స్టార్ కిడ్‌కు అసలైన అగ్ని పరీక్ష
స్టార్ హీరోల వారసులు సినీ పరిశ్రమలోకి అడుగుపెడితే హీరోగా ఎప్పుడు వస్తున్నారునే ప్రశ్న మొదటిగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ యాక్టర్ వారసుడిని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు.
By: Sravani Lakshmi Srungarapu | 2 July 2026 4:00 PM ISTస్టార్ హీరోల వారసులు సినీ పరిశ్రమలోకి అడుగుపెడితే హీరోగా ఎప్పుడు వస్తున్నారునే ప్రశ్న మొదటిగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ కూడా తమ ఫేవరెట్ యాక్టర్ వారసుడిని బిగ్ స్క్రీన్ పై చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో తమిళ స్టార్ విజయ్ కొడుకు జేసన్ సంజయ్ మాత్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ హీరోగా కాకుండా డైరెక్టర్ గా తన కెరీర్ ను స్టార్ట్ చేయడం ఆసక్తికర చర్చకు దారితీసింది.
విజయ్‌కు ఉన్న అపారమైన క్రేజ్ దృష్ట్యా జేసన్ హీరోగా పరిచయమైతే మొదటి సినిమా నుంచే భారీ ఓపెనింగ్స్ రావడం దాదాపు ఖాయమనే అభిప్రాయం ఇండస్ట్రీలో చాలామందికి ఉంది. అభిమానుల మద్దతు, ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్, మార్కెట్ స్ట్రెంగ్త్ .. ఇవన్నీ కలిసి అతడిని మొదటి రోజే వార్తల్లో నిలబెట్టేవి. అయితే మంచి ఓపెనింగ్ రావడం ఒక విషయం అయితే, కెరీర్‌ను నిలబెట్టుకోవడం మరో విషయం. ఆడియన్స్ నుంచి ఒక హీరోకు పూర్తి స్థాయి అంగీకారం రావాలంటే అది నటన, కథల ఎంపిక, టాలెంట్ ను బట్టే దక్కుతుంది కానీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ వల్ల కాదని గతంలో ఎన్నో ఉదాహరణలు ప్రూవ్ చేశాయి.
అందుకే జేసన్ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు డేరింగ్ స్టెప్ అని అంటుంటే, మరికొందరు మాత్రం కెమెరా ముందు నిలబడి అభిమానుల అంచనాల భారాన్ని మోయడం కంటే, కెమెరా వెనుక తన ఆలోచనలను తెరపై ఆవిష్కరించే మార్గాన్ని ఎంచుకోవడం ద్వారా అతడు భిన్నమైన గుర్తింపును సంపాదించాలని ప్రయత్నిస్తున్నాడనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే జేసన్ సెలెక్ట్ చేసుకున్నది ఈజీ దారేమీ కాదు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ గా మొదటి సినిమానే అతని విజన్, కథ చెప్పే తీరు, సాంకేతిక అవగాహన అన్నింటికీ పరీక్షగా మారనుంది.
ఇక సిగ్మా విషయానికొస్తే ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. దీంతో జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై సహజంగానే అంచనాలు పెరిగాయి. సినిమా సక్సెస్ అందుకుంటే జేసన్‌ను కొత్త తరం డైరెక్టర్ల లిస్ట్ లో బలంగా నిలబెట్టే అవకాశముంటుంది. అదే సిగ్మా ఆశించిన రిజల్ట్ ను అందుకోకపోతే, అతని దర్శకత్వ ప్రయాణం మరింత కఠినమైన పరీక్షలను ఎదుర్కోవాల్సి రావచ్చు. సిగ్మా హీరో సందీప్ కిషన్ కూడా జేసన్‌పై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేయడం చర్చనీయాంశమైంది. డైరెక్టర్ గా అతని ఆలోచనా విధానం, కథను తెరకెక్కించే తీరు బలంగా కనిపించిందని ఆయన కామెంట్ చేస్తున్నారు. దీంతో సిగ్మా కేవలం ఒక సినిమా మాత్రమే కాకుండా, డైరెక్టర్ గా జేసన్ సంజయ్ ఫ్యూచర్ కు పునాది వేసే ప్రాజెక్ట్‌గా మారింది.
హీరోగా వచ్చి తొలి రోజు రికార్డులు సృష్టించడం ఒక మార్గమైతే, డైరెక్టర్ గా మంచి సినిమాతో గుర్తింపు తెచ్చుకోవడం కూడా గొప్ప విషయమే. ఏ దారి ఎంచుకున్నా చివరికి అందరినీ ఆకట్టుకునేది మాత్రం టాలెంట్, కంటెంట్, ప్రేక్షకుల ఆమోదమే. జేసన్ సంజయ్ కూడా ఇప్పుడు అదే పరీక్షను ఎదుర్కొంటున్నాడు. సిగ్మా ఫలితం అతని కెరీర్‌లో తొలి అధ్యాయాన్ని ఎలా రాస్తుందో తెలుసుకోవాలంటే విడుదల రోజు వరకు వేచి చూడాల్సిందే.
