Begin typing your search above and press return to search.

ఫోటోగ్రాఫ‌ర్ క‌ల్చ‌ర్‌ని అవ‌మానించిన సీనియ‌ర్ న‌టికి కౌంట‌ర్

అయితే ఈ వివాదంలో ప‌లువురు రెండుగా చీలిపోయి జ‌యా బ‌చ్చ‌న్ కి కూడా మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు.

By:  Sivaji Kontham   |   2 Dec 2025 10:51 AM IST
ఫోటోగ్రాఫ‌ర్ క‌ల్చ‌ర్‌ని అవ‌మానించిన సీనియ‌ర్ న‌టికి కౌంట‌ర్
X

అమితాబ్ బచ్చ‌న్ స‌తీమ‌ణి, న‌టి జయా బ‌చ్చ‌న్ ఇటీవ‌ల పాప‌రాజీ (ఫోటోగ్రాఫ‌ర్ల హ‌డావుడి) క‌ల్చ‌ర్ పై తీవ్రంగా విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. ఆద‌రాబాద‌రా ఫోటోగ్రాఫ‌ర్ల వ్య‌వ‌హారికాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతూ అవ‌మాన‌క‌ర వ్యాఖ్య‌లు చేసారు. అసలు వీళ్లు ఎవ‌రు? మ‌న‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తారా? అస‌లు వీళ్లు ఏం చ‌దువుకున్నారు? అంటూ చాలా ఘాటు వ్యాఖ్య‌లు చేసారు.

అయితే దీనిని ప్ర‌ముఖ ఫిలింమేక‌ర్, సామాజిక కార్యకర్త అశోక్ పండిట్ తీవ్రంగా ఖండించారు. ఫోటోగ్రాఫ‌ర్లు చాలా క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తార‌ని, వీళ్లంతా పీఆర్వోలు పిల‌వ‌డం వ‌ల్ల మాత్ర‌మే విచ్చేస్తార‌ని అన్నారు. పాప‌రాజీకి వ్య‌తిరేకింగా జ‌యా బ‌చ్చ‌న్ జీ చేసిన ప్ర‌క‌ట‌న‌... వృత్తిని కించ‌ప‌రిచేలా ఉంది. మన చిత్ర పరిశ్రమలోని సీనియర్ సభ్యురాలు, పార్లమెంటేరియన్ అయిన జ‌యాజీకి ఇది తగనిది. వారంతా క‌ష్ట‌ప‌డి ప‌ని చేసే మ‌న స‌భ్యులు. వారిని తార‌లు, పీఆర్‌లు పిలిస్తేనే ఇక్క‌డికి వ‌స్తార‌ని అన్నారు. అయితే ఫోటోగ్రాఫ‌ర్ల‌పై వ్య‌తిరేక అభిప్రాయం ఉంటే, ఇలా త‌ప్పుగా ఆగ్ర‌హానికి గుర‌య్యే బ‌దులు మిమ్మ‌ల్ని మీరు త‌ర‌చి చూడాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది`` అని అన్నారు.

అయితే ఈ వివాదంలో ప‌లువురు రెండుగా చీలిపోయి జ‌యా బ‌చ్చ‌న్ కి కూడా మ‌ద్ధ‌తు ప‌లుకుతున్నారు. నేను జయ జీకి మద్దతు ఇస్తున్నానని ఒక నెటిజ‌న్ స‌మ‌ర్థించాడు. జయాజీ చెప్పింది పూర్తిగా నిజమే. ప్రముఖుల ముందు, సాధారణ వ్యక్తుల ముందు కూడా ఫోటోగ్రాఫ‌ర్లు త‌ప్పుడు మాట‌లు మాట్లాడ‌టం చూశాను. ఇలాంటి వ్య‌వ‌హారాల‌లో వారిని ఎవరూ సమర్థించలేరు. నేను జయాజీకి గట్టిగా మద్దతు ఇస్తున్నాను.. అని మ‌రొక‌రు రాసారు.

