ప్రైమ్ లో లీక్ అంటే.. నమ్మేలా లేదే..
జేసన్ స్టాథమ్ నటించిన యాక్షన్ సినిమా మ్యూటినీ థియేటర్లలోకి రాకముందే అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమివ్వడం అందరికీ ఓ షాక్ ఇచ్చింది.
By: M Prashanth | 21 Aug 2026 1:58 PM ISTజేసన్ స్టాథమ్ నటించిన యాక్షన్ సినిమా మ్యూటినీ థియేటర్లలోకి రాకముందే అమెజాన్ ప్రైమ్‌లో దర్శనమివ్వడం అందరికీ ఓ షాక్ ఇచ్చింది. అమెరికాలో రిలీజ్ కావడానికి కరెక్ట్ గా రెండు రోజుల ముందు ఈ ఫుల్ మూవీ ప్రైమ్ వీడియోలో ప్లే అయింది. ఏదో చిన్న ప్రోమోనో లేదా ట్రైలరో కాదు ఏకంగా గంటన్నరకు పైగా ఉన్న మొత్తం సినిమానే ఆన్లైన్ లో కనిపించింది. విషయం గమనించిన వెంటనే అమెజాన్ ఆ వీడియోను తీసేసింది.
ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ప్రొడక్షన్ సంస్థలు ముందుగానే మాస్టర్ ఫైల్స్, పోస్టర్లు, సబ్ టైటిల్స్ లాంటివి ప్లాట్ ఫామ్స్ కు పంపించడం కామనే. కాబట్టి అమెజాన్ దగ్గర సినిమా ఫైల్ ఉండటంలో వింతేమీ లేదు. కానీ జనాలకు అందుబాటులోకి వచ్చేలా పబ్లిక్ డొమైన్ లోకి ఆ ఫైల్ ఎలా వచ్చింది అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. క్యాస్ట్, క్రూ డీటెయిల్స్ తో సహా అన్ని వివరాలు ఉన్న పేజీలోనే సినిమా కూడా ప్లే అవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
రిలీజ్ కు సరిగ్గా రెండు రోజుల ముందు ఇలాంటి లీక్ జరగడంతో ఇదంతా ప్రమోషన్స్ లో భాగమేనా అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. సినిమా మీద బజ్ క్రియేట్ చేయడానికి కావాలనే ఇలా చేశారా అనే డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. నిజానికి యాక్షన్ సినిమాలతో జేసన్ స్టాథమ్ కు మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ఈ ఒక్క ఇన్సిడెంట్ తో మ్యూటినీ పేరు కూడా ఎక్కువ మందికి రీచ్ అయింది.
అయితే కేవలం హైప్ కోసం ఏకంగా వందల కోట్లతో తీసిన సినిమాను ఇలా ఓటీటీలో వదిలేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి హై క్వాలిటీ ప్రింట్ లీక్ అయితే అది నిమిషాల్లో పైరసీ సైట్లకు వెళ్లిపోతుంది. అదే జరిగితే థియేట్రికల్ రిలీజ్ మీద, ముఖ్యంగా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ మీద తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే ఇది కావాలని చేసిన పబ్లిసిటీ స్టంట్ అనే వాదనను పూర్తిగా నమ్మలేం.
ఒకవేళ ఇదంతా నిజంగానే టెక్నికల్ పొరపాటు అయితే మాత్రం అమెజాన్ లాంటి గ్లోబల్ ప్లాట్ ఫామ్ లో ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిందనే ప్రశ్నలు వస్తున్నాయి. చిన్న పోస్టర్ లేదా ట్రైలర్ ముందే బయటకు రావడం వేరు ఏకంగా ఫుల్ సినిమా లైవ్ లోకి రావడం వేరు. ఈ ఇష్యూ మీద అమెజాన్ తరఫున ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ బయటకు రాలేదు. ఇన్ని డౌట్స్ మధ్య మ్యూటినీ మాత్రం అనుకున్న షెడ్యూల్ ప్రకారమే థియేటర్లలోకి వచ్చేసింది. సినిమా కంటెంట్ కంటే ఇప్పుడు ఈ లీక్ వ్యవహారమే ఎక్కువగా హైలైట్ అవుతోంది. ఇది టెక్నికల్ గ్లిచ్ కారణంగా జరిగిందా లేక ఇంకేదైనా రీజన్ ఉందా అనేది ముందు ముందు తెలియాలి.
