గాయని జాస్మిన్ సాండ్లాస్ పై అసభ్య ప్రవర్తన!
పంజాబీ గాయని, `దురంధర్` ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ ఇటీవల ఓ సంగీత కచేరీలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
By: Srikanth Kontham | 20 July 2026 2:32 PM ISTపంజాబీ గాయని, `దురంధర్` ఫేమ్ జాస్మిన్ సాండ్లాస్ ఇటీవల ఓ సంగీత కచేరీలో చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నారు. లైవ్ పర్ఫార్మెన్స్ ఇస్తోన్న సమయంలో గుంపులో ఉన్న కొందరు వ్యక్తులు ఆమె పట్ల అత్యంత అసభ్యంగా ప్రవర్తించడం సోషల్ మీడియాలో దుమారాన్ని రేపుతోంది. వేదిక వద్ద భద్రతా వైఫల్యం ప్రేక్షకుల ప్రవర్తన పట్ల సర్వత్రా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. కచేరీలో భాగంగా జాస్మిన్ పాటలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండగా ఉన్నట్టుండి ఆమె వైపు దూసుకొచ్చిన కొందరు వ్యక్తులు తాకడానికి, అసభ్యంగా ప్రవర్తించడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో ఆమె తీవ్ర ఇబ్బందికి గురవ్వడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక కళాకారిణి గౌరవాన్ని పణంగా పెట్టి వేదికపై కూడా రక్షణ లేని పరిస్థితి నెలకొనడం సమాజంలోని చీకటి కోణాన్ని బయటపెట్టింది.
ఈ సంఘటనపై స్పందించిన నెటిజన్లు, కళాకారులకు ఇస్తోన్న భద్రతపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సెలబ్రిటీల ప్రదర్శనల సమయంలో తగినంత భద్రతా చర్యలు లేకపోవడం వల్లనే ఇలాంటి ఘటనలు పునరావృత మవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేదికపై ఉన్న గాయనిని కాపాడటంలో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది కనీస బాధ్యతను కూడా ప్రదర్శించలేదని.. ఇది చాలా దురదృష్టకరమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలాంటి ఘటనలు జాస్మిన్ సాండ్లాస్‌కే కాదు. వేదికలపై ప్రదర్శనలు ఇచ్చే ఎంతోమంది మహిళా కళాకారులకు నిత్యం ఎదురయ్యే సవాళ్లు. మహిళా కళాకారుల పట్ల సమాజంలో ఉన్న చులకన భావానికి ఇదొక పరాకాష్ట. సంగీత కచేరీలు అంటే కళను ఆస్వాదించే వేదికలు. కానీ వాటిని వేధింపులకు అడ్డాగా మార్చడం హేయమైన చర్య.
కళాకారుల పట్ల కనీస గౌరవం లేని ఇలాంటి వారి తీరుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. ఈ ఘటనపై ఇప్పటి వరకు సదరు ఈవెంట్ నిర్వాహకులు గానీ.. అధికార యంత్రాంగం గానీ ఎలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోలేదు. కళాకారులకు సురక్షితమైన వాతావరణం కల్పించడం నిర్వాహకుల కనీస బాధ్యత. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని చట్టం ముందు నిలబెట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందని నెటి జనులు కోరుతున్నారు.
