Begin typing your search above and press return to search.

జానీకి ఛాన్స్ ఇస్తే నో కోపరేషన్.. మాస్టర్‌ కు కష్టాలు తప్పవా?

టాలీవుడ్‌ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ మరోసారి వివాదం చర్చనీయాంశంగా మారింది.

By:  M Prashanth   |   18 July 2026 12:57 PM IST
జానీకి ఛాన్స్ ఇస్తే నో కోపరేషన్.. మాస్టర్‌ కు కష్టాలు తప్పవా?
X

టాలీవుడ్‌ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ మరోసారి వివాదం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో డ్యాన్సులతో సందడి చేసే జానీ మాస్టర్ ఇప్పుడు తన కొరియోగ్రఫీ కంటే ఫెడరేషన్‌ తో నెలకొన్న విభేదాల కారణంగా కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది.

ఫిల్మ్ ఫెడరేషన్ ప్రకటించిన వివరాల ప్రకారం.. జానీ మాస్టర్‌ పై సహాయ నిరాకరణ విధించాలని నిర్ణయించింది. అంటే ఆయన ఏ సినిమాలో పనిచేసినా, ఫెడరేషన్ పరిధిలోని ఇతర క్రాఫ్టుల సభ్యులు ఆ చిత్రానికి కోపరేట్ చేయకూడదని సూచించింది. ఆ నిర్ణయాన్ని నిర్మాతలకు కూడా అధికారికంగా తెలియజేయనున్నట్లు ఫెడరేషన్‌ స్పష్టం చేసింది. దీంతో ఆ వ్యవహారం వ్యక్తిగత విభేదాల స్థాయిని దాటి పరిశ్రమ రేంజ్ లో చర్చకు దారితీసింది.

వాస్తవానికి.. ఫెడరేషన్ అభ్యంతరాలకు అసలు కారణంగా జానీ మాస్టర్ వ్యవహార శైలి నిలిచింది. సంస్థ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించడం, ఫెడరేషన్ నాయకత్వంపై బహిరంగ వ్యాఖ్యలు చేయడం, సభ్యుల మధ్య విభేదాలు సృష్టించేలా మాట్లాడడం వంటి అంశాలపై ఫెడరేషన్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనను వివరణ ఇవ్వాలని కోరినా, విచారణకు హాజరు కాలేదని ఫెడరేషన్ పేర్కొంటోంది.

ఇదే సమయంలో జానీ మాస్టర్ కుటుంబం వైపు నుంచి కూడా వేరే వాదనలు వినిపిస్తున్నాయి. డ్యాన్సర్స్ అసోసియేషన్‌ లో అక్రమాలు, అవకతవకలపై ప్రశ్నలు లేవనెత్తినందుకే తమపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపిస్తున్నారు. కొందరు సభ్యులపై చర్యలు ప్రారంభించిన తర్వాతే వివాదం ముదిరిందని అంటున్నారు. దీంతో ఇది కేవలం వ్యక్తిగత వివాదమా, లేక ఆధిపత్య పోరాటమా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ప్రస్తుతం అందరి దృష్టి ఫెడరేషన్ వార్నింగ్ పైనే ఉంది. నిర్ణయించిన గడువులోగా జానీ మాస్టర్ సరైన వివరణ ఇవ్వాలని, అవసరమైతే బహిరంగంగా స్పందించాలని ఫెడరేషన్‌ కోరుతోంది. లేకుంటే మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది. ఆ వ్యవహారంలో అత్యంత కీలకమైన అంశం ఏమిటంటే.. ఒకవేళ సహాయ నిరాకరణ మొత్తానికి అమల్లోకి వస్తే, జానీ మాస్టర్‌ తో పనిచేయాలనుకునే నిర్మాతలు, దర్శకులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

ఎందుకంటే సినిమా నిర్మాణంలో ఒక్క డ్యాన్స్ విభాగం మాత్రమే కాకుండా, అనేక క్రాఫ్టులు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఫెడరేషన్ నిర్ణయం అమల్లోకి వస్తే పలు ప్రాజెక్టులపై ఎఫెక్ట్ పడే అవకాశం కోసం అంతా డిస్కస్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఆ వివాదానికి ముగింపు జానీ మాస్టర్ రెస్పాన్స్ పైనే ఆధారపడి ఉన్నట్లు కనిపిస్తోంది. ఆయన వివరణ ఇస్తారా? ఫెడరేషన్‌ తో రాజీకి వస్తారా? లేక వివాదం ముదురుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం రానున్న రోజుల్లో తేలనుంది. అప్పటివరకు ఆ విషయం హాట్ టాపిక్‌ గా కొనసాగే అవకాశం కనిపిస్తోంది.