Begin typing your search above and press return to search.

సందీప్ సెంటిమెంట్‌లోకి సంజయ్ కూడా?

సినీ ఇండ‌స్ట్రీలో ఒక హీరోతో కలిసి పనిచేసిన డైరెక్ట‌ర్ల కెరీర్ ట్రాక్‌ను గమనిస్తే, ఆ కాంబినేషన్ వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 Sept 2026 3:56 PM IST
సందీప్ సెంటిమెంట్‌లోకి సంజయ్ కూడా?
X

సినీ ఇండ‌స్ట్రీలో ఒక హీరోతో కలిసి పనిచేసిన డైరెక్ట‌ర్ల కెరీర్ ట్రాక్‌ను గమనిస్తే, ఆ కాంబినేషన్ వెనుక ఉన్న ప్రత్యేకత ఏంటో అర్థమవుతుంది. ఇప్పుడు అలాంటి ఆసక్తికరమైన చర్చే సందీప్ కిషన్ విషయంలో మొదలైంది. సందీప్‌తో కలిసి పనిచేసిన పలువురు డైరెక్ట‌ర్లు ఆ తర్వాత తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండస్ట్రీలో కీలక స్థానాల్లో నిలిచారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు త‌మిళ స్టార్ హీరో విజ‌య్ కొడుకు జేసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ నటించిన సిగ్మా కూడా ఆసక్తిని పెంచుతోంది. అక్టోబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ప్రమోషన్స్‌లో భాగంగా సందీప్ చేసిన కామెంట్స్ ఈ కాంబినేషన్‌పై మరో ఆసక్తికరమైన కోణాన్ని తెరపైకి తెచ్చాయి.

తనతో వ‌ర్క్ చేసే డైరెక్ట‌ర్ల‌లో తాను ముందుగా చూసే విషయం ఒక్కటేనని సందీప్ చెప్పాడు. తనకంటే ఎక్కువగా సినిమాను ప్రేమించే వ్యక్తినా కాదా అన్నదే చూస్తాన‌ని తెలిపాడు. ప్రతిరోజూ మంచి సినిమా చేయాలనే కసి ఉన్న డైరెక్ట‌ర్ల‌తో పనిచేయడానికి తాను ప్రయత్నిస్తానని వెల్లడించాడు. తన కెరీర్‌లో వ‌ర్క్ చేసిన డైరెక్ట‌ర్లంతా కష్టపడి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పిన సందీప్.. ఈ విషయంలో జేసన్ సంజయ్ కూడా తనను ఆకట్టుకున్నార‌ని పేర్కొన్నాడు. ముఖ్యంగా తనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పనిని సులభంగా పూర్తి చేయొచ్చనే ఆలోచనతో కాకుండా, ఒక ఫస్ట్ టైమ్ ఫిల్మ్ మేకర్ ఎంత కష్టపడతాడో సంజ‌య్ కూడా అంతే శ్రమించార‌ని చెప్పాడు.

ఇక్కడే సందీప్ కెరీర్‌లోని మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వస్తోంది. తనతో కలిసి పనిచేసిన టైమ్ లోనే కాకుండా, ఆ తర్వాత డైరెక్ట‌ర్లుగా ఎదిగిన పలువురు టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్స్‌తో సందీప్ జర్నీ కొనసాగింది. అందుకే ఇప్పుడు సిగ్మాతో జేసన్ సంజయ్ పేరు కూడా ఆ ట్రాక్‌లోకి చేర‌నుందా అనే డిస్క‌ష‌న్ మొదలైంది. అయితే జేసన్ ఫ్యూచ‌ర్ పై ఇప్పుడే ఎలాంటి అంచనాలు వేయకుండా, అతని మొద‌టి సినిమా విషయంలో సందీప్ చెప్పిన మాటలను మాత్రం ఆసక్తిగా చూడాల్సిందే.

సిగ్మా విషయంలో జేసన్ తీసుకున్న మరో డెసిష‌న్ కూడా త‌న‌కు నచ్చిందని ఈ సంద‌ర్భంగా సందీప్ చెప్పాడు. సినిమా మొద‌లుపెట్టే ముందే సంజ‌య్ తనకు బౌండ్ స్క్రిప్ట్ ఇచ్చాడ‌ని, అందులో ఉన్నదాన్ని మార్చకుండా అదే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చాడ‌ని చెప్పాడు. అంతేకాదు, సినిమా కోసం అవసరమైన టైమ్, బడ్జెట్ విషయంలోనూ డిసిప్లిన్ పాటించాడ‌ని వివరించాడు. 24 ఏళ్ల వయసులో ఈ సినిమాను మొద‌లుపెట్టిన జేసన్, తన టీమ్‌తో కలిసి చాలా కూల్‌గా వ‌ర్క్ చేశాడని, వారి నుంచి తాను కూడా నేర్చుకున్నానని సందీప్ చెప్పడం విశేషం.

అందుకే సిగ్మా విషయంలో ఇంట్రెస్ట్ కేవలం విజయ్ కొడుకు జేసన్ సంజయ్ తొలి సినిమా అనే దానిపైనే కాదు. సందీప్ కిషన్ డైరెక్ట‌ర్ లో వెతికే ఆ ఒక్క క్వాలిటీని జేసన్ ఎంతవరకు నిలబెట్టుకున్నాడనే దానిపైనా ఉంది. గతంలో సందీప్‌తో కలిసి పనిచేసిన డైరెక్ట‌ర్ల జ‌ర్నీని బ‌ట్టి చూస్తే.. ఇప్పుడు ఆ లిస్ట్ లో జేసన్ సంజయ్ కూడా జాయిన్ అవుతాడా అన్నది సిగ్మా రిలీజ్ తర్వాతే స్పష్టమవుతుంది.