సుధీర్ బాబు జటధార టార్గెట్.. చిన్నదే కానీ..
తెలుగులో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, ఈ 8 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వారి అసలు ఫోకస్ అంతా హిందీ మార్కెట్ మీదే ఉన్నట్లుంది.
By: M Prashanth | 1 Nov 2025 9:14 AM ISTసుధీర్ బాబు తన కెరీర్‌లో ఎప్పుడూ కొత్తదనం కోసం ట్రై చేస్తూనే ఉంటాడు. కమర్షియల్ హీరోగా ఉంటూనే, 'సమ్మోహనం' లాంటి క్లాస్ టచ్, 'శ్రీదేవి సోడా సెంటర్' లాంటి రా కంటెంట్ ట్రై చేశాడు. కానీ, ఇప్పుడు అతను తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ లీగ్ లోకి అడుగు పెడుతున్నాడు. 'జటధార' అంటూ పాన్ ఇండియా లీగ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా నవంబర్ 7న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.
"పాన్ ఇండియా" అనగానే వందల కోట్ల బడ్జెట్, 50 నుంచి 100 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ఊహిస్తాం. కానీ 'జటధార' టీమ్ మాత్రం చాలా స్మార్ట్‌గా, రిస్క్ లేని స్ట్రాటజీతో బరిలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే సినిమాకు నాన్ థియేట్రికల్ ద్వారా మంచి డీల్స్ కుదిరినట్లు తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రీ-రిలీజ్ బిజినెస్ కేవలం రూ.6 కోట్లకే లాక్ అయిందట.
ఇక ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ కూడా రూ.8 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక పాన్ ఇండియా సినిమాకు 8 కోట్ల టార్గెట్ ఏంటి అనేది అందరినీ ఆశ్చర్యపరిచే విషయమే. ఇక్కడే మేకర్స్ ప్లాన్ ఏంటో అర్థమవుతోంది. వాళ్లు ఈ సినిమాను కేవలం తెలుగు మార్కెట్‌పై ఆధారపడి రిలీజ్ చేయడం లేదు. ఇది సుధీర్ బాబుకు ఒక టెస్ట్ డ్రైవ్ లాంటిది.
తెలుగులో సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకున్నా, ఈ 8 కోట్లు రాబట్టడం పెద్ద కష్టమేమీ కాదు. వారి అసలు ఫోకస్ అంతా హిందీ మార్కెట్ మీదే ఉన్నట్లుంది. అందుకే, ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సోనాక్షి సిన్హాను కీలక పాత్ర కోసం తీసుకున్నారు. ఆమె కేవలం గెస్ట్ రోల్ కాదు, పవర్‌ఫుల్ ఘోస్ట్ పాత్రలో కనిపిస్తోంది. ఇప్పటికే రిలీజైన ఆమె లుక్స్ నార్త్ ఆడియెన్స్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.
జీ స్టూడియోస్, ప్రేర్నా అరోరా లాంటి పెద్ద బాలీవుడ్ సంస్థలు ప్రొడక్షన్‌లో భాగం కావడంతో, హిందీలో సినిమాను గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. సోనాక్షి ఫ్యాక్టర్, డివైన్ కాన్సెప్ట్ హిందీలో క్లిక్ అయితే, అక్కడ వచ్చే లాభాలన్నీ బోనస్ కిందకే వస్తాయి. అంటే, తెలుగులో సేఫ్ జోన్‌లో ఉంటూ, హిందీలో పెద్ద మార్కెట్‌ను క్రియేట్ చేసుకోవాలన్నది సుధీర్ బాబు ప్లాన్. మొదట లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ చేసి ఆ తరువాత కౌంట్ పెంచాలని చూస్తున్నారు.
వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఈరోజే (నవంబర్ 1) సాయంత్రం 6:30 గంటలకు హైదరాబాద్‌లోని ఆవాసా హోటల్‌లో నిర్వహిస్తున్నారు. మరి, సుధీర్ బాబు వేస్తున్న ఈ లో రిస్క్, హై రిటర్న్ పాన్ ఇండియా స్ట్రాటజీ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
