డిజాస్టర్ టాక్ తో 100 రోజులు ఆడిన సినిమా.. ఇదేమి ట్విస్ట్ రా బాబు!
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా పరిచయమైన శ్రీనివాస మంగాపురం సినిమా చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో 100 రోజులు పూర్తి చేసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం అందుకోకపోయినా ఈ రన్పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరోవైపు కృష్ణ అభిమానులు మాత్రం ఆయనపై ఉన్న అభిమానంతోనే ఈ గుర్తింపు దక్కేలా చేశారని అంటున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 9 Nov 2026 1:47 PM ISTసూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మూడో తరం హీరోగా పరిచయమయ్యారు రమేష్ బాబు కొడుకు జయకృష్ణ. ఈ హీరో శ్రీనివాస మంగాపురం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను మొదటిసారి పలకరించిన విషయం తెలిసిందే. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా మరో కారణంతో వార్తల్లో నిలిచింది.
శ్రీనివాస మంగాపురం చిలకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్లో 100 రోజులు పూర్తి చేసుకున్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా ఒక సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధిస్తేనే.. వంద రోజుల వేడుకలు నిర్వహించడం చూస్తుంటాం. కానీ ఈ సినిమా విషయంలో ఫలితం ఎలా ఉన్నా, ఒక థియేటర్లో 100 రోజుల ఆదడం అనేది అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
ఈ విషయం బయటకు రావడంతో కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. సినిమా పెద్దగా ఆడకపోయినా ప్రత్యేకంగా వంద రోజుల రన్ పూర్తి చేయించారని కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయాన్ని మరో కోణంలో చూస్తున్న కృష్ణ అభిమానులు కూడా ఉన్నారు. తమ అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణ మనవడు హీరోగా పరిచయమైన తొలి సినిమా కావడంతో, కనీసం ఒక్క థియేటర్లో అయినా వంద రోజులు పూర్తిచేయాలని కోరుకున్నట్లు అభిమానులు చెబుతున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో 50 రోజులు, 100 రోజులు ఆడటం అనేది హీరోల విజయాలకు ముఖ్యమైన గుర్తింపుగా ఉండేది. అభిమానులు తమ హీరో సినిమాలను ఎక్కువ రోజులు థియేటర్లలో కొనసాగించాలని కోరుకునేవారు. అయితే ఇప్పుడు సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి రావడం, ప్రేక్షకుల అభిరుచులు మారడంతో ఆ ట్రెండ్ దాదాపుగా తగ్గిపోయింది. అయినప్పటికీ పాత తరం అభిమానుల్లో ఆ సెంటిమెంట్ ఇంకా కొనసాగుతోంది.
ముఖ్యంగా కృష్ణపై ఉన్న అభిమానంతోనే ఆయన మనవడి తొలి సినిమాకు ఈ గుర్తింపు దక్కేలా ప్రయత్నించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో అభిమానుల ప్రేమను తప్పుపట్టాల్సిన అవసరం లేదని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
