ఆమె వల్లే ఇండస్ట్రీకి దూరమయ్యా.. ఇన్నాళ్లకు నిజం చెప్పిన జయా బచ్చన్
ప్రముఖ నటిగా.. రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సొంతం చేసుకుంది జయా బచ్చన్.
By: Madhu Reddy | 8 Dec 2025 10:48 AM ISTప్రముఖ నటిగా.. రాజకీయ నాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును సొంతం చేసుకుంది జయా బచ్చన్. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్యగా మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. ఒకప్పుడు స్టార్ సెలబ్రిటీగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఇండస్ట్రీకి దూరమై రాజకీయ రంగంలో బిజీగా మారిన విషయం తెలిసిందే. అంతేకాదు పలు ఇంటర్వ్యూలకు, పలు ఈవెంట్లకు హాజరవుతూ ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.ఈ క్రమంలోనే తాను నటనకు స్వస్తి పలకడానికి కారణం ఆమె అంటూ అసలు నిజాన్ని బయటపెట్టి అందరిని ఆశ్చర్యపరిచింది.
1963 లో సత్యజిత్ రే దర్శకత్వం వహించిన మహానగర్ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 1971లో బిగ్ బీతో వివాహం తర్వాత సినిమాలు తగ్గించింది. 1981లో వచ్చిన సిల్సిలా చిత్రం తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుంది. తిరిగి 1995లో ' డాటర్స్ ఆఫ్ ది సెంచరీ' తో తిరిగి నటనను ప్రారంభించిన ఈమె.. చివరిగా 2023లో ' రాఖీ ఔర్ రాణికి ప్రేమ కహాని' అనే సినిమాలో నటించి మళ్లీ ఇండస్ట్రీకి దూరమైంది. అలా దాదాపు 14 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరమైన జయా బచ్చన్ అసలు కారణం గురించి మాట్లాడుతూ.." నేను సినిమా షూటింగ్ కి వెళ్లేటప్పుడు ఇంట్లోనే మేకప్ వేసుకొని సెట్ కి వెళ్తాను. మా అమ్మాయితో ఎక్కువ సమయం గడిపినట్లు ఉంటుంది అనే ఒక ఆలోచనతో అలా చేసేదాన్ని. అయితే ఎప్పటిలాగే ఒక రోజు నేను మేకప్ వేసుకుంటుంటే.. శ్వేతా నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావమ్మా అని అడిగింది. షూట్ కి వెళ్లడానికి సిద్ధమవుతున్నానని చెప్పాను. వెంటనే శ్వేత.." అమ్మ నువ్వు వెళ్లద్దు.. నాన్నను మాత్రమే వెళ్ళమని చెప్పు" అని చాలా అమాయకంగా అడిగింది.
మా ఇంట్లో ఎంతో మంది పనివాళ్ళు ఉన్నా.. తల్లి లేదు అనే భావన తనను వెంటాడుతోందని అప్పుడే అర్థమైంది. ఇక అంతే విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. అలా శ్వేత అడిగిన ఒక్క మాట కోసం నేను నటనకు స్వస్తి పలికాను అంటూ తన కూతురు కోసమే ఇండస్ట్రీకి దూరమయ్యానని" చెప్పుకొచ్చింది జయా బచ్చన్.మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇవ్వడానికి గల కారణాన్ని చెబుతూ.. "శ్వేత కోరిక మేరకే ఇండస్ట్రీకి దూరమయ్యాను. అలాగే ఒకేలాంటి పాత్రలు రావడంతో కూడా విసుగ్గా అనిపించి ఇండస్ట్రీకి బ్రేక్ తీసుకున్నాను. శ్వేత వివాహం తర్వాత ఒంటరితనం ఎక్కువైంది. ఏదో మిస్ అవుతున్నాను అనే భావన. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నాను. ఇక ఒంటరితనాన్ని ఫీలవుతున్న నేపద్యంలోనే మళ్లీ సినిమాల్లోకి వచ్చాను " అంటూ తెలిపింది. మొత్తానికైతే ఇండస్ట్రీకి దూరం అవ్వడం అలాగే మళ్ళీ రీఎంట్రీ ఇవ్వడం వెనుక కారణాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది జయా బచ్చన్.
