పవన్ మొండోడు.. రాజకీయాల్ని వదలడు.. జయసుధ వ్యాఖ్యలు
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, రాజకీయాల్లోను రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల కోసం మెజారిటీ సమయం కేటాయిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు.
By: Sivaji Kontham | 10 Dec 2025 9:00 AM ISTపవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ, రాజకీయాల్లోను రాణిస్తున్నారు. ముఖ్యంగా రాజకీయాల కోసం మెజారిటీ సమయం కేటాయిస్తూ ప్రజల్లోకి వెళుతున్నారు. ప్రజాసమస్యలపై ఆయన నిజాయితీగా గళం విప్పుతున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నెమ్మదిగా జనసేన గ్రాఫ్ ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పుడు పరిశ్రమలో సీనియర్ నటిగా సుదీర్ఘ అనుభవంతో పాటు, రెండుసార్లు సికిందరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచిన సహజనటి జయసుధ పవన్ కల్యాణ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ``పవన్ కల్యాణ్ మొండి పట్టుదల ఉన్నవాడు.. రాజకీయాల్లో స్థిరంగా రాణిస్తున్నార``ని జయసుధ అన్నారు. సినిమాల్లో ఎలా దూకుడుగా ముందుకు సాగారో, ఇప్పుడు రాజకీయాల్లోను అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. చాలా మంది రాజకీయాల్లోకి వచ్చి వెళ్లిపోతున్నారు. కానీ పవన్ అలా కాదు. రాజకీయాల్లో విజయవంతం అయ్యారు...ఎక్కడా వెనుకంజ వేయలేదు! అని జయసుధ కితాబిచ్చారు.
రాజకీయ నాయకులు సహజంగా మరో నాయకుడిని పొగడటం అరుదు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపున రాజకీయాల్లో కొనసాగుతున్న జయసుధ నేరుగా పవన్ కల్యాణ్ పై ప్రశంసలు కురిపించడం జనసైనికుల్లో ఉత్సాహం నింపుతోంది. రాజకీయాల్లో దూకుడు కంటే అనుభవం ముఖ్యం.. పవన్ కి ఇప్పటికి అనుభవం వస్తోంది. అందుకే మునుముందు అతడు ఈ రంగంలో అద్భుతాలు చేస్తాడని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రిగా పవన్ మార్క్ సేవలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫిదా అవుతున్నారు. పవన్ చేతల్లో నిజాయితీ ఉందని, అందుకే ప్రజాదరణ దక్కుతోందని జనసైనికులు అంటున్నారు.
పెండింగ్ షూట్ పూర్తి...
పవర్‌స్టార్ ఓ వైపు రాజకీయాల్లో కొనసాగుతూనే పెండింగ్ లో ఉన్న సినిమాల చిత్రీకరణను ముగించారు. హరీష్ శంకర్ డైరెక్షన్ లో `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రీకరణను పూర్తి చేసిన సంగతి తెలిసిందే. తదుపరి ప్రచారంలో భాగంగా ఇటీవల `ఉస్తాద్ భగత్ సింగ్` మొదటి పాటను ఆవిష్కరించారు. అభిమానుల్లో ఇది ఉత్సాహాన్ని నింపింది. టైటిల్ వెల్లడితో పాటు, ఈ పాట అందించే మాస్, హై వోల్టేజ్ వైబ్‌ను హైలైట్ చేసే విధంగా ఒక కొత్త పోస్టర్‌ను కూడా చిత్రబృందం విడుదల చేసింది.
గత సెప్టెంబర్ నాటికి ఉస్తాద్ షూట్ ను పవన్ పూర్తి చేశాడు. ఆ తర్వాత లోకేష్ కనగరాజ్ తో ఓ భారీ యాక్షన్ సినిమా చేయాలని భావిస్తున్నట్టు కథనాలొచ్చాయి. ఈ ప్రాజెక్ట్ కోసం వారి మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే దీనిని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది.
