రిలీజ్ డేట్ ఒకటే.. రిజల్ట్ కూడా రిపీట్ అవుతుందా?
తెలుగు సినీ పరిశ్రమలో సినిమా రిలీజ్ డేట్స్, దర్శక నిర్మాతల కాంబినేషన్లు, పండుగ సీజన్లు, బ్యానర్లు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 4 July 2026 3:38 PM ISTతెలుగు సినీ పరిశ్రమలో సినిమా రిలీజ్ డేట్స్, దర్శక నిర్మాతల కాంబినేషన్లు, పండుగ సీజన్లు, బ్యానర్లు వంటి అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. కొందరు వాటిని కేవలం మార్కెటింగ్ స్ట్రాటజీలుగా చూస్తే, మరికొందరు మాత్రం సక్సెస్‌కు దోహదపడే సెంటిమెంట్లుగా భావిస్తారు. అలాంటి డిస్కషన్‌కే ఇప్పుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం కారణమైంది.
ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తున్న ఈ కొత్త హీరో మొదటి సినిమాను జూలై 30న రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడం ఆసక్తిని పెంచుతోంది. గతంలో ఇదే రోజున మహేష్ బాబు హీరోగా పరిచయమైన రాజ కుమారుడు రిలీజవడం అభిమానుల్లో డిస్కషన్ కు దారి తీసింది. దీంతో ఇది యాదృచ్ఛిక నిర్ణయమా? లేక అభిమానుల సెంటిమెంట్‌ను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న వ్యూహాత్మక అడుగా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
టాలీవుడ్‌లో ఇలాంటి సెంటిమెంట్లు కొత్తేమీ కావు. కొంతమంది స్టార్ హీరోలు తమకు కలిసొచ్చిన పండుగ సీజన్లను పదేపదే ఎంచుకోవడం, కొన్ని నిర్మాణ సంస్థలు స్పెషల్ డేట్స్ పై ఆసక్తి చూపడం, సక్సెస్‌ఫుల్ హీరో- డైరెక్టర్ కాంబినేషన్‌ను మళ్లీ మళ్లీ పునరావృతం చేయడం తరచూ కనిపించే విషయాలే. అయితే ఈ సెంటిమెంట్లు బాక్సాఫీస్ సక్సెస్‌ను హామీ ఇవ్వలేవని గత అనుభవాలే చెబుతున్నాయి. అదే డేట్ లో రిలీజైన ప్రతి సినిమా హిట్ కాలేదు. అలాగే ఎలాంటి సెంటిమెంట్ లేకుండానే ఎన్నో సినిమాలు సంచలన విజయాలు సాధించిన దాఖలాలున్నాయి.
అయితే జయకృష్ణ విషయంలో రిలీజ్ డేట్ కంటే ఎక్కువగా చర్చకు వస్తున్న అంశం స్టార్ కిడ్ అనే గుర్తింపు. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి వస్తుండటంతో సహజంగానే ఆడియన్స్ అతడిని మహేష్ బాబుతో పోల్చడం ప్రారంభించారు. మొదటి టీజర్ నుంచి సినిమా రిలీజ్ వరకు ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో విశ్లేషించే పరిస్థితి ఏర్పడింది. యాక్టింగ్, స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్, యాక్షన్... ప్రతి విభాగంలోనూ మహేష్ కెరీర్ తొలి రోజుల ప్రయాణంతో పోలికలు రావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి పోలికలు ఒకవైపు సినిమాకు అదనపు ప్రచారాన్ని తీసుకురాగలిగినా, మరోవైపు కొత్త హీరోపై ఒత్తిడిని కూడా పెంచుతాయి. ప్రేక్షకులు కేవలం కొత్త నటుడిని మాత్రమే కాకుండా, ఘట్టమనేని వారసుడిగా అతని సామర్థ్యాన్ని కూడా అంచనా వేయడానికి సిద్ధమవుతారు. అలాంటి పరిస్థితుల్లో మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించడం జయకృష్ణకు అతిపెద్ద సవాలుగా మారనుంది.
సినిమా ప్రమోషన్లలో సెంటిమెంట్ ఒక అడిషనల్ ఎట్రాక్షన్ గా పనిచేసి అభిమానుల్లో ఆసక్తిని పెంచగలదు. కానీ ఆఖరికి ఆడియన్స్ థియేటర్ నుంచి బయటకు వచ్చిన తర్వాత గుర్తుంచుకునేది రిలీజ్ డేట్‌ని కాదని, సినిమా ఎంతగా ఆకట్టుకుందన్న విషయాన్నే అనే విషయం గమనించాలి. కథ, కథనం, ఎమోషన్స్, నటీనటుల ప్రదర్శన ప్రేక్షకులను మెప్పించినప్పుడే సినిమా దీర్ఘకాల విజయాన్ని అందుకుంటుంది. అందుకే జూలై 30 తేదీ చుట్టూ ఎంత సెంటిమెంట్ ఉన్నా, జయకృష్ణ కెరీర్‌కు అసలైన పునాది వేయబోయేది శ్రీనివాస మంగాపురంలోని కంటెంట్‌నే. సెంటిమెంట్లు ఓపెనింగ్ ఇవ్వగలవు, కానీ నిలబెట్టేది మాత్రం మంచి సినిమానే అనే విషయం టాలీవుడ్ లో ఇప్పటికే ఎన్నో సినిమాలు నిరూపించాయి.
