అవి నా విలువలకు విరుద్ధం
ప్రముఖ స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ ఇండియాలోని సమాజ వాస్తవికతను ప్రతిబింబించే సినిమాలు నియంత్రణ సంస్థల నుంచి అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని తన నిరాశను వ్యక్తం చేశారు
By: Sravani Lakshmi Srungarapu | 12 Oct 2025 1:00 AM ISTప్రముఖ స్క్రీన్ రైటర్, లిరిసిస్ట్ జావేద్ అక్తర్ ఇండియాలోని సమాజ వాస్తవికతను ప్రతిబింబించే సినిమాలు నియంత్రణ సంస్థల నుంచి అడ్డంకులను ఎదుర్కొంటున్నాయని తన నిరాశను వ్యక్తం చేశారు. రీసెంట్ గా ఓ కార్యక్రమానికి హాజరైన అక్తర్, ఒక చెడ్డ సినిమాను సక్సెస్‌ఫుల్ గా మార్చేది చెడు ఆడియన్సేనని అన్నారు. మన దేశంలో వల్గారిటీ ఇప్పటికి కూడా విస్మరించబడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సినిమాలు రియాలిటీని చూపించడానికి మాత్రమే..
దాని వల్లే తప్పుడు విలువలు, ఆడవాళ్లను అవమానించే దృక్పథం ఎక్కువ అవుతుందని, సమాజంలో జరుగుతుంది ఇదేనని చెప్పారు. సినిమాలు రియాలిటీని చూపించడానికి మాత్రమే ప్రయత్నిస్తాయని చెప్పిన ఆయన, అనంతరంగ్ మెంటల్ హెల్త్ కల్చరల్ ఫెస్టివల్ ప్రారంభ సమావేశంలో సినిమాల్లో చూపించే విషయాలు మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయని అన్నారు.
రెగ్యులర్ ట్రెండ్ వెనుక పరిగెత్తుతున్న నిర్మాతలు
పురుషులు మానసిక ఆరోగ్యం వల్లే అలాంటి సినిమాలు తీస్తున్నారని, వారి మెంటల్ హెల్త్ బాగుపడితే, అలాంటి సినిమాలు తీయరని, ఒకవేళ తీసినా ఆ సినిమాలు వర్కవుట్ అవ్వవని ఆయన అన్నారు. సినిమాలు సమాజంలో ఏం జరుగుతుందో అవే ప్రతిబింబిస్తాయని, నిర్మాతలు కూడా రెగ్యులర్ గా ట్రెండ్ వెనుకే పరిగెత్తుతూ అలాంటి సినిమాలనే తీస్తున్నారని జావేద్ అక్తర్ పేర్కొన్నారు.
అదే ఎక్కువగా బాధిస్తుంది
సినిమాల్లో వల్గారిటీ ఉన్న పాటల్ని పెట్టడం పై కూడా అక్తర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాంటి ఆఫర్లను తాను చాలా రిజెక్ట్ చేశానని, ఎందుకంటే అవి తన విలువలకు వ్యతిరేకంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే సాంగ్స్ ను రికార్డ్ చేసి సినిమాల్లో పెట్టే దానికంటే ఆ సాంగ్స్ సూపర్ హిట్లు అవడమే తనను ఎక్కువగా బాధిస్తున్నాయని, అందుకే సినిమాను ప్రభావితం చేసేది ప్రేక్షకులే అని అక్తర్ చెప్పారు.
సైయారాను ప్రశంసించిన జావేద్ అక్తర్
చోళీ కే పీచే క్యా హై లాంటి సాంగ్స్ కు తమ 8 ఏళ్ల కూతురు చాలా బాగా డ్యాన్స్ చేస్తుందని పేరెంట్స్ గర్వంగా చెప్పడం తాను విన్నానని, ఇవే సమాజ విలువలైతే, పాటలు, సినిమాల నుంచి మీరేం ఆశిస్తారని ప్రశించారు అక్తర్. ఇలాంటి కంటెంట్ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో రీసెంట్ గా వచ్చిన సైయారా సినిమాను చాలా బాగా తీశారని ప్రశంసించారు అక్తర్.
