ప్రచార చిత్రాల విషయంలో ఇచ్చిపడేసిన స్టార్ రైటర్!
సినీ పరిశ్రమలో ప్రచార చిత్రాలు అనే అంశంపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.
By: Srikanth Kontham | 4 May 2026 3:00 PM ISTసినీ పరిశ్రమలో ప్రచార చిత్రాలు అనే అంశంపై గత కొంతకాలంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. దేశభక్తి , రాజకీయ భావజాలాన్ని ప్రతిబింబించే సినిమాలను ప్రచార చిత్రాలుగా ముద్ర వేయడంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ ఈ అంశాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. సినిమా ద్వారా ఒక ఆలోచనను లేదా సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంలో తప్పేమీ లేదని జావేద్ అభిప్రాయపడ్డారు. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదని అది సమాజానికి సందేశాన్ని ఇచ్చే శక్తివంతమైన మాధ్యమమని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సినిమా ఏదో ఒక కోణంలో ఒక భావజాలాన్ని ప్రచారం చేస్తూనే ఉంటుందని విశ్లేషించారు. ఒక మంచి ఆలోచనను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి సినిమాను వాడుకోవడం తప్పు కాదన్నారు. అయితే అది ఎంతవరకు వాస్తవికతకు దగ్గరగా ఉందనేది ముఖ్యమన్నారు. ఇదే క్రమంలో ఇటీవల విడుదలైన `ధురంధర్` సినిమాపైనా ప్రశంసల జల్లు కురిపించారు. తనకు ఈ సినిమా బాగా నచ్చిందని ఇందులోని మేకింగ్ స్టైల్ , కథా గమనం ఆకట్టుకున్నాయన్నారు. దేశ భద్రత , గూఢచారి వ్యవస్థ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ప్రేక్షకులలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపిందని అభిప్రాయపడ్డారు.
ఇలాంటి సినిమాలను కేవలం ప్రచార చిత్రాలుగా చూసి విమర్శించడం సరికాదని సూచించారు. సినిమాలో చూపించే అంశాలు ప్రేక్షకులను ప్రభావితం చేస్తాయని ఆ ప్రభావం సానుకూలంగా ఉన్నప్పుడు దాన్ని ప్రచారం అని పిలిచినా పర్వాలేదని జావేద్ అక్తర్ అన్నారు. సినిమా నాణ్యత చెప్పే కథలోని నిజాయితీ ముఖ్యం తప్ప దానికి ఇచ్చే లేబుల్స్ కాదని అభిప్రాయపడ్డారు. `ధురంధర్` వంటి చిత్రాలు దేశాభిమానాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని కొనియాడారు. కళాకారుడిగా తాను ఎప్పుడూ భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతు ఇస్తానన్నారు.
దర్శకుడు తాను నమ్మిన సిద్ధాంతాన్ని తెరపై ఆవిష్కరించే హక్కును కలిగి ఉంటారన్నారు. సినిమా బాగుంటే దాన్ని ఆస్వాదించాలి తప్ప దాని వెనుక ఉన్న రాజకీయ , సామాజిక నేపథ్యాన్ని వెతకాల్సిన అవసరం లేదని సూచించారు. ఈ వ్యాఖ్యలు సినీ విశ్లేషకుల్లో కొత్త చర్చకు దారితీశాయి. సినిమా అనేది సమాజ ప్రతిబింబమని, అందులో మంచి ఆలోచనలను ప్రచారం చేయడం వల్ల నష్టం లేదని ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. `ధురంధర్` సినిమాను ఆయన సమర్థించిన తీరు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో వాస్తవిక దేశభక్తి చిత్రాలు రావడానికి ప్రోత్సాహాన్ని ఇస్తుందనడంలో సందేహం లేదు.
