గ్లామర్ రోల్స్.. అసలు జాన్వీ ఒపీనియన్ ఏంటి?
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఆమె చేస్తున్న పాత్రలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది.
By: M Prashanth | 6 Jun 2026 12:39 PM ISTబాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ టాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్నప్పటికీ, ఆమె చేస్తున్న పాత్రలపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ సాగుతోంది. స్టార్ హీరోల సరసన నటిస్తున్నా, తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకునే రేంజ్ లో రోల్స్ మాత్రం రావడం లేదని కొందరు సినీ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. రీసెంట్ గా రిలీజైన పెద్ది చిత్రంలో జాన్వీ పోషించిన అచ్చియమ్మ పాత్రపై మిక్స్ డ్ రెస్పాన్స్ వస్తోంది.
నిజానికి రామ్ చరణ్ తో ఆమె జోడీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు స్ట్రాంగ్ రోల్ ఇచ్చి ఉంటారని అభిమానులు భావించారు. అయితే సినిమా విడుదలైన తర్వాత, జాన్వీ పాత్రకు కథలో పెద్దగా ప్రాధాన్యం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా ఆమెను ఎక్కువగా గ్లామర్ యాంగిల్ లోనే చూపించారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఇది మొదటిసారి కాదని నెటిజన్లు గుర్తు చేస్తున్నారు.
టాలీవుడ్ లో ఆమె తొలి చిత్రం దేవరలోనూ జాన్వీ పాత్ర లిమిటెడ్ గా ఉందని అప్పట్లో విమర్శలు వచ్చాయి. తంగం పాత్రలో కనిపించిన ఆమెకు కథలో చెప్పుకోదగ్గ స్కోప్ లేకపోవడం, కొన్ని సీన్స్, పాటలకు మాత్రమే పరిమితం కావడం అప్పట్లోనూ చర్చనీయాంశమైంది. దీంతో తెలుగులో ఇప్పటివరకు చేసిన రెండు సినిమాల్లోనూ యాక్టింగ్ కు అవకాశమున్న పాత్రలు దక్కలేదనే అభిప్రాయం ఫ్యాన్స్ లో వ్యక్తమవుతోంది. స్ట్రాంగ్ రోల్స్ దక్కితే ఆమెలోని అసలు టాలెంట్ బయటపడుతుందనే భావన వినిపిస్తోంది.
అదే సమయంలో జాన్వీ కపూర్ కు సంబంధించిన ఓ పాత వీడియో సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతోంది. ఆ వీడియోలో స్క్రీన్ పై తనను ఎలా ప్రెజెంట్ చేయాలనేది దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ దే నిర్ణయమని ఆమె చెప్పినట్లు కనిపిస్తోంది. "డైరెక్టర్ లేదా డీవోపీ కెమెరాను ఎలా ఉపయోగించాలనుకుంటారనేది వారిదే ప్లాన్. ఒక రోల్ లో ఎలా చూపించాలనేది కూడా వారి నిర్ణయమే" అనే ఆమె చెప్పినట్టు వీడియోలో వినిపిస్తోంది.
అలాగే తనపై ఇప్పటికే గ్లామర్ డాల్ తరహా ఇమేజ్ ఏర్పడిందని, అందువల్ల చాలామంది మేకర్స్ కూడా అదే యాంగిల్ లో తనను చూపించాలని భావిస్తారని జాన్వీ పేర్కొన్నట్లు ఆ వీడియోలో ఉంది. అయితే ఒక నటిగా ప్రతి విషయంపై తాను నిర్ణయం తీసుకునే స్థితిలో ఉండనని, క్యారెక్టరైజెషన్ లో మేకర్స్ ఆలోచనే మెయిన్ గా వర్క్ చేస్తుందంటూ ఆమె చేసిన కామెంట్స్ మళ్లీ చర్చకు దారితీశాయి.
ఏదేమైనా ఇప్పుడు జాన్వీ కామెంట్స్, ఆమె పోషించిన రోల్స్ రెండూ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ అయినప్పటికీ, రోల్ విషయంలో తుది నిర్ణయం దర్శకులదేనంటూ ఆమె చేసిన కామెంట్స్ ను పలువురు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కానీ కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం చేయకుండా కథలో ఇంపార్టెన్స్ ఉన్న పాత్రలు ఇస్తే జాన్వీ నటిగా మరింత గుర్తింపు తెచ్చుకునే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం త్రోబ్యాక్ వీడియోతో పాటు ఆమె జర్నీపై జోరుగా సోషల్ మీడియాలో చర్చ కొనసాగుతోంది.
