జయ జయహే తెలంగాణ గేయ రచయిత ఇక లేరు
అందెశ్రీ మృతితో సాహితీ లోకం విషాదంలో మునిగిపోగా, ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
By: Sravani Lakshmi Srungarapu | 10 Nov 2025 2:00 PM ISTప్రముఖ కవి, గేయ రచయిత, తెలంగాణ ఉద్యమ గాయకుడు అందెశ్రీ కన్ను మూశారు. సోమవారం తెల్లవారుఝామున తన నివాసంలో అందెశ్రీ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను గాంధీ హాస్పిటల్ కు తరలించగా, పరిస్థితి విషమించి హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఆయన కన్ను మూశారు.
సాహితీ లోకానికి తీరని లోటు
అందెశ్రీ మృతితో సాహితీ లోకం విషాదంలో మునిగిపోగా, ఆయన మృతి పట్ల పలువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని చెప్పిన తెలంగాణ సీఎం ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని సూచించి, ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేశారు.
జయ జయ జయహే గేయానికి రాష్ట్ర గేయంగా గుర్తింపు
వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జులై 18న జన్మించిన అందెశ్రీ అసలు పేరు అందె ఎల్లయ్య. చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలను అనుభవించిన ఆయన ఎలాంటి సాహితీ నేపథ్యం లేకుండానే తన టాలెంట్ తో అగ్రశ్రేణి కవుల్లో ఒకరిగా ఎదిగారు. ఆయన గేయాల్లో తెలంగాణ గ్రామీణ జీవితం, యాస, సంస్కృతి బాగా కనిపిస్తాయి. ఆయన కవిగానే కాకుండా, తెలంగాణ సాంస్కృతిక, రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. ఆయన రాసిన జయ జయహే తెలంగాణ గేయాన్ని తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రభుత్వం గుర్తించి, ఆయనకు గొప్ప గౌరవాన్ని అందించింది.
ఎన్నో పురస్కారాలు
ఆశు కవిత్వం చెప్పడంలో దిట్ట అయిన అందెశ్రీ 2006లో గంగ సినిమాకు నంది అవార్డను అందుకోగా, 2014లో అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ డాక్టరేట్ తీసుకున్నారు. 2015లో దాశరథీ సాహితీ పురస్కారం, రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం అందుకున్న అందెశ్రీ, 2022లో జానకమ్మ జాతీయ పురస్కారం, 2024లో దాశరథీ కృష్ణమాచార్య సాహితీ పురస్కారంతో పాటూ లోక్‌నాయక్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు.
అందెశ్రీ మృతి పట్లు పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, సినీ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ తదితరులు అందెశ్రీ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ధైర్యం ప్రసాదించాలని కోరారు.
