ఆధ్యాత్మిక సినిమాలతో సుధీర్, నిఖిల్.. ఇద్దరి టార్గెట్ ఒకటే
తెలుగు హీరో సుధీర్ బాబు హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ఆయన జటాధర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
By: M Prashanth | 11 Aug 2025 10:15 PM ISTతెలుగు హీరో సుధీర్ బాబు హిట్ అందుకొని చాలా కాలం అయ్యింది. ఇప్పుడు ఆయన జటాధర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ టైటిల్ చూడగానే ప్రేక్షకులకు డివైన్ వైబ్ వచ్చేసింది. నిజానికి టైటిలే సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది. ఆధ్యాత్మిక టచ్ ఉన్న ఈ సినిమాతో భారీ హిట్ అందుకోవాలని సుధీర్ బాబు ప్రయత్నిస్తున్నారు.
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కీలక పాత్ర పోషిస్తోంది. శివుడికి సంబంధించిన టైటిల్, సోనాక్షి కూడా ఉండడంతో ఇది తెలుగుతోపాటు హిందీలోనూ రూపొందిస్తున్నారు. ఇటీవల మేకర్స్ టీజర్ కూడా రిలీజ్ చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. దర్శకుడు వెంకట్ కళ్యాణ్ ఈ సినిమాను డివోషనల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నారు.
ఈ టైటిల్ తోనే ప్రేక్షకుల దృష్టి తమపై పడేలా చేసుకున్నారు. ఇక ఎలాగైనా ఈ సినిమాతో తన సత్తా చాటుకోవాలని సుధీర్ బాబు భావిస్తున్నారు. కెరీర్ లో ఇది టర్నింగ్ పాయింట్ కావాలని ఆయన అనుకుంటున్నారు. జటాధర లాంటి పవర్ఫుల్ టైటిల్ తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని సుధీర్ బాబు ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు.
మరోవైపు, నటుడు నిఖిల్ సిద్ధార్థ్ కు కూడా సాలిడ్ హిట్ అవసరం. ఆయన ఇప్పటికే కార్తికేయ సినిమాలతో ఇప్పటికే డివోషనల్ జానర్ టచ్ చేశారు. ముఖ్యంగా కార్తికేయ 2 సినిమాతో మాత్రం పాన్ఇండియా లెవెల్ లో క్రేజ్ దక్కించుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించింది. ఇప్పుడు అదే జానర్ టచ్ ఉన్న స్వయంభు సినిమాతో రానున్నారు. భరత్ కృష్ణమాచారి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు ప్రాజెక్ట్ పై అంచనాలు పెంచుతున్నాయి. గ్లింప్స్ చూస్తే, విజువల్స్ కు తొలి ప్రాధాన్యం ఇచ్చినట్లు కనిపిస్తుంది. చాలా గ్రాండ్ గా ఉన్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలకు పని చేసిన సెంథిల్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నాడు. ఈ సినిమాకు నిఖిల్ చాలా కష్టపడుతున్నారు.
ఆయన ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నారు. మరి హిట్ అవసరం ఉన్న ఇద్దరు తెలుగు హీరోలు డివోషనల్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఎవరు అంచనాలు అందుకోవడంలో సక్సెస్ అవుతారు. ఎవరు హిట్ ట్రాక్ ఎక్కుతారనేది చూడాలి.
