Begin typing your search above and press return to search.

JD సౌంద‌ర్యం, ఫిట్నెస్ సీక్రెట్ తెలిసొచ్చింది!

నటుడు జేడీ చక్రవర్తి గత 24 ఏళ్లుగా అన్నం తినడం లేదని వెల్లడించారు. ఆహారంపై ఆసక్తి ఉండదని, ప్రతిరోజూ ఎక్కడున్నా గంటసేపు జిమ్ చేస్తానని చెప్పారు. స్నేహాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదన్న జేడీ, ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రస్తుతం ‘తులాభారం’, ‘జాతస్య మరణం ధృవమ్’ చిత్రాల్లో నటిస్తున్నారు.

By:  Sivaji Kontham   |   22 Nov 2026 5:29 AM IST
JD సౌంద‌ర్యం, ఫిట్నెస్ సీక్రెట్ తెలిసొచ్చింది!
X

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక శైలి ఉన్న‌ నటుడు జె.డి. చక్రవర్తి. అత‌డి ఆరోగ్యం సీక్రెట్ కూడా అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తుంది. ఫిట్‌నెస్- డైట్- స్నేహాలు- తాజా సినిమాలపై జేడీ ఓ చానెల్ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించిన విష‌యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు దారితీశాయి. ఈ ఇంట‌ర్వ్యూలో సీనియ‌ర్ న‌టుడు జేడీ తన జీవనశైలి గురించి కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ముఖ్యంగా తాను గత 24 ఏళ్లుగా అన్నం తినడం మానేశానని చెప్పడం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే తాను బరువు పెరుగుతాననే భయంతో కాకుండా.. ఆహారంపై పెద్దగా ఆసక్తి ఉండదని.. ఫుడ్ తనకు అత్యంత బోరింగ్ టాపిక్ అని స్పష్టం చేశారు. ఫ్రూట్ జ్యూసులలో షుగర్ ఎక్కువగా ఉంటుందనే కారణంతో వాటిపైనా శ్రద్ధ పెట్టనని.. కార్బోహైడ్రేట్లు ఇతర ఆహారాల ద్వారా అందుతాయని పేర్కొన్నారు.

ఫిట్‌నెస్ విషయంలో క్రమశిక్షణతో కూడిన దినచర్యను పాటిస్తున్నట్లు జె.డి. వెల్లడించారు. `హెల్త్ ఈజ్ వెల్త్` అనే సూత్రాన్ని తాను వంద శాతం నమ్ముతానని.. అవుట్‌డోర్ షూటింగ్‌లలో ఉన్నా ఎక్కడున్నా ప్రతిరోజూ కచ్చితంగా ఒక గంట జిమ్ చేస్తానని చెప్పారు. ఒక సినిమా పాత్ర కోసం కండలు తగ్గించుకోవాల్సి రావడంతో ఇటీవల బైసెప్, ట్రైసెప్ కొలతలు తగ్గాయని చెబుతూనే.. క్రికెట్ ఆటగాడికి మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ ఎలా అవసరమో.. నటుడికి కూడా నిరంతర ఫిజిక‌ల్ ప్రిప‌రేష‌న్ అలానే అవసరమని అభిప్రాయపడ్డారు. స్నేహాలు- సంబంధాలపై మాట్లాడుతూ.. తనకు స్నేహితులు లేరని.. పైపైన ఆరా తీయడం ఇష్టం ఉండదని.. సహాయం చేయగలిగే స్థోమత ఉన్నప్పుడే ఎవరినైనా ఆదుకోవాలనేది తన సిద్ధాంతమని జేడీ సూటిగా చెప్పారు.

ప్రస్తుతం ముంబై కంటే హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నానని చెప్పిన జె.డి... తన ఇటీవ‌లి చిత్రం `గాయపడ్డ సింహం`పైనా మాట్లాడారు. ఈ సినిమాలో తన పాత్ర బాగా నచ్చిందని... తరుణ్ భాస్కర్ డ్యాన్స్ చూసి ఆశ్చర్యపోయానని.. దర్శకుడు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. ఇక‌పై ఏడాదికి కనీసం మూడు నాలుగు సినిమాలు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు. ప్ర‌స్తుతం తులాభారం, జాత‌స్య మ‌ర‌ణం ధృవ‌మ్ అనే చిత్రాల‌లోను జేడీ నటిస్తున్నారు.

56 ఏళ్ల వయసులోనూ ఇంత ఫిట్‌గా ఉన్నారంటూ విడుదలైన ఈ ఇంటర్వ్యూ చూసాక‌.. `శివ` సినిమా వచ్చి ఇన్నేళ్లు గడిచినా 56 ఏళ్లేనని చెప్పడంపై కొందరు వయసును లెక్కలు కడుతూ సందేహాలు వ్యక్తం చేస్తుండ‌గా.. పెళ్లితో ప‌ని లేని జీవితం.. నిరంతర వ్యాయామమే జేడీ సౌంద‌ర్య ర‌హస్య‌మ‌ని మరికొందరు అభిప్రాయపడ్డారు.