Begin typing your search above and press return to search.

విజయ్ బయోపిక్‌.. హీరోగా జేసన్ సంజయ్..!

విజయ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కనుందనే ప్రచారం తమిళ సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఇందులో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా నటిస్తారని, రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ధనుష్‌తో ‘ఓం’ సినిమా చేస్తున్న రాజ్‌కుమార్, విజయ్‌కు వీరాభిమాని కావడం ఈ ప్రచారానికి మరింత ఆసక్తి పెంచుతోంది.

By:  Priya Chowdhary Nuthalapti   |   16 Nov 2026 1:25 PM IST
విజయ్ బయోపిక్‌.. హీరోగా జేసన్ సంజయ్..!
X

తమిళనాడు రాజకీయాల్లోనే కాకుండా సినిమా రంగంలోనూ ప్రస్తుతం విజయ్ పేరు మారుమోగుతోంది. ముఖ్యంగా విజయ్ సి. ఏం అయ్యి సినిమాలకి దూరమైన దగ్గర నుంచి, ఆయన అభిమానులు కొంచెం బాధలోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విజయ్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కబోతోందనే ప్రచారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యి వాళ్ళకి ఆనందం తీసుకొస్తోంది. అంతేకాదు..ఈ సినిమాలో విజయ్ తనయుడు జేసన్ సంజయ్ హీరోగా నటించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

విజయ్‌కు జేసన్ సంజయ్ కు ..ఎక్కువగా పోలికలు ఉంటాయి అన్న సంగతి తెలిసిందే. తండ్రి జీవితాన్ని తెరపై చూపిస్తూ, ఆయన పాత్రలో తనయుడే నటిస్తే ఇక ఆ సినిమాకి వచ్చే క్రేజ్ చెప్పనవసరం లేదు. ఇక అంతే కాకుండా ఈ సినిమాని, అమ్మరన్, ఓం సినిమా దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించనున్నారు అన్న వార్తల్లో కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే ఈ బయోపిక్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

మరోవైపు విజయ్‌పై దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామికి ఉన్న అభిమానం గురించి నటి సాయి పల్లవి ఈ మధ్యనే కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు కూడా చేసింది. విజయ్ నటిస్తున్న జన నాయగన్ సినిమా ప్రమోషనల్ వీడియో చూసి రాజ్‌కుమార్ పెరియసామి చాలా ఎమోషనల్ అయ్యారని సాయి పల్లవి వెల్లడించారు. వన్ లాస్ట్ డ్యాన్స్ పేరుతో విడుదలైన ఆ వీడియో చూసినప్పుడు ఆయన కళ్లలో నీళ్లు తిరిగాయని ఆమె తెలిపారు. విజయ్‌కు వీరాభిమాని అయిన రాజ్‌కుమార్‌ను తాను అలా ఎప్పుడూ చూడలేదని సాయి పల్లవి చెప్పడం విశేషం.

విజయ్ సినిమాల ప్రయాణాన్ని మాత్రమే కాకుండా ఆయన రాజకీయ ఎదుగుదలను కూడా రాజ్‌కుమార్ దగ్గరగా గమనించారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఓం' సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ధనుష్, సాయి పల్లవి, మమ్ముట్టి, శ్రీలీల, నాజర్ వంటి ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో భాగమయ్యారు. ఈ సినిమా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మారి ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు విజయ్ బయోపిక్ ప్రకటిస్తారేమో వేచి చూడాలి.