Begin typing your search above and press return to search.

పిల్ల‌ల చుట్టూ బాడీ గార్డుల‌ను ఉంచి క‌ల‌వ‌నివ్వ‌కుండా ఆపేస్తోంది.. జ‌యం ర‌వి ఆవేద‌న‌!

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు జయం రవి (రవి మోహన్)... ఆయన మాజీ భార్య ఆర్తీల మధ్య నడుస్తున్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది.

By:  Sivaji Kontham   |   16 May 2026 11:42 PM IST
పిల్ల‌ల చుట్టూ బాడీ గార్డుల‌ను ఉంచి క‌ల‌వ‌నివ్వ‌కుండా ఆపేస్తోంది.. జ‌యం ర‌వి ఆవేద‌న‌!
X

తమిళ చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడు జయం రవి (రవి మోహన్)... ఆయన మాజీ భార్య ఆర్తీల మధ్య నడుస్తున్న వివాదం రోజురోజుకూ ముదురుతోంది. గాయని కెనీషాతో బ్రేకప్ జరిగినట్లు వార్తలు వచ్చిన కొద్ది గంటల్లోనే జయం రవి మీడియా ముందుకు వచ్చి చేసిన వ్యాఖ్యలు కోలీవుడ్‌లో పెను సంచలనం సృష్టించాయి. ఈ వివాదానికి సంబంధించిన తాజా పరిణామాలు, సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా వైరల్ అవుతున్న పోస్టుల ప్రకారం.. జయం రవి తన మాజీ భార్య ఆర్తీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన వ్యక్తిగత జీవితం ఈ స్థాయికి చేరడానికి... తనపై నిరంతరం ఆన్‌లైన్ ట్రోలింగ్ జరగడానికి ఆమె చుట్టూ ఉన్న పరిసరాలే కారణమంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

గత కొంతకాలంగా జయం రవి, కెనీషాల బంధంపై సామాజిక మాధ్యమాలలో పెద్ద ఎత్తున నెగటివిటీ నడిచింది. భార్య ఆర్తీతో రవి విడాకులు తీసుకోవడానికి కెనీషానే కారణమంటూ వచ్చిన ట్రోలింగ్ భరించలేక ఆమె ఈ బంధం నుండి తప్పుకుంటున్నట్లు పరోక్షంగా ప్రకటించింది. కష్టకాలంలో తనకు తోడుగా నిలిచిన కెనీషా ఆన్‌లైన్ బుల్లీయింగ్ కారణంగా దూరం జరగడంతో జయం రవిలోని ఆవేదన ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. తన మౌనాన్ని ఆసరాగా చేసుకుని తనపై నిరంతరాయంగా అసత్య ప్రచారాలు చేశారని, తన పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించారని మాజీ భార్య వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ వివాదంలో జయం రవి తన పిల్లల ప్రస్తావన తెస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రిగా తన పిల్లలను కలుసుకునే కనీస హక్కును కూడా తనకు దక్కకుండా చేస్తున్నారని ఆయన కన్నీరు పెట్టుకున్నారు. పిల్లల చుట్టూ బాడీగార్డ్స్‌ను ఉంచి... వారిని స్కూలు వద్ద కూడా కలవనీయకుండా చేస్తున్నారంటూ ఆర్తీపై తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా.. తాను కెరీర్‌లో సంపాదించిన సంపాదన అంతా కోల్పోయానని... ఒక అగ్ర నటుడిగా ఉండి కూడా ప్రస్తుతం తనకు కనీస ఆర్థిక స్వాతంత్య్రం లేకుండా చేశారంటూ తన మాజీ భార్య ఫ్యామిలీ నెట్‌వర్క్‌పై ఆయన మండిపడ్డారు.

మరోవైపు ఈ వివాదంలో ఒక అజ్ఞాత నటి ప్రస్తావన కూడా తెరపైకి వచ్చింది. ఆర్తీకి అత్యంత ఆప్తురాలిగా ఉంటూ.. ఈ వైవాహిక బంధాన్ని విచ్ఛిన్నం చేయడంలో కీలక పాత్ర పోషించిన ఒక మూడు అక్షరాల నటిని జయం రవి `ఇడ్లీ నటి` అని సంబోధిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. సమాజం ముందు నకిలీ ఫెమినిజం మాట్లాడే ఇటువంటి వారే తన సంసారాన్ని ముంచారంటూ రవి చేసిన కామెంట్స్ కోలీవుడ్‌లో కొత్త సమీకరణాలకు దారితీశాయి. ఆర్తీ తరపున నిలబడి తనపై తప్పుడు నరేటివ్స్ క్రియేట్ చేస్తున్న వారిని ఇకపై వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.

ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న ఈ విడాకుల వ్యవహారం.. ఇలా పబ్లిక్ ప్రెస్ మీట్లు, సోషల్ మీడియా క్రిప్టిక్ వార్నింగ్‌ల ద్వారా మరింత సంక్లిష్టంగా మారుతోంది. జయం రవి ఆరోపణలపై ఆర్తీ సైతం `మదర్ లయన్` అంటూ పరోక్షంగా స్పందిస్తూ తన పిల్లల రక్షణే తనకు ముఖ్యమని తేల్చి చెప్పారు. ఒకరినొకరు నిందించుకుంటూ.. వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించుకుంటున్న తీరు సెలబ్రిటీల వ్యక్తిగత గౌరవానికే కాకుండా.. వారి సినిమాల బిజినెస్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపేలా ఉంది. ఈ సుదీర్ఘ వివాదం చట్టపరంగా ఎలాంటి ముగింపునకు చేరుకుంటుందో వేచి చూడాలి.