Begin typing your search above and press return to search.

తండ్రిని డైరెక్ట్ చేయాల్సి వ‌స్తే! సూప‌ర్‌స్టార్ల‌ వార‌సులు ఏమ‌న్నారంటే?

ప్రముఖ నటుడిగా మాస్, యాక్షన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్‌ను తెరపై ఒక కొత్త కోణంలో చూడాలని ఆయన తనయుడు, యువ దర్శకుడు జేసన్ సంజయ్ మనసులోని కోరికను బయటపెట్టారు.

By:  Sivaji Kontham   |   25 Sept 2026 8:00 AM IST
తండ్రిని డైరెక్ట్ చేయాల్సి వ‌స్తే! సూప‌ర్‌స్టార్ల‌ వార‌సులు ఏమ‌న్నారంటే?
X

ప్రముఖ నటుడిగా మాస్, యాక్షన్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న విజయ్‌ను తెరపై ఒక కొత్త కోణంలో చూడాలని ఆయన తనయుడు, యువ దర్శకుడు జేసన్ సంజయ్ మనసులోని కోరికను బయటపెట్టారు. ఒకవేళ భవిష్యత్తులో తండ్రిని దర్శకత్వం వహించే అవకాశం వస్తే.. కేవలం ఆయన సూపర్ స్టార్ ఇమేజ్ చుట్టూ కథను అల్లాలని తాను అనుకోనని జేసన్ స్పష్టం చేశారు. కేవలం స్టార్‌గా కాకుండా ఇంట్లో తాను దగ్గరగా చూసిన విజయ్ వ్యక్తిగత స్వభావాన్ని, ఆయనలోని మరో కోణాన్ని తెరపైకి తీసుకురావాలన్నదే తన అసలు ఆలోచన అని తెలిపారు.

తండ్రిలో తాను ఎక్కువగా ఇష్టపడే గుణం ఆయనలోని `సెన్స్ ఆఫ్ హ్యూమర్` (హాస్య చతురత) అని జేసన్ పేర్కొన్నారు. ఇంట్లో విజయ్ చాలా సరదాగా, ఫన్ నేచర్‌తో ఉంటారని.. ఆ జోవియ‌ల్ వ్యక్తిత్వమే ఆయనలోని అసలైన చిన్నపిల్లాడిని బయటకు తెస్తుందని అభిప్రాయపడ్డారు. గతంలో విజయ్ చేసిన కొన్ని చిత్రాల్లో పూర్తి స్థాయి లైటర్-వీన్, ఫన్ రోల్స్ బాగా పండాయని.. అయితే కాలక్రమేణా ఆయన సినిమాలన్నీ పూర్తిగా యాక్షన్ , లార్జర్-దెన్-లైఫ్ పాత్రల వైపు మళ్లాయని జేసన్ విశ్లేషించారు.

ఒకవేళ తండ్రి-కొడుకుల కలయికలో సినిమా వస్తే.. వెండితెరపై కొద్దిగా కనుమరుగైన ఆ సరదా వైవిధ్యాన్ని ఈజీ-గోయింగ్ పర్సనాలిటీని తిరిగి ప్రేక్షకులకు చూపించాలనే పట్టుదలతో ఉన్నట్లు జేసన్ వెల్లడించారు. కేవలం సూపర్‌స్టార్ విజయ్‌ను డైరెక్ట్ చేయడం కంటే.. రోజూ ఇంట్లో తాను చూసే సహజమైన, సరదా మనిషిని ఆడియన్స్‌కు పరిచయం చేయడమే తన నిజమైన లక్ష్యమని జేసన్ సంజయ్ వెల్లడించారు.

ఇదే కోవలో మరో ప్రముఖ నటుడి కుమారుడి ఆలోచనలను పరిశీలిస్తే.. ఆర్యన్ ఖాన్ తన తండ్రి షారూఖ్ ఖాన్‌ను ఒకవేళ దర్శకుడిగా తెరపైకి తీసుకువస్తే ఎలా చూపిస్తారనే దానిపై ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. అయితే.. ఆయన తన తండ్రితో కలిసి పనిచేసేటప్పుడు బ్రాండ్ ప్రకటనలకు దర్శకత్వం వహించేటప్పుడు లేదా వ్యాపార రంగంలో భాగస్వామిగా ఉన్నప్పుడు షారూఖ్ వ్యక్తిత్వాన్ని ఎలా విశ్లేషించారో పలు సందర్భాల్లో గుర్తు చేసుకున్నారు.

తండ్రి గురించి మాట్లాడుతూ.. షారూఖ్ ఖాన్ తన రోజువారీ వ్యాపారంలో.. చేసే పనిలో ఎంతో పరిణతిని, సంయమనాన్ని పాటిస్తార‌ని.. ఆయనకున్న అపారమైన అనుభవం తనలాంటి యువ సృష్టికర్తలకు పనులను మరింత సులభం చేస్తుందని ఆర్యన్ అభిప్రాయపడ్డారు. అలాగే సినిమాలలో షారూఖ్‌కు ఉండే లీనమయ్యే తత్వం.. సాంకేతిక విషయాలపై చిన్నప్పట్నుంచీ తనకు నేర్పిన మెలకువలను ఆర్యన్ తరచూ గుర్తుచేసుకుంటూ ఉంటారు.