భారతీయ చలనచిత్ర & టెలివిజన్ డైరెక్టర్ల సంఘం అధ్యక్షుడైన అశోక్ పండిట్ వ్యాఖ్యానిస్తూ.. స్నోబిష్ ఎలిటిజం జ‌యాజీలో చూసాను...ఆమె క్లాసిస్ట్ అంటూ విమ‌ర్శించారు. అస‌లు జ‌యాజీ ఫోటోగ్రాఫ‌ర్ల‌ను ఏమ‌ని విమ‌ర్శించారు? అంటే.. ఇటీవల ముంబైలో జరిగిన ఈవెంట్‌లో పాపరాజ్జీ సంస్కృతిని జ‌యా బ‌చ్చ‌న్ తీవ్రంగా విమర్శించారు. ఫోటోగ్రాఫ‌ర్ల‌తో త‌నకు ఉన్న‌ సంబంధం గురించి హోస్ట్ ప్ర‌శ్నించ‌గా, ``ఇది వింతగా ఉంది.. నేను మీడియా ఉత్పత్తిని.. కానీ పాపరాజ్జీతో నా సంబంధం సున్నా`` అని అన్నారు. ఈ వ్యక్తులు ఎవరు? ఈ దేశ ప్రజలకు ప్రాతినిధ్యం వహించడానికి వారు శిక్షణ పొందారా? మీరు వారిని మీడియా అని పిలుస్తారా? నేను మీడియా నుండి వచ్చాను! నా తండ్రి జర్నలిస్ట్. అలాంటి వ్యక్తుల పట్ల నాకు అపారమైన గౌరవం ఉంది`` అని కూడా జయా బచ్చ‌న్ కించ‌ప‌రుస్తూ మాట్లాడారు. త‌న తండ్రిలా ఇప్ప‌టి జ‌ర్న‌లిస్టులు హుందాగా లేర‌నేది ఆమె ఉద్ధేశం.

అంతేకాదు ఫోటోగ్రాఫ‌ర్ల డ్రెస్సింగ్ సెన్స్, ఆహార్యాన్ని జ‌యాజీ త‌ప్పు ప‌ట్టారు. ఈ సన్నని ప్యాంటు..మురికి బట్టలు ధరించిన‌ ఈ వ్యక్తులు చేతుల్లో మొబైల్స్‌తో క‌నిపిస్తారు... వీళ్లు సెల్ ఫోన్ ల‌తో ఫోటోలు తీయాల‌ని మేం కోరుకోవాలా? అని వ్యంగ్యంగా ప్ర‌శ్నించారు. వీళ్లు ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారు? ఈ వ్యక్తులు ఎలాంటి వారు? ..ఈ వ్యక్తులు ఎక్కడి నుండి వస్తున్నారు? వారి విద్య ఏమిటి? నేపథ్యం ఏమిటి? మనల్ని ప్రాతినిధ్యం వహిస్తారా? సోషల్ మీడియాల‌లో త‌ప్ప ఇంకేదైనా చేయ‌గ‌ల‌రా? అంటూ ఆల్మోస్ట్ జ‌యా బ‌చ్చ‌న్ ఫోటోగ్రాఫ‌ర్ల ప‌రువు తీసి న‌డిరోడ్డున నిల‌బెట్టారు. అయితే జ‌యాజీ ఇలా ఫోటోగ్రాఫ‌ర్లపై విరుచుకుప‌డ‌టాన్ని చాలామంది స‌మ‌ర్థించ‌గా, కొంద‌రు త‌ప్పు ప‌డుతున్నారు. మెజారిటీ వ‌ర్గం ఆమె ప్ర‌శ్న‌లకు స‌మాధానాలు వారి ద‌గ్గ‌ర ఉన్నాయా? అని కూడా ప్ర‌శ్నిస్తున్నారు. అయితే ఎండ‌న‌కా కొండ‌న‌కా క‌ష్ట‌ప‌డే ఫోటోగ్రాఫ‌ర్ల‌ను జయాజీ ఇలా అనాల్సింది కాద‌ని కొంద‌రు వ్యాఖ్యానిస్తున్నారు.