Begin typing your search above and press return to search.

తండ్రితో విబేధాల ప్రచారం నడుమ.. CM వార‌సుడి అనూహ్య స్పంద‌న‌!

ఇటీవలి కాలంలో విజయ్ .. ఆయన తనయుడు సంజయ్ మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది.

By:  Sivaji Kontham   |   9 Sept 2026 8:15 PM IST
తండ్రితో విబేధాల ప్రచారం నడుమ.. CM వార‌సుడి అనూహ్య స్పంద‌న‌!
X

తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి జోసెఫ్ విజయ్ తనయుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా పరిచయమవుతున్న `సిగ్మా` సినిమా సేలంలో నిర్వహించిన ప్రీ-రిలీజ్ వేడుకలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా లైకా ప్రొడక్షన్స్ నిర్మించిన ఈ హీస్ట్ కామెడీ మూవీ ఈవెంట్‌లో జేసన్ సంజయ్ ప్రసంగిస్తుండగా.. అభిమానులు విజయ్ స్థాపించిన `తమిళగ వెట్రి కళగం` (TVK) పార్టీ నినాదాలతో హోరెత్తించారు. వేదికపై `మా కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు` అని సంజయ్ చెప్పగానే జనాలు పెద్ద ఎత్తున కేకలు వేశారు. అభిమానుల హంగామాతో తన ప్రసంగాన్ని కాసేపు ఆపిన సంజయ్ చిరునవ్వుతో థంబ్స్-అప్ చూపుతూ అభిమానుల జోష్‌కు స్పందించడం ఆకట్టుకుంది.

ఇటీవలి కాలంలో విజయ్ .. ఆయన తనయుడు సంజయ్ మధ్య తీవ్ర విబేధాలు ఉన్నాయంటూ ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ ఈవెంట్ విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. సంజయ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో విజయ్‌ను అన్‌ఫాలో చేశారని.. తన పేరులోని `V` స్థానంలో తల్లి సంగీత జ్ఞాపకార్థం `S`గా మార్చుకున్నారని పుకార్లు వచ్చాయి. అయితే ఈ ఈవెంట్‌లో సంజయ్ స్పందిస్తూ... తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా తండ్రి విజయ్ నటించిన `తిరుమలై` అని... తాను దర్శకుడినయ్యానని తెలిశాక మొదటి ఫోన్ కాల్ అమ్మకే చేశానని తెలిపారు. అలాగే హీరో సందీప్ కిషన్ వేదికపై విజయ్‌ను తమ సినిమాకు పెద్ద ఇన్‌స్పిరేషన్ అని అభివర్ణించగా... సంజయ్ కూడా చిరునవ్వుతో దానికి మద్దతు తెలపడం విశేషం.

విజయ్ నటించిన చివరి సినిమా `జన నాయగన్` జూలై 23న విడుదల కావడంతో సంజయ్ దర్శకత్వం వహించిన `సిగ్మా` విడుదల వాయిదా పడింది. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకు ముందుకు రాబోతోంది. తండ్రి రాజకీయ - సినీ ప్రభావాన్ని గౌరవిస్తూనే.. ఒక సాధారణ యువకుడిగా సంజయ్ చూపించిన పరిణతి కోలీవుడ్ వర్గాల్లో ట్రెండింగ్‌గా మారింది.

త్రిష‌తో ద‌ళ‌ప‌తి విజ‌య్ స్నేహం గురించి విజ‌య్ భార్య తీవ్రంగా ఆరోపించిన త‌ర్వాత .. ఆ కుటుంబంపై చాలా రూమ‌ర్లు వ‌చ్చాయి. ఒకానొక ద‌శ‌లో ఈ ఫ్యామిలీ డ్రామా కార‌ణంగా విజ‌య్ త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో గెలుస్తారా లేదా? అనే సందిగ్ధ‌త నెల‌కొంది. కానీ ప్ర‌జ‌లు అత‌డి వ్య‌క్తిగ‌త విష‌యాల కంటే, అత‌డిలోని నాయ‌కుడిని చూసి ఓట్లు వేసారు. ఇప్పుడు నెమ్మ‌దిగా విజ‌య్ త‌న కుటుంబంలో స‌మ‌స్య‌ల్ని కూడా స‌ర్ధుబాటు చేసుకుంటున్నారని అర్థ‌మ‌వుతోంది. త‌న భార్య‌తో వివాదం లేకుండా సామ‌ర‌స్య‌పూర్వ‌కంగా స‌ర్ధుబాట్లు చేసుకుంటూనే త‌న‌యుడితోను ఆయ‌న స‌న్నిహితంగా ఉంటున్నార‌ని అర్థం చేసుకోవ‌చ్చు.

సిగ్మా క‌థాంశం - కాస్ట్ అండ్ క్రూ:

దర్శకుడు జేసన్ సంజయ్ తెరకెక్కిస్తున్న తొలి చిత్రం `సిగ్మా` ఒక భారీ `హీస్ట్ కామెడీ` థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంటోంది. నిర్ణయాలు, సమస్యల నుంచి ఎదిగిన ఒక సాధారణ యువకుడి కథాంశంతో ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఈ సినిమా ఉంటుందని సమాచారం. ఈ చిత్రంలో సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తుండగా... సంపత్ రాజ్, శివ్ పండిట్, యోగ్ జేపీ, షీలా రాజ్‌కుమార్ , ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు రాజు సుందరం ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై అద్భుత‌మైన‌ నిర్మాణ విలువలతో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌కి ఎస్. థమన్ స్వరాలు సమకూర్చారు.