భయం, నమ్మకం మనిషి ప్రవర్తనను శాసిస్తాయి!
సమాజంలో చట్టాల పట్ల భయం, తప్పు చేస్తే వచ్చే పరిణామాల పట్ల భయం మనుషులను క్రమశిక్షణలో ఉంచడానికి ఉపయోగపడతాయి.
By: Srikanth Kontham | 26 May 2026 7:00 AM ISTమానవ మనస్తత్వ శాస్త్రంలో భయం, నమ్మకం అనేవి అత్యంత శక్తివంతమైన భావోద్వేగాలు. ఇవి తాత్కాలిక భావాలు మాత్రమే కాదు. సమాజంలో మనిషి రోజువారీ ప్రవర్తనను, జీవితకాల నిర్ణయాలను శాసించే అదృశ్య శక్తులు. తాజాగా జేడీ చక్రవర్తి ఇవే అంశాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మనిషి జీవితంలో భయం - నమ్మకం అనే రెండు విరుద్ధ పూరకమైన కోణాలు ఏ విధంగా మానవ సమాజాన్ని, వారి ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయనే దానిపై తనదైన శైలిలో విశ్లేషించారు. జేడీ అభిప్రాయం ప్రకారం.. భయం అనేది మనిషిలో బలహీనతను మాత్రమే రగల్చదు. కొన్నిసార్లు అది అత్యంత శక్తివంతమైన చోదక శక్తిగా మారుతుంది.
సమాజంలో చట్టాల పట్ల భయం, తప్పు చేస్తే వచ్చే పరిణామాల పట్ల భయం మనుషులను క్రమశిక్షణలో ఉంచడానికి ఉపయోగపడతాయి. అయితే అదే భయం శృతిమించితే అది మనిషి విచక్షణను దెబ్బతీసి అనాలోచిత నిర్ణయాలకు -అభద్రతాభావానికి దారితీసే ప్రమాదం కూడా ఉంది. సినిమాలో అయినా? నిజ జీవితంలో అయినా? భయాన్ని సరిగ్గా ఆవిష్కరించినప్పుడే మానవ నైజంలోని అసలు రంగులు బయటపడతాయని అభిప్రాయపడ్డారు. నమ్మకం అనేది మానవ మనుగడకు అత్యంత అవసరమైన ఇంధనం వంటిది. ఒక వ్యక్తిపై, వ్యవస్థపై లేదా ఒక ఉన్నతమైన భావనపై ఆధారపడి మనిషి జీవితాన్ని ముందుకు సాగిస్తాడు.
నమ్మకం మనిషికి కొండంత అండను, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. కానీ ఇదే నమ్మకం గుడ్డిగా మారినప్పుడు అది వినాశనానికి కారణమవుతుంది. నమ్మకానికి, మూఢనమ్మకానికి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించలేనప్పుడు మనిషి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తాయని ఇది సమాజంపై తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని జేడీ విశ్లేషించారు. సినిమా రంగంలో ముఖ్యంగా సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ , హారర్ జోనర్‌లలో కథలను రాసుకునేటప్పుడు ఈ రెండు ఎమోషన్స్ అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తాయి. ప్రేక్షకుడు తెరపై చూసే పాత్రల భయాన్ని తన భయంగా ఫీల్ అయినప్పుడే సదరు చిత్రం విజయవంతం అవుతుంది.
జేడీ చక్రవర్తి సుదీర్ఘ కెరీర్‌లో ఇలాంటి ఎమోషన్స్ ఉన్న పాత్రలను ,చిత్రాలను ఎన్నో చేశారు. అందువల్లే మానవ ప్రవర్తనను ప్రభావితం చేసే మానసిక కోణాలను వెండితెరపై ఆవిష్కరించడం నటుడిగా, దర్శకుడిగా ఎప్పుడూ ఒక గొప్ప సవాల్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో సాంకేతికత ఎంతగా విస్తరించినా? మనిషి అంతర్గతంగా ఇంకా ప్రాథమిక భయాలకు, నమ్మకాలకు లోబడే జీవిస్తున్నాడనేది వాస్తవం. డిజిటల్ యుగంలో చిన్న తప్పుడు వార్త లేదా అపోహ మనుషుల్లో విపరీతమైన భయాన్ని క్షణాల్లో రేకెత్తించగలవు.
ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమలోని భయాలను అధిగమిస్తూ నమ్మకాలను హేతుబద్ధంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందని ఈ రకమైన చర్చలు అప్పుడప్పుడు గుర్తు చేస్తాయన్నారు. జేడీ చక్రవర్తి పంచుకున్న ఈ ఆలోచనలు ఒక సినిమా కోణంలో చూసేవి కావు. ఇవి మనిషి రోజువారీ జీవితానికి, సమాజ గమనానికి అద్దం పడతాయి. భయం, నమ్మకం అనేవి నాణేనికి ఉన్న రెండు ముఖాల లాంటివని, వాటిని సమతుల్యంగా మేనేజ్ చేయగలిగినప్పుడే మానవ ప్రవర్తన సక్రమంగా ఉంటుందని జేడీ మాటల సారాంశం.
