విజయ్ కొడుకు vs రాజమౌళి కొడుకు!
By: M Prashanth | 30 Sept 2026 10:21 AM ISTసినిమా స్టార్ల వారసులు అంటే ఠక్కున గుర్తొచ్చేది సిల్వర్ స్క్రీన్‌పై హీరోలుగా ఎంట్రీ ఇవ్వడమే. ఫ్యాన్ బేస్, తండ్రి ఇమేజ్‌ను వాడుకుని హీరోలుగా సెటిల్ అవ్వాలని చూసే రోజులివి. కానీ ఈ అక్టోబర్ 2 బాక్సాఫీస్ రేసులో మాత్రం ఒక సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. ఇద్దరు టాప్ సెలబ్రిటీల వారసులు తెరపై కనిపించే స్టార్‌డమ్ జోలికి పోకుండా, తెరవెనుక ఉండి ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద అమీతుమీ తేల్చుకోబోతున్నారు.
కోలీవుడ్ దళపతి విజయ్‌కు సౌత్ అంతటా ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఆయన కొడుకు జాసన్ సంజయ్ స్క్రీన్ మీద కనిపిస్తేనే కోట్ల బిజినెస్ జరుగుతుంది. కానీ జాసన్ మాత్రం హీరో వేషాల వెంట పడకుండా లండన్‌లో ఫిలిం మేకింగ్ నేర్చుకుని, మెగాఫోన్ పట్టుకుని డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. సందీప్ కిషన్‌తో 'సిగ్మా' అనే స్టైలిష్ రాబరీ థ్రిల్లర్‌ను తెరకెక్కించి తనకంటూ ఒక సొంత గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నాడు.
మరోవైపు ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి కొడుకు ఎస్.ఎస్. కార్తికేయ. తండ్రి నీడలోనే ఉంటూ లైన్ ప్రొడక్షన్ పనులతో సరిపెట్టుకోకుండా, ఇప్పుడు పూర్తి స్థాయి నిర్మాతగా మారాడు. ఫహాద్ ఫాజిల్ లాంటి విలక్షణ నటుడిని పట్టుకుని 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' (DTTT)తో సోషియో ఫాంటసీ జోనర్‌లో తన లక్కుని పరీక్షించుకుంటున్నాడు. చిన్నప్పటి నుంచి సెట్స్‌పై చూసిన సినిమా బిజినెస్‌ను ఇప్పుడు స్వయంగా తానే లీడ్ చేస్తున్నాడు.
విచిత్రం ఏంటంటే.. ఈ ఇద్దరి ఆలోచనలు, ప్రాజెక్టుల సెలక్షన్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. జాసన్ సంజయ్ అర్బన్ యూత్‌ను టార్గెట్ చేస్తూ హీస్ట్ డ్రామాతో స్టైలిష్ యాక్షన్‌ను నమ్ముకుంటే, కార్తికేయ మాత్రం కిడ్స్, ఫ్యామిలీస్ చుట్టూ తిరిగే మ్యాజిక్, జీనీ కాన్సెప్ట్‌ను ఎంచుకున్నాడు. ఒకరు తమిళ స్టార్ కొడుకై ఉండి తెలుగు హీరోను డైరెక్ట్ చేస్తుంటే, మరొకరు తెలుగు స్టార్ డైరెక్టర్ కొడుకై ఉండి మలయాళ నటుడితో సినిమా తీస్తున్నారు. ఈ క్రాస్ ఇండస్ట్రీ కాంబినేషన్సే ఇక్కడ అసలైన హైలెట్.
హీరోలుగా వస్తే ఫస్ట్ డే ఫ్యాన్స్ తోపులాటతో ఓపెనింగ్స్ కొట్టేయొచ్చు. కానీ డైరెక్టర్‌గా జాసన్‌కు, ప్రొడ్యూసర్‌గా కార్తికేయకు అలాంటి ఫ్యాన్ ప్రివిలేజ్ ఏమీ ఉండదు. స్క్రీన్ మీద కంటెంట్ ఏమాత్రం తేడా కొట్టినా విమర్శలు నేరుగా వీరిద్దరి మీదే పడతాయి. లైకా, మైత్రీ లాంటి బడా సంస్థలు జాసన్ విజన్ మీద నమ్మకం పెడితే, బాహుబలి నిర్మాతల అండతో కార్తికేయ బడ్జెట్ హద్దులు దాటి ఖర్చు పెట్టాడు.
అంటే రిస్క్ పరంగా చూసినా ఇద్దరిదీ కత్తిమీద సామే. గాంధీ జయంతి నాడు ఫహాద్, సందీప్ కిషన్ తలపడుతున్నట్లు పైకి కనిపిస్తున్నా, ట్రేడ్ వర్గాల అసలు ఫోకస్ మాత్రం ఈ ఇద్దరు వారసుల జడ్జిమెంట్ మీదే ఉంది. తెరపై కాకుండా తెరవెనుక నిలబడి సినిమాను నడిపించాలనుకున్న వీరి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.
