Begin typing your search above and press return to search.

JD అందుకే ఆల్ టైమ్ ఫేవరెట్‌ గా మారుతున్నారా?

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి మరోసారి హాట్ టాపిక్‌ గా మారుతున్నారు.

By:  M Prashanth   |   26 April 2026 9:00 PM IST
JD అందుకే ఆల్ టైమ్ ఫేవరెట్‌ గా మారుతున్నారా?
X

టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సీనియర్ యాక్టర్ జేడీ చక్రవర్తి మరోసారి హాట్ టాపిక్‌ గా మారుతున్నారు. ఒకప్పుడు హీరోగా సూపర్ హిట్లు అందుకున్న ఆయన, ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్‌ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా, విలన్‌ గా విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను తనదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు.

నిజానికి జేడీ చక్రవర్తి సినీ జర్నీ గులాబీ సినిమాతో ప్రారంభమైంది. ఆ మూవీ విజయం ఆయనకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తర్వాత కూడా పలు చిత్రాల్లో హీరోగా నటించి తన మార్క్ చూపించారు. అయితే మెల్లగా హీరోగా అవకాశాలు తగ్గడంతో.. సహాయ పాత్రలు, నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడం ప్రారంభించారు. ఆ మార్పు ఆయన కెరీర్‌ కు కొత్త దిశను చూపించిందని చెప్పాలి.

కొంత కాలం సినిమాలకు దూరంగా ఉన్న ఆయన, రీసెంట్ గా రీఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా జోష్ సినిమాలో విలన్ పాత్రతో ఫిదా చేశారు. ఆ తర్వాత వరుసగా విభిన్న పాత్రల్లో నటిస్తూ తన యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. ఇప్పుడు జేడీ చక్రవర్తి నటిస్తున్న తాజా చిత్రం గాయపడ్డ సింహం. తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ఆ చిత్రానికి కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు.

పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంధని, భాను కిరణ్ ప్రతాప్, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఆ మూవీని నిర్మించారు. మే 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. జేడీ చక్రవర్తి బ్రూటల్ ధర్మ అనే కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో ఆయన పాత్రపై ఆసక్తి పెరిగింది.

ముఖ్యంగా తన స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీతో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచుతున్నారు. అయితే ఆ సినిమా ప్రమోషన్లలో జేడీ చక్రవర్తి యాక్టివ్‌ గా పాల్గొంటున్న తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సాధారణంగా లీడ్ రోల్‌ లో ఉన్న నటులే ఎక్కువగా ప్రమోషన్స్‌ లో కనిపిస్తారు. కానీ జేడీ మాత్రం రోల్ లెంగ్త్ తో సంబంధం లేకుండా సినిమా కోసం పూర్తి స్థాయిలో కష్టపడుతున్నారు.

వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. గత అనుభవాలు, అరుదైన సంఘటనలను రివీల్ చేయడం ప్రేక్షకులకు నచ్చుతోంది. అయితే ఇప్పుడు నెటిజన్లు జేడీ డెడికేషన్ ను ప్రశంసిస్తున్నారు. సినిమాలో నటించడమే కాకుండా, ప్రమోషన్స్‌ లో అదే ఉత్సాహంతో పాల్గొనడం గొప్ప విషయమంటూ కామెంట్లు చేస్తున్నారు. అందుకే దర్శక నిర్మాతలు ఆయనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా నటుడిగా మాత్రమే కాకుండా, ఒక సినిమా సక్సెస్ కోసం అవసరమైన ప్రతి అంశంలో భాగస్వామిగా మారుతున్న జేడీ ఇప్పుడు నిజంగానే ఆల్ టైమ్ ఫేవరెట్ గా మారుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.