కృష్ణ మూడో తరం కోసం 'పెద్ద' ప్లానింగ్
టాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా జయకృష్ణ ఎంట్రీకి రెడీగా ఉన్నాడు. కృష్ణ తనయుడు అయిన రమేష్ బాబు యొక్క తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది.
By: Ramesh Palla | 28 Aug 2025 11:12 AM ISTటాలీవుడ్ సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మూడో తరం హీరోగా జయకృష్ణ ఎంట్రీకి రెడీగా ఉన్నాడు. కృష్ణ తనయుడు అయిన రమేష్ బాబు యొక్క తనయుడు జయకృష్ణ హీరోగా ఎంట్రీకి రంగం సిద్ధం అవుతోంది. రమేష్ బాబు మృతి చెందిన సమయంలోనే జయకృష్ణ గురించి ప్రముఖంగా వార్తలు వచ్చాయి. అన్నయ్య చనిపోవడంతో జయకృష్ణ ఎంట్రీ బాధ్యతను మహేష్ బాబు తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే జయకృష్ణ చేయబోతున్న సినిమాకు సంబంధించిన చర్చలు మహేష్ బాబు వద్ద జరిగాయని తెలుస్తోంది. అంతే కాకుండా మహేష్ బాబు ఓకే చెప్పిన తర్వాతే కథ లాక్ చేయడం జరిగిందని కూడా ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇదే ఏడాది జయకృష్ణ మొదటి సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నట్లు ఘట్టమనేని ఫ్యామిలీ సన్నిహితులు చెబుతున్నారు.
కృష్ణ మనవడు జయకృష్ణ హీరోగా...
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్న అజయ్ భూపతి ప్రస్తుతం జయకృష్ణ మొదటి సినిమాపై వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిందని, ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో అజయ్ భూపతి బిజీగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. నటీనటుల ఎంపికకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు హీరో తప్ప ఇతర నటీనటులను అధికారికంగా ప్రకటించలేదు. హీరోయిన్‌గా రవీనా ఠాండన్ కుమార్తె రాషా ఠాండన్ ను ఎంపిక చేసేందుకు గాను చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌లో ఈమెను హీరోయిన్‌గా ఇప్పటికే పరిచయం చేశారు. అక్కడ స్టార్ కిడ్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇదే సమయంలో సౌత్‌లోనూ ఈమెను పరిచయం చేసేందుకు గాను ప్రయత్నాలు చేస్తున్నారు.
హీరోయిన్‌గా రాషా ఠాండన్..
ఆ మధ్య మోక్షజ్ఞ హీరోగా పరిచయం కాబోతున్న ప్రశాంత్ వర్మ సినిమా కోసం రాషా ఠాండన్ ను ఎంపిక చేసే అవకాశం ఉందనే వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దాంతో రాషా ఎంట్రీ ఇవ్వక ముందే కనిపించకుండా పోయింది. మళ్లీ ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి ఆమెను తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమెను తీసుకు రావడం వల్ల ఖచ్చితంగా సినిమాకు అదనపు బజ్ క్రియేట్ కావడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇక ఈ సినిమా స్థాయిని మరింత పెంచడం కోసం అజయ్ భూపతి ఈ సినిమాలో మెయిన్ విలన్ పాత్రకు గాను టాలీవుడ్ స్టార్ మోహన్ బాబును నటింపజేయాలని నిర్ణయించుకున్నాడట. అందుకోసం సంప్రదింపులు సైతం మొదలు అయ్యాయి అంటూ ఆయన సన్నిహితుల నుంచి సమాచారం అందుతోంది.
విలన్ పాత్ర కోసం మోహన్ బాబు..
ఈ మధ్య కాలంలో మోహన్ బాబు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా నటించేందుకు రెడీ అన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయినా కూడా ఆయనతో సినిమా అంటే దర్శకులు కాస్త వెనుక ముందు ఆడుతున్నారు. ఇప్పుడు దర్శకుడు అజయ్ భూపతి తన కథతో మోహన్ బాబు వద్దకు వెళ్లారని, ఆయన కథ నచ్చి, పాత్ర నచ్చి సినిమాను చేసేందుకు ఓకే చెప్పారని తెలుస్తోంది. పైగా కృష్ణ మనువడు జయకృష్ణ అరంగేట్రం మూవీ కనుక తన ప్రజెన్స్ వల్ల ఖచ్చితంగా అతడికి మంచి జరుగుతుంది అంటే నటించేందుకు రెడీ అన్నట్లుగా మోహన్ బాబు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందని పుకార్లు వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు అజయ్ భూపతి నుంచి మాత్రం ఈ విషయమై చిన్న లీక్ కూడా రావడం లేదు.
అక్టోబర్‌లో సినిమాకు పూజా కార్యక్రమాలు చేయనున్నారు. ఆ సమయంలో హీరోయిన్, విలన్ ఇలా అన్ని విషయాల గురించి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా కోసం అజయ్ భూపతి ప్రతి విషయంలోనూ 'పెద్ద'గా ఆలోచిస్తున్నాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
