Begin typing your search above and press return to search.

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

నవంబర్ 14న విడుదల కానున్న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా టికెట్ ధరలను పిల్లల కోసం రూ.250 నుంచి రూ.150కి తగ్గించినట్లు చిత్రబృందం ప్రకటించింది. బాలల దినోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు దర్శకుడు నవీన్ దేశబోయిన తెలిపారు. పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కనెక్ట్ అయ్యే కథతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు మేకర్స్ వెల్లడించారు.

By:  M Prashanth   |   13 Nov 2026 3:54 PM IST
పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు
X

బాలల దినోత్సవం సందర్భంగా నవంబర్ 14న థియేటర్లలోకి రాబోతున్న చిత్రం జయంత్ అండ్ ది జింగో పెన్. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో, నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్ పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి ఈ సినిమాను నిర్మించారు. చిల్డ్రెన్స్ డే స్పెషల్ గా విడుదలవుతున్న నేపథ్యంలో, పిల్లల కోసం టికెట్ ధరలను రూ. 250 నుంచి రూ. 150కి తగ్గిస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

ఈ సందర్భంగా దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ, ఈ సినిమాను కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని స్పష్టం చేశారు. అందుకే పిల్లలకు అందుబాటులో ఉండేలా టికెట్ రేట్లు తగ్గించామని, ఇప్పటికే పలు స్కూల్స్ థియేటర్లను బుక్ చేసుకున్నాయని తెలిపారు. మరోవైపు కొందరు కావాలనే తమ సినిమాను చిల్డ్రెన్స్ డే స్పెషల్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారని, ఆ విషయంలో ప్రేక్షకులు పొరపాటు పడవద్దని ఆయన సూచించారు.

నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ, పిల్లల మార్కులు కాకుండా వాళ్ల మనసులను చూడాలనే భావంతో ఈ కథను రూపొందించినట్లు చెప్పారు. సినిమాలోని ఎమోషన్స్ పిల్లలతో పాటు తల్లిదండ్రులు, టీచర్లకు కూడా కనెక్ట్ అవుతాయని అన్నారు. మొదటి నుంచీ పిల్లల కోసమే ఈ చిత్రాన్ని తీశామని, వారికి కానుకగానే టికెట్ ధరలు తగ్గించి అందిస్తున్నామని సహ నిర్మాత షఫి పేర్కొన్నారు. అన్ని చోట్లా బుకింగ్స్ బాగున్నాయని వెల్లడించారు.

సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన మాస్టర్ జయంత్ బొలిశెట్టి మాట్లాడుతూ, పిల్లలకు, పెద్దలకు, టీచర్లకు ఒక మంచి సందేశం ఇచ్చేలా ఈ చిత్రం ఉంటుందని తెలిపాడు. ఈ చిత్రానికి సంగీతం, సాహిత్యం అందించిన ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ, సినిమాలోని పాటలకు శ్రోతల నుంచి మంచి స్పందన వచ్చిందని అన్నారు. పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ కలిసి థియేటర్లకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారని వివరించారు.

ఈ చిత్రంలో మన శంకర వర ప్రసాద్ ఫేమ్ ఊహా రెడ్డి, సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్ ముఖ్య పాత్రల్లో నటించారు. వీరితో పాటు సీనియర్ నటులు తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి, అశోక్ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి ఇతర కీలక పాత్రలు పోషించారు. అందరి పాత్రలు కథకు తగినట్లుగా ఉంటాయని యూనిట్ తెలిపింది. ఈ సినిమా పిల్లల మనస్తత్వం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆలోచనల చుట్టూ సాగే కథాంశంతో ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. బాలల దినోత్సవం రోజున టికెట్ రేట్లు తగ్గించడం ఫ్యామిలీ ఆడియన్స్ కు, స్కూల్ విద్యార్థులకు కలిసి వచ్చేలా కనిపిస్తోంది. మరి నవంబర్ 14న విడుదలవుతున్న జయంత్ అండ్ ది జింగో పెన్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.