ఫస్ట్ లుక్.. మహేష్ వైబ్స్ తో ఘట్టమనేని జయకృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వస్తున్న విషయం తెలిసిందే.
By: M Prashanth | 10 Jan 2026 11:40 AM ISTసూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో హీరో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వస్తున్న విషయం తెలిసిందే. దివంగత రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా పరిచయమవుతున్నారు. ప్రస్తుతం డెబ్యూ మూవీ శ్రీనివాస మంగాపురంతో బిజీగా ఉన్నారు. యాక్షన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

తిరుపతి పక్కన ఉండే శ్రీనివాస మంగాపురంలో జరిగే కథతో సినిమా రూపొందుతోందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు సంబంధించి మేకర్స్.. కాన్సెప్ట్ పోస్టర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ అందుకుంది. అందులో హీరో హీరోయిన్ ఇద్దరూ చేతులు పట్టుకొని చేతిలో గన్ ఉన్నట్టు చూపించారు. దీంతో సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి క్రియేట్ అయింది.
అయితే తాజాగా సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. రీసెంట్ గా చెప్పినట్లు మేకర్స్.. జయకృష్ణ ఘట్టమనేని ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు. జయకృష్ణ బాబాయ్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు విడుదల చేశారు. ఇప్పుడు జయకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అందరినీ ఆకట్టుకుని సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తోంది.
ఫస్ట్ లుక్ లో జయకృష్ణ బైక్ పై వెళ్తూనే డేరింగ్ స్టంట్ చేస్తూ, గన్ తో కాల్చుతున్నట్లు కనిపించారు. ఆయన కళ్లలో కసి, ముఖంలో కాన్ఫిడెన్స్ స్పష్టంగా కనిపిస్తుండగా.. మాస్ లుక్ లో అదరగొట్టారు. అయితే పోస్టర్ యంగ్ మహేష్ బాబు, అలాగే లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తుకు తెచ్చేలా ఉందని అనేక మంది అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
అదే సమయంలో కుటుంబ వారసత్వానికి తగ్గట్టుగా యాక్టింగ్ లో, యాక్షన్ లో జయకృష్ణ బాగా కష్టపడుతున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా క్లియర్ గా తెలుస్తుందని అంటున్నారు. అయితే దర్శకుడు అజయ్ భూపతి చాలా ఇంటెన్స్ గా, రా అండ్ రగ్డ్ నెరేషన్ తో జయకృష్ణ డెబ్యూ మూవీని తెరకెక్కిస్తున్నారని సమాచారం. యాక్షన్ తో పాటు మంచి ప్రేమకథ కూడా సినిమాలో ఉంటుందని సమాచారం.
శ్రీనివాస మంగాపురం మూవీతో బాలీవుడ్ నటి రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. హీరోయిన్ గా ఆమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తుండగా.. పి. కిరణ్ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ చిత్రాన్ని సమర్పిస్తుండగా.. సినిమాపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరి ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.
