బాలయ్య జయప్రద కాంబో...ఎలా మిస్ అయింది ?
ఇక ఆమె 70 దశకంలో తిరుగులేని స్టార్ డం తో దూసుకుని పోయారు ఆనాడు ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు ఇలా ఆనాటి టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా జయప్రద ఎన్నో సినిమాలు చేశారు
By: Satya P | 12 May 2026 9:16 AM ISTజయప్రద అంటే ఎవర్ గ్రీ బ్యూటీగా పేరు. ఇక ఆమె 70 దశకంలో తిరుగులేని స్టార్ డం తో దూసుకుని పోయారు ఆనాడు ఎన్టీఆర్ ఏఎన్నార్, కృష్ణ శోభన్ బాబు కృష్ణంరాజు ఇలా ఆనాటి టాప్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా జయప్రద ఎన్నో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ జయప్రద జోడీ సూపర్ డూపర్ హిట్ అన్నది నాటి బంపర్ హిట్ మూవీస్ చెబుతాయి. అలాగే సూపర్ స్టార్ క్రిష్ణతో అత్యధిక చిత్రాలలో నటించిన హీరోయిన్ గా జయప్రదకు రికార్డు ఉంది. తెలుగులోనే కాదు బాలీవుడ్ లోనూ తన సత్తాను జయప్రద చాటారు. ఇలా వివిధ భాషలలో ఎన్నో చిత్రాలను చేసి సూపర్ స్టార్ డం ని ఎంజాయ్ చేసిన జయప్రద రాజకీయాల్లోకి వచ్చి లోక్ సభ రాజ్యసభ రెండింట్లోనూ తన ప్రాతినిధ్యంతో ప్రతిభ చాటారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్న జయప్రద తాజాగా ఒక యూట్యూబ్ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు.
బాలయ్యతో జోడీ అంటూ :
తెలుగు సీనియర్ హీరో బాలయ్య అంటే తనకు ఎంతో ఇష్టం అని జయప్రద చెప్పడం విశేషం. ఆయన మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడరు అని ఆమె చెప్పారు. మనసులో ఏది ఉందో అది చెబుతారు అని కల్మషం లేని వ్యక్తి అని ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా బాలయ్య హీరోగా తాను హీరోయిన్ గా ఒక సినిమా ఎలా మిస్ అయిందో ఆమె ఫ్లాష్ బ్యాక్ ముచ్చట్లు చెప్పారు. అప్పట్లో బాలయ్యని హీరోగా పెట్టి ఎన్టీఆర్ ఒక సినిమా తీస్తున్నారు. ఆ మూవీలో హీరోయిన్ గా మొదట జయప్రదని అడిగారు ఎన్టీఆర్. అయితే తనకు అప్పట్లో ఉన్న బిజీ షెడ్యూల్స్ కాల్షీట్ల సమస్య వల్ల ఆ మూవీలో హీరోయిన్ గా నటించలేకపోయాను అని జయప్రద చెప్పారు. ఆ తరువాత తన ప్లేస్ లో దీప హీరోయిన్ గా నటించింది అని గుర్తు చేసుకున్నారు. ఆ మూవీలో బాలయ్యతో తాను నటించాల్సిందని ఆమె అంటూ అలా జరిగి ఉంటే బాగుండేదని అని అన్నారు. అయితే బాలయ్యతో తాను మహారధి మూవీలో నటించాను అని అందులో ఆయనకు అత్త పాత్రలో కనిపిస్తాను అని ఆమె అన్నారు.
బాల చందర్ స్కూల్ :
తాను రజనీకాంత్ కమల్ హాసన్ ముగ్గురం ఒకే సమయంలో చిత్ర సీమలో ప్రవేశించామని జయప్రద చెప్పారు. తమది బాల చందర్ స్కూల్ అని అన్నారు. అంతులేని కధ తమ జీవితాలను మార్చిందని అన్నారు. ఆ సినిమా తరువాత ముగ్గురి సినీ కెరీర్ ఎక్కడికో వెళ్ళిపోయిందని అన్నారు. ఆ తరువాత ఎన్నో సినిమాల్లో తాము నటించామని చెప్పారు. అంతులేని కధ లాంటి పాత్రలు అరుదుగా వస్తాయని ఆమె చెప్పారు. మొదట ఆ పాత్ర చేయడానికి తాను ఎంతగానో భయపడ్డాను అని కానీ చివరికి చాలెంజ్ గా తీసుకుని చెసశాను అని చెప్పారు. అయితే ఈ రోజుకీ ఆ పాత్ర జనం మదిలో ఉండిపోయింది అని అన్నారు. ప్రతీ మహిళా దానిని తమ సొంతంగా భావిస్తారని జయప్రద అన్నారు.
ఏపీలో పనిచేస్తా :
తనకు అవకాశం ఇస్తే ఏపీ రాజకీయాల్లో పనిచేయడానికి సిద్ధం అని అన్నారు. బీజేపీ కేంద్ర పెద్దలు ఏమి ఆదేశిస్తే అలా చేయడానికి తాను రెడీ అని ఆమె అన్నారు. బీజేపీలో మోడీ నాయకత్వంలో పని చేయడం గర్వకారణం అని ఆమె చెప్పారు. మొత్తం మీద చూస్తే జయప్రద తన సుదీర్ఘమైన సినీ కెరీర్ ద్వారా తెలుగు ప్రజల అభిమానాన్ని విశేషంగా పొందారు అనే చెప్పాల్సి ఉంటుంది.
