోయారో మనం చూస్తూ ఉన్నాం. సంపాదించిన ప్రతి రూపాయిని దాచుకోవడం లేదా ఖర్చు పెట్టడం వల్ల కెరీర్‌ చివరి దశలో ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నటీనటులు చాలా మంది ఉన్నారు. అయితే చాలా తక్కువ మంది మాత్రమే వచ్చిన డబ్బును భూమిపై పెట్టడం ద్వారా కోట్ల రూపాయల లాభం దక్కించుకున్నారు. సీనియర్‌ హీరోల్లో శోభన్‌ బాబు, మురళి మోహన్‌ భూమిపై పెట్టుబడి పెట్టడం ద్వారా ఏ స్థాయిలో లాభాలు దక్కించుకున్నారో తెలిసిందే. చెన్నైలో శోభన్‌ బాబుకు ఇప్పటికీ వందల కోట్ల విలువైన భూములు ఉన్నాయి, ఇక హైదరాబాద్‌లో మురళి మోహన్‌ ఆస్తుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఇల్లు...

బాలీవుడ్‌ హీరోలు, హీరోయిన్స్‌ సైతం ఒకప్పుడు రియల్‌ ఎస్టేట్‌ పై ఆసక్తి చూపించేవారు కాదు. కానీ ఉండేందుకు కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలం వారికి అతి పెద్ద ఆస్తిగా మారింది. షారుఖ్ ఖాన్‌ అప్పట్లో తక్కువ రేటుకు కొనుగోలు చేసిన ఇల్లు ఇప్పుడు ముంబైలోనే అత్యంత ఖరీదైన ఇల్లు గా ఉంది. ఇక బాలీవుడ్‌ సీనియర్‌ స్టార్‌ జితేంద్ర తీసుకున్న ఒక ఇల్లు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మూడు తరాలకు సరిపోయే ఆస్తిగా మారింది. జితేంద్ర మంచి ఫామ్‌లో ఉన్న సమయంలో అంటే 1970-80 మధ్య కాలంలో ముంబైలోని ఒక ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ సమయంలోనే ఆ ఇంటికి జితేంద్ర రూ.4.25 లక్షలు పెట్టాడు. చాలా మంది ఇంటికి అంత ఖర్చు ఏంటని ఎద్దేవ చేశారట. తప్పు చేశావు అంటూ చాలా మంది ఆయనను నిందించారట. అయినా కూడా తనకు ఇష్టం అయింది కనుక కొనుగోలు చేశాను అని జితేంద్ర అన్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు.

జితేంద్ర ఇంటి ఖరీదు రూ.450 కోట్లు

3450 చదరపు అడుగుల్లో ఉన్న ఒక పాత బంగ్లాను జితేంద్ర 4.25 లక్షలకు కొనుగోలు చేయడం జరిగింది. కాల క్రమేనా ఆ ఇంటిని తొలగించి పెద్ద ఇల్లు కట్టాలని జితేంద్ర అనుకున్నారు. అప్పుడు ఆ ఇంట్లో ఉన్న పాత టేకు వుడ్‌ కి ఏకంగా రూ.11.5 లక్షలు వచ్చాయట. అంటే జితేంద్ర కొనుగోలు చేసిన మొత్తానికి దాదాపుగా మూడు రెట్లు అధికంగా వచ్చింది. చాలా తక్కువ ఏళ్లకే అంతగా డిమాండ్ పెరిగింది. ఇప్పుడు ఆ ప్లేస్‌లో జితేంద్ర ఇల్లు కట్టాడు. కలప అమ్మగా వచ్చిన డబ్బుతో పాటు, మరికొంత మొత్తం వేసి ఆ ఇంటిని నిర్మించారని ఆయన సన్నిహితులు చెబుతారు. కోటి లోపు బడ్జెట్‌తోనే ఆ ఇంటిని పూర్తి చేశారని అంటూ ఉంటారు. ముంబైలోని అత్యంత ఖరీదైన ఏరియా పాలీ హిల్‌లో ఈ ఇల్లు ఉండటంతో ప్రతి ఏడాది వ్యాల్యూ పెరుగుతూ వస్తోంది.

రియల్‌ ఎస్టేట్‌లో ఓపిక..

మార్కెట్‌లో ఉన్న రేట్ల ప్రకారం ప్రస్తుతం ఆ ఆస్తి విలువ దాదాపుగా రూ.450 కోట్లు ఉంటుందని అంటున్నారు. జితేంద్ర కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు. ఆ సమయంలో నమ్మకంతో కొన్న ఇల్లు ఇప్పుడు వందల కోట్ల ఆస్తిగా మారిందని ఆయన అన్నారు. కష్ట కాలం వచ్చినా ఆ ఇంటిని అమ్మక పోవడం వల్ల ఇప్పుడు ముంబైలోనే అత్యంత ఖరీదైన ఏరియాలో తన ఇల్లు ఉందనే గుర్తింపు దక్కింది అన్నట్లుగా జితేంద్ర చెప్పుకొచ్చారు. ముంబైలో మాత్రమే కాకుండా రియల్‌ ఎస్టేట్‌ ఎక్కడ అయినా ఇలాగే ఉంది. కాస్త జాగ్రత్తగా పరిశీలించి తీసుకున్న భూమికి పది ఇరవై ఏళ్లు ఆగితే మంచి రేటు వస్తుంది. తక్కువ రేటుకు కొనుగోలు చేస్తే అది జీవితాన్నే మార్చేంతగా ఎక్కువ రేటుకు పలికే అవకాశం ఉంది. అయితే జితేంద్ర గారి విషయంలో ఓపిక రియల్‌ ఎస్టేట్‌లో చాలా అవసరం అన్నది వెళ్లడి అయింది. భూమి విషయంలో ఎప్పుడూ ఇదే జరుగుతుంది అనేది విశ్లేషకుల మాట.