సోదరిలా ఆదరించిన నటి సవతి అవుతాదని ఊహించలేదే!
ఇద్దరి రిలేషన్ షిప్ గురించి బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ చెవిన పడినప్పటి నాటి హృదయ విదారక క్షణాలను ప్రముఖ గాయని జస్పిందర్ నరులా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు
By: Srikanth Kontham | 10 May 2026 8:00 AM ISTబాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ - దివంగత నటి శ్రీదేవిల ప్రేమాయణం అప్పట్లో ఓ పెద్ద సంచలనం. ఇద్దరి రిలేషన్ షిప్ గురించి బోనీ కపూర్ మొదటి భార్య మోనా కపూర్ చెవిన పడినప్పటి నాటి హృదయ విదారక క్షణాలను ప్రముఖ గాయని జస్పిందర్ నరులా ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. మోనా కపూర్ వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఆ వేదనను దగ్గరి నుండి చూసిన జస్పిందర్ ఆ సమయంలో మోనా ఎంతటి మానసిక క్షోభకు గురైందో తాజాగా రివీల్ చేసారు .శ్రీదేవితో బోనీ కపూర్‌కున్న అఫైర్ గురించి తెలిసినప్పుడు మోనా కపూర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
భర్త తనను మోసం చేస్తున్నాడని తెలిసినా మోనా ఆ బాధను దిగమింగుకుని పిల్లల భవిష్యత్తు కోసం నిలబడ్డారని పేర్కొన్నారు. ఒక స్నేహితురాలిగా మోనా పడ్డ కష్టాన్ని చూసి తాను కూడా ఎంతో బాధపడ్డానని జస్పిందర్ గుర్తు చేసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా మోనా తన హుందాతనాన్ని కోల్పోలేదని కొనియాడారు.
శ్రీదేవిని తన ఇంటికి ఆహ్వానించి ఒక సోదరిలా ఆదరించారు మోనా కపూర్. అలాంటిది తన ఇంటికి వచ్చిన అతిథే తన సంసారం విచ్ఛిన్నం కావడానికి కారణమవుతుందని మోనా అస్సలు ఊహించలేకపోయారు.
బోనీ కపూర్ - శ్రీదేవిల మధ్య బంధం బలపడుతున్న కొద్దీ మోనా ఒంటరితనాన్ని అనుభవించాల్సి వచ్చింది. తన కళ్లముందే సంసారం ముక్కలవుతుంటే ? ఆమె పడ్డ ఆవేదన వర్ణనాతీతమని జస్పిందర్ గుర్తు చేసుకున్నారు.
సినీ రంగంలో ఇలాంటి త్రికోణ ప్రేమకథలు , వివాహేతర సంబంధాలు అనేక కుటుంబాలను ఎలా దెబ్బతీస్తాయో? ఈ ఘటన ఒక ఉదాహరణ. మోనా కపూర్ చివరి శ్వాస వరకు ఆ చేదు జ్ఞాపకాలతోనే గడిపారన్నారు. కానీ ఎప్పుడూ తన గౌరవాన్ని తగ్గించుకునేలా బయటకు ప్రవర్తించలేదని జస్పిందర్ పేర్కొన్నారు.
బోనీ కపూర్ - శ్రీదేవిల వివాహం చట్టబద్ధంగా జరిగినా? అది మోనా కపూర్ జీవితంలో ఓ మాయని మచ్చగా మిగిలిపోయిందని తాజా చర్చ తో మరోసారి స్పష్టమవుతోంది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాల వెనుక ఉండే ఇలాంటి చీకటి కోణాలు ఎంతో విచారాన్ని కలిగిస్తాయి. ఆ కాలంలో ఈ వార్త చిత్ర పరిశ్రమను కుదిపేసింది. అర్జున్ కపూర్ - అన్షులా కపూర్ చిన్న వయసులోనే తల్లి పడే బాధను చూడాల్సి రావడం బాధాకరమని జస్పిందర్ అన్నారు. అయినా మోనా కపూర్ పిల్లలను ఎంతో క్రమశిక్షణతో ధైర్యవంతులుగా తీర్చిదిద్దారని ప్రశంసించారు. ఒక మహిళగా మోనా ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత ఆమె చూపిన స్థైర్యం నేటికీ ఎంతో మందికి ఓ గుణపాఠంలా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీల జీవితాలు పైకి ఎంత రంగులమయంగా కనిపించినా? తెర వెనుక ఇలాంటి ఎన్నో విషాదాలు దాగి ఉంటాయని జస్పిందర్ నరులా మాటలు మరోపారి గుర్తు చేస్తున్నాయి. మోనా కపూర్ మరణించినా ఆమె పట్ల సినీ వర్గాల్లో ఉన్న గౌరవం మాత్రం చెక్కుచెదరలేదు.
