ఈ అవాకులు చవాకులు అనవసరం అని తేల్చేసిన CM విజయ్ కుమారుడు!
ఒక వైపు తండ్రి రాజకీయ ప్రయాణం.. మరోవైపు తన సినీ కెరీర్ నడుమ ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడారు.
By: Sivaji Kontham | 4 Aug 2026 4:07 PM ISTకోలీవుడ్ నటుడు `తమిళగ వెట్రి కళగం` (టీవీకే) అధినేత విజయ్ తనయుడు జేసన్ సంజయ్.. తన తండ్రి సాధించిన చారిత్రాత్మక రాజకీయ విజయం, తన దర్శకత్వ అరంగేట్రం `సిగ్మా` విశేషాలు.. తమ కుటుంబంపై వస్తున్న రకరకాల పుకార్లపై ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు తండ్రి రాజకీయ ప్రయాణం.. మరోవైపు తన సినీ కెరీర్ నడుమ ఎదురవుతున్న సవాళ్ల గురించి మాట్లాడారు.
తమిళనాడు రాజకీయాల్లో తన తండ్రి సాధించిన గెలుపు ఒక గొప్ప విప్లవమని అభివర్ణించిన జేసన్ ఈ విజయం తమ కుటుంబం మొత్తంపై అదనపు బాధ్యతను పెంచిందని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక విజయం వల్ల నేను, నా చెల్లెలు, కుటుంబ సభ్యులందరం ఆ వారసత్వాన్ని ఎంతో జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ప్రతి విషయంలోనూ మేము ఎంతో అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది! అని ఆయన వివరించారు.
స్టార్ హీరో కొడుకైనా.. విజయ్ తనకి విజయాన్ని ఊరికే పళ్లెంలో పెట్టి ఇవ్వలేదని జేసన్ వెల్లడించారు. తన తండ్రి ఎప్పుడూ సొంతంగా కష్టపడి గుర్తింపు తెచ్చుకోవాలనే కోరుకునేవారని.. కింది స్థాయి నుంచి అనుభవాన్ని సంపాదించమని ప్రోత్సహించారే తప్ప దేన్నీ ఉచితంగా అందించలేదని అన్నారు. తండ్రి అందించిన ఈ మార్గదర్శకత్వానికి.. తల్లి సంగీత, కుటుంబ సభ్యుల మద్దతుకు యువదర్శకుడు జేసన్ కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవలి కాలంలో తమ కుటుంబ వ్యక్తిగత జీవితంపై.. ముఖ్యంగా తల్లిదండ్రుల బంధంపై వస్తున్న పుకార్లపై జేసన్ పరోక్షంగా స్పందించారు. సోషల్ మీడియాలో వచ్చే వ్యాఖ్యలు, విమర్శలను తాను గమనిస్తుంటానని చెబుతూ.. కొందరు ప్రోత్సహించడానికి కామెంట్లు చేస్తే.. మరికొందరు ఊహాగానాలతో తమ వ్యక్తిత్వాలను, కుటుంబాన్ని విమర్శిస్తుంటారని వ్యాఖ్యానించారు. ఏదేమైనా తమ కుటుంబానికి ప్రజల నుంచి దక్కే ప్రేమ, వారసత్వంతో పాటు పెద్ద బాధ్యత కూడా ఉందన్నారు.
విజయ్- సంగీత దంపతులకు ఏకైక కుమారుడు జేసన్ సంజయ్, కుమార్తె దివ్య శాష ఉన్నారు. వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియా వేదికగా ఎన్ని పుకార్లు షికారు చేస్తున్నా.. విజయ్ కుటుంబం వాటిపై నేరుగా స్పందించకుండా తమ పనులపైనే దృష్టి పెడుతోంది. ఒకవైపు తండ్రి రాజకీయ నాయకుడిగా ప్రజాసేవలో ముందడుగు వేస్తుంటే .... మరోవైపు కుమారుడు జేసన్ దర్శకుడిగా తన కొత్త ప్రయాణాన్ని ఆరంభించి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు.
