ఇంటిని వేలం వేస్తున్న జయం రవి.. భార్య పిల్లల పరిస్థితేంటి ?
చాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు.. లేక కొనుక్కున్న సమయంలో డబ్బులు అడ్జస్ట్ కాకపోవడంతో ఇంటి మీద రుణాలు తీసుకుంటూ ఉంటారు
By: Madhu Reddy | 25 Sept 2025 11:20 AM ISTచాలామంది ఇల్లు కట్టుకునేటప్పుడు.. లేక కొనుక్కున్న సమయంలో డబ్బులు అడ్జస్ట్ కాకపోవడంతో ఇంటి మీద రుణాలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ రుణాలను సకాలంలో చెల్లిస్తే ఏం కాదు.కానీ తీసుకున్న రుణాలు కట్టకపోతే కచ్చితంగా ఎక్కడైతే రుణం తీసుకున్నారో ఆ సంస్థ వాళ్ళు వచ్చి ఆ యజమానికి నోటీసులు ఇవ్వడం, ఒకవేళ నోటీసులకు స్పందించకపోతే ఇల్లు వేలం వేయడం అనేది మామూలే. అయితే ఇది సామాన్యుల విషయంలో అయితే అంత పెద్దగా పట్టించుకోరు. కానీ ఓ హీరో విషయంలో అయ్యేసరికి దీన్ని చాలా వైరల్ చేస్తున్నారు. మరి ఇంతకీ ఇల్లు వేలం వేస్తామంటూ ఏ హీరోకి నోటీసులు అందాయి. ఆ హీరో ఎవరో కాదు కోలీవుడ్ నటుడు రవి మోహన్ అలియాస్ జయం రవి.
తమిళంలో 'జయం' సినిమాతో ఫేమస్ అయిన రవి మోహన్ ను జయం రవి అని కూడా పిలుస్తూ ఉంటారు. అయితే జయం రవికి సంబంధించి తాజాగా ఒక షాకింగ్ విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే జయం రవికి సంబంధించి.. చెన్నైలోని ఇంజంబక్కంలోని ఇల్లుని వేలం వేస్తామంటూ అధికారులు నోటీసులు అంటించారు.. ఇక విషయంలోకి వెళ్తే. నటుడు జయం రవి చెన్నైలోని ఇంజంబక్కం లో ఇంటి కోసం ఓ ప్రైవేట్ బ్యాంకు నుండి పెద్ద ఎత్తున రుణాన్ని తీసుకున్నారట. ఆ తర్వాత కొద్ది రోజులు ఇంటి కోసం తీసుకున్న రుణాన్ని కొద్ది నెలలు క్లియర్ గా కట్టినప్పటికీ దాదాపు పది నెలలుగా ఆ డబ్బు చెల్లించడం లేదట. దాంతో ప్రైవేట్ బ్యాంకు ఆఫీసర్లు జయం రవి ఇంటిదగ్గర అలాగే ఆయన కార్యాలయంలో ఇంటిని వేలం వేస్తున్నట్టు నోటీసులు అందించడంతో.. అక్కడ ఉన్న కార్యాలయంలోని కొంతమంది దాన్ని చించేశారు.
అయితే జయం రవి ఇల్లు పై తీసుకున్న లోన్ ప్రస్తుతం రూ.7.60 కోట్లకు పైగానే ఉందట. దాదాపు గత పది నెలలుగా ఇంటి లోన్ చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు ఇంటికి చాలాసార్లు నోటీసులు పంపించారట. కానీ జయం రవి స్పందించకపోవడంతో ఇల్లు వేలం వేస్తున్నట్టు ఇంటికి నోటీసులు అంటించారట. అయితే ప్రస్తుతం జయం రవి రుణం తీసుకున్న ఆ ఇంటిలో ఆయన ఉండడం లేదు.గత కొద్ది రోజులుగా భార్యతో విభేదాలు వచ్చి ఆమెకు విడాకులు ఇస్తున్నట్టు ప్రకటించి ఇంటి నుండి వెళ్లిపోయారు. ఇక అప్పటినుండి జయం రవి భార్య ఆర్తి,పిల్లలు మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు.. ఇంటిని వేలం వేస్తే ఆర్తి, ఇద్దరు పిల్లలు రోడ్డున పడతారని ఈ విషయం తెలిసిన పలువురు నెటిజన్లు పలు కామెంట్లు పెడుతున్నారు. లోను కట్టకపోతే భార్యా, పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
జయం రవి గత ఏడాది తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించి విడాకులకు అప్లై చేశాడు. ఆ తర్వాత సింగర్ కెనీషాతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే జయం రవి ఇల్లు లోన్ కట్టకపోవడంతో వేలం వేస్తున్నట్టు నోటీసులు అంటించడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ మీడియా హాట్ టాపిక్ గా మారింది.అలాగే రీసెంట్ గా జయం రవి పై టచ్ గోల్డ్ యూనివర్సల్ అనే నిర్మాణ సంస్థ కూడా కొన్ని ఆరోపణలు చేసింది. జయం రవి మా బ్యానర్ లో రెండు సినిమాలు చేస్తానని రూ.6 కోట్లు తీసుకొని వేరే సినిమాలు ఒప్పుకున్నాడు అంటూ ఆరోపణ చేశారు. అలాగే ఈ నిర్మాణ సంస్థ వాళ్ళు ఆ ప్రైవేట్ బ్యాంకు దగ్గరికి వెళ్లి ఆయన ఇల్లు జప్తు చేయాలని అభ్యర్థించినట్లు తెలుస్తోంది. దాంతో జయం రవి ఇంటిని వేలం వేస్తున్నట్టు బ్యాంక్ అధికారులు నోటీసులు అంటించారు. మరి ఈ విషయంలో జయం రవి ఎలా స్పందిస్తారో అనేది తెలియాల్సి ఉంది.